Telangana: విద్యాప్రమాణాల ‘ఉన్నతి’ కోసం ఈ ప్రోగ్రాం
ఆరు నుంచి తొమ్మిది తరగతుల విద్యార్థుల కోసం దీనిని రూపొందించారు. కార్యక్రమ ఆవశ్యకత, లక్ష్యాలు, విధివిధానాలు, వాచకాలు, బోధన ప్రణాళికలు తదితర అంశాలపై అవగాహన కోసం ఉన్నత తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
జిల్లాలో 117 హైస్కూ ళ్లు, 85 ప్రాథమికోన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు, ఒక మోడల్ స్కూల్‌లోని విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. కార్యక్రమం అమలుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు సబ్జెక్ట్ టీచర్ల నుంచి ఎంపిక చేసిన రిసోర్స్‌పర్సన్లను గుర్తించారు. వీరికి ఆగస్టు 17, 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లోని టీఎస్ ఐపార్డ్‌లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వారు జిల్లాలోని మిగతా ప్రధానోపాధ్యాయులకు నేటినుంచి శిక్షణ ఇవ్వనున్నారు.
చదవండి: Admissions: ‘నవోదయ’ దరఖాస్తు గడువు మరోసారి పెంపు
బోధన ప్రణాళిక ఇలా..
విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. వార్షిక, పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. 45 నిమిషాల పీరియడ్‌లో చెప్పాల్సిన అంశాలను పిల్లల స్థాయికి అనుగుణంగా రూపొందించుకుంటారు. ప్రతీ పీరియడ్‌లో భాషతో పాటు భాషేతర అంశంలో కూడా కొంత సమయాన్ని పిల్లలతో చదివించడానికి కేటాయిస్తారు.
సబ్జెక్టుల వారీగా నిర్దేశించిన సామర్థ్యాలను పరీక్షించి పిల్లల ప్రగతిని రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ప్రధానోపాధ్యాయులు నెలవారీగా నిర్వహించే పాఠశాల స్థాయి సమీక్షా సమావేశంలో పిల్లల ప్రగతిపై చర్చిస్తారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, సమీక్షా సమావేశాల్లో ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేసి వారికి మార్గదర్శనం చేస్తారు.