Skip to main content

MBBS: యథేచ్ఛగా సీట్ల బ్లాకింగ్!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్ల బ్లాకింగ్‌తో కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు యథేచ్ఛగా అక్రమ దందా సాగిస్తున్నాయి.
MBBS
యథేచ్ఛగా ఎంబీబీఎస్ సీట్ల బ్లాకింగ్!

డబ్బు తీసుకొని అందుకు సహకరిస్తూ కొందరు విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ‘నీట్‌’ అర్హత ద్వారా 2021–22 వైద్య విద్యాసంవత్సరంలో ఈ తరహాలో సీట్లు పొందిన 56 మంది తెలుగు విద్యార్థులు యాజమాన్యాలతో చీకటి ఒప్పందంలో భాగంగా ఆ తర్వాత అడ్మిషన్లు రద్దు చేసుకోవడంతో ఆ సీట్లన్నీ ఎన్‌ఆర్‌ఐ కోటాలోకి మారాయి. దీంతో ప్రైవేటు కాలేజీలకు కాసుల వర్షం కురిసింది. అయితే సీట్లు వదులుకున్న విద్యార్థులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మూడేళ్లపాటు డిబార్‌ చేయగా ఆ విద్యార్థులు మాత్రం 2022 కూడా ‘నీట్‌’లో ర్యాంకు తెచ్చుకొని 2022–23 వైద్య విద్యాసంవత్సరానికి సైతం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డిబార్‌ చేసిన కారణంగా వారు దరఖాస్తు చేసుకోవడం కుదరదని కాళోజీ వర్సిటీ ప్రకటించడంతో ఆ విద్యార్థులు కోర్టుకెక్కినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సీట్ల బ్లాక్‌ దందా వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

చదవండి: Medical: భారీగా పెరిగిన పీజీ సీట్లు

దళారులతో కలసి స్కెచ్‌..

తెలంగాణ రాష్ట్రంలో 2022–23 వైద్య విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మొదలవడంతో ఎంబీబీఎస్‌ సీట్లలో మరోసారి భారీ కుంభకోణానికి రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు తెరలేపాయి. కన్వీనర్, బీ కేటగిరీ సీట్లలో చేరే విద్యార్థులకు డబ్బు ఆశ చూపి సీట్లను వదిలేసుకొనేలా చేయడం ద్వారా వాటిని సీ కేటగిరీ సీట్లుగా మార్చి సొమ్ముచేసుకొనేందుకు స్కెచ్చేశాయి. బీ కేటగిరీ సీటుకు ఏడాదికి రూ. 11.55 లక్షలు, కన్వీనర్‌ కోటాకు రూ. 60 వేలు ఫీజు ఉంది. బీ కేటగిరీ సీట్లను ఈసారి 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే కేటాయించడం, మిగిలిన 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాలకు కేటాయించడంతో దళారులను రంగంలోకి దించాయి. వారు కొందరు రాష్ట్ర విద్యార్థులతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను సైతం ఈ దందాకు ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు.

చదవండి: Medical and Health Department: ఏపీలో జూడాలకు స్టైపెండ్‌ పెంపు

దందా సాగేది ఇలా..

బీ కేటగిరీ సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్, చివరి మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక మిగిలే సీట్లు ఆటోమెటిక్‌గా సీ (ఎన్‌ఆర్‌ఐ) కేటగిరీ కోటా సీట్లుగా మారిపోతాయి. దీన్నే కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఉదాహరణకు ‘నీట్‌’లో మెరుగైన ర్యాంకు సాధించి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ సీటు సంపాదించే విద్యార్థి చేత తెలంగాణలోనూ బీ కేటగిరీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేలా ఒప్పిస్తాయి. కౌన్సెలింగ్‌లో సీటు రాగానే ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించి ఆ విద్యార్థి కాలేజీలో చేరిపోతాడు. ఇలా ఆ విద్యార్థి రెండు చోట్లా సీట్లు పొంది చేరుతాడు. అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాక తెలంగాణలో తన సీటును రద్దు చేసుకుంటాడు. అయితే సీటు రద్దు చేసుకున్నందుకు కాళోజీ వర్సిటీకి రూ. 3 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉండగా కాలేజీ యాజమాన్యాలు ఇచ్చే సొమ్ములోంచి ఆ జరిమానా చెల్లించి సీటు రద్దు చేసుకుంటాడు. తిరిగి ఇతర రాష్ట్రంలో తాను చేరిన కాలేజీకి వెళ్లి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పిస్తాడు. దీంతో అతను తెలంగాణలో వదిలేసిన బీ కేటగిరీ సీటు ఎన్‌ఆర్‌ఐ సీటుగా మారిపోతోంది. ఎన్‌ఆర్‌ఐ సీటును ఎంతకు అమ్ముకున్నా అడిగే నాథుడే లేకపోవడంతో డిమాండ్‌ను బట్టి రూ. కోటిన్నరకుపైగా కాలేజీల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. 2021–22లో ఇలా 56 సీట్లను రూ. పదుల కోట్లకు అమ్ముకున్నాయి. సీట్లు వదులుకున్న విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల వరకు యాజమాన్యాలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. 

చదవండి: MBBS: హిందీలో పాఠ్యపుస్తకాలు

Published date : 02 Nov 2022 03:09PM

Photo Stories