Department of Education: ‘పది’ ఫలితాలపై నజర్
నేటి నుంచి ఆగస్టు 23 వరకు పది మండలాలకు సంబంధించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల 105 మంది ప్రధానోపాధ్యాయులకు జిల్లాకేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలలో, ఆగస్టు 24 నుంచి 28 వరకు హుజూరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 67 మంది ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు మోడల్ స్కూల్, కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు శిక్షణ కొనసాగుతుంది.
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని.. ‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రాథమిక పాఠశాలలకు ‘తొలిమెట్టు’.. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9 విద్యార్థులకు ‘ఉన్నతి’ పేరుతో అమలు చేస్తున్న కార్యక్రమాల మాదిరిగానే.. పదో తరగతి విద్యార్థులకు ‘లక్ష్య’ అమలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయి శిక్షణ పూర్తిచేశారు. జిల్లాస్థాయి శిక్షణను ఆగస్టు 21న నుంచి ప్రారంభం కానున్నాయి.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా బోధించేందుకు ‘లక్ష్య’ పేరుతో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శిక్షణ తీసుకున్న ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 16వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా 15రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ తీసుకున్న ఆర్పీల సహాయంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు లక్ష్య కార్యక్రమాల గురించి వివరిస్తారు.
పాఠ్యాంశాల వారీగా పరీక్షలు
జిల్లాలో పదోతరగతి విద్యార్థులను ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. సబ్జెక్టుల వారీగా బోధన, సాధనకు పీరియడ్లు కేటాయిస్తారు. సాధన తరువాత లఘు ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. ఇలా ప్రతి సబ్జెక్టుకు 10 నుంచి 15 సార్లు పరీక్షలు జరుగుతాయి. 50 శాతం సిలబస్ పూర్తయిన తరువాత అక్టోబరులో సమ్మేటివ్ అసెస్‌మెంట్–1, మొత్తం సిలబస్ పూర్తయిన తరువాత ప్రీ ఫైనల్, వార్షిక పరీక్షలు జరుగుతాయి. అక్టోబరు నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు జరుగుతాయి. డిసెంబరు చివరి వారం వరకు సిలబస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.