Skip to main content

NMC: ఈ కాలేజీల్లో బయోమెట్రిక్‌ తప్పనిసరి

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని National Medical Commission (NMC) నిర్ణయించింది.
Biometric is mandatory in medical colleges
ఈ కాలేజీల్లో బయోమెట్రిక్ తప్పనిసరి

ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు, ట్యూటర్లు, సీనియర్‌ రెసిడెంట్లు, వైద్యులు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేసుకోవడం తప్పనిసరి చేసింది. అందుకు సంబంధించిన బయోమెట్రిక్‌ పరికరాలను అవసరాన్ని బట్టి తగిన సంఖ్యలో ఆయా కాలేజీలు నెలకొల్పాలని సూచించింది. అధ్యాపకులు, ఇతర వైద్య సిబ్బంది హాజరును పర్యవేక్షించడం కోసం ప్రతి పరికరాన్ని ఇంటర్నెట్‌ కనెక్షన్‌తో అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది.

చదవండి: NMC: గ్రామాల్లో కుటుంబాలను దత్తత తీసుకోనున్న వైద్య విద్యార్థులు

మెడికల్‌ కాలేజీలు ఆయా బయోమెట్రిక్‌ యంత్రాలను నిరంతరంపని చేసేలా చూసు కోవాలి. అలాగే బయోమెట్రిక్‌ హాజరుకు సంబంధించి రోజువారీ డేటాను సేకరించాలి. అందుకు సంబంధించి ఏవైనా అవాంతరాలు, తప్పులు, యంత్రాలు పాడవడం వంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ డేటాను ఎన్‌ఎంసీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఎవరైనా ఉద్యోగి రెండ్రోజుల కంటే ఎక్కువగా ఏ కారణం లేకుండా గైర్హాజరు కాకూడదు. బయోమెట్రిక్‌లో వేలిముద్రకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే, వాల్‌ మౌంటెడ్‌ ఐరిస్‌ స్కాన్‌ /వాల్‌ మౌంటెడ్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ పరికరాలు ఉపయోగించాలని స్పష్టం చేసింది. అలాగే మెడికల్‌ కాలేజీలు తమ రోజువారీ సమయంపై స్పష్టమైన సర్క్యులర్‌ జారీచేయాలి. ఆ ప్రకారం షిఫ్ట్‌లను బట్టి ఉద్యోగుల హాజరు కచ్చితంగా ఉండాలి. రోజుకు రెండుసార్లు (అంటే మెడికల్‌ కాలేజీకి వచ్చినప్పుడు, అలాగే ఇంటికి వెళ్లేప్పుడు) హాజరును నమోదు చేసుకోవాలి. ఎవరైనా బయోమెట్రిక్‌ హాజరు విధానం పాటించకపోతే ఆ మేరకు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు తమ సొంత మార్గదర్శకాలను అనుసరించాలి. ఏదైనా మెడికల్‌ కాలేజీలో సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘన/ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ హ్యాకింగ్‌ జరిగితే వెంటనే ఎన్‌ఎంసీ దృష్టికి తీసుకురావాలి. 

చదవండి: ఈ కాలేజీల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి

Published date : 22 Oct 2022 01:37PM

Photo Stories