Medical: భారీగా పెరిగిన పీజీ సీట్లు
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టి, వీటిలో 5 వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తోంది. మరో వైపు పీజీ సీట్ల పెంపుపైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 2019కి ముందు వరకు రాష్ట్రంలో 970 పీజీ సీట్లే ఉండేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా డీఎంఈలో 106 ప్రొఫెసర్, 312 అసోసియేట్ ప్రొఫెసర్, 832 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కొత్తగా సృష్టించింది. ఖాళీగా ఉన్న పోస్టులను కలుపుకుని ఏకంగా 1,254 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టింది. దీని ఫలితంగా మూడేళ్లలో ఏకంగా 207 పీజీ సీట్లు అదనంగా సమకూరాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో 1,177 పీజీ సీట్లు ఉన్నాయి. మరో 746 సీట్ల మంజూరుకు దరఖాస్తు చేశారు. ఈ లెక్కన 2019 వరకు మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న పీజీ సీట్లు 970 కాగా.. 2019 నుంచి మూడున్నరేళ్లలోనే మరో 953 సీట్లు పెరిగినట్టు అవుతుంది. తద్వారా పెద్ద సంఖ్యలో స్పెషాలిటీ వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారు.
చదవండి: NMC: ఈ కాలేజీల్లో బయోమెట్రిక్ తప్పనిసరి
ఒక్క పోస్టు ఖాళీగా ఉండకుండా
ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో డీఎంఈలో ఇటీవల వాక్–ఇన్‌ఇంటర్వ్యూలు నిర్వహించారు. అవసరమనుకుంటే ప్రైవేటు రంగంలో ఇచ్చే భారీ వేతనాలను ప్రభుత్వ రంగంలోనూ ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
చదవండి: Medical and Health Department: ఏపీలో జూడాలకు స్టైపెండ్ పెంపు
దరఖాస్తులు ఎన్‌ఎంసీ పరిశీలనలో ఉన్నాయి
746 పీజీ సీట్ల మంజూరుకు దరఖాస్తు చేశాం. ఇవి ఎన్‌ఎంసీ పరిశీలనలో ఉన్నాయి. ఎన్‌ఎంసీ తనిఖీలు పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరానికి పీజీ సీట్లు కొత్తగా మంజూరవుతాయి. మరో వైపు కొత్తగా నిర్మిస్తున్న 17 కళాశాలలు నిర్ణీత సమయానికి çఅందుబాటులోకి వస్తే మూడు వేల పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
– ఇన్‌చార్జి డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్