Sports: కేయూ క్రీడలపై నీలినీడలు
ఇప్పటికే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు క్రీడల క్యాలెండర్‌ను ఖరారు చేసింది. అయినా యూనివర్సిటీ స్థాయి పోటీలు నిర్వహించకపోవడం గమనార్హం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దాదాపు 300కి పైగా కళాశాలలున్నాయి. జూలై – ఆగస్టు నెలలోనే సమావేశమై యూనివర్సిటీ పరిధి క్రీడాపోటీల క్యాలెండర్‌ను ఖరారు చేయాలి.
కానీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరగకపోగా, పోటీల తేదీలు వెల్లడించలేదు. దీంతో కళాశాలల్లో చదివే విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: Asian Para Games: ఆసియా పారా క్రీడల్లో హ్యాట్రిక్ పతకాలు సాధించిన శీతల్ దేవి
కరోనా నుంచి దూరం
ఇప్పటికే కొన్ని క్రీడాంశాలకు సంబంధించి ఇంటర్ యూనివర్సిటీ పోటీల తేదీలు ఖరారయ్యాయి. కానీ, కాకతీయ యూనివర్సిటీ స్థాయి పోటీల నిర్వహణపై స్పోర్ట్స్ బోర్డ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండేళ్ల పాటు కరోనాతో క్రీడారంగం కుంటుపడింది. గత ఏడాది నుంచే జాతీయస్థాయి యూనివర్సిటీ పోటీలకు పంపుతున్నారు. ఇంతలోనే ఈ ఏడాది ఇప్పటికే జరగాల్సిన పోటీల నిర్వహణపై ఎలాంటి సమాచారం లేక క్రీడాకారులు మీమాంసలో పడిపోయారు.
జిల్లాల్లో వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు యూనివర్సిటీ క్రీడలు ఎంతో ఊతమిస్తాయి. తద్వారా జాతీయస్థాయిలోనూ సత్తా చాటితే విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు మెరుగవుతాయి. కానీ, స్పోర్ట్స్ బోర్డు నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ ఏడాది యూనివర్సిటీ క్రీడలు లేక, యూనివర్సిటీ స్థాయి జట్ల ఎంపిక జరగగ సందిగ్ధత నెలకొంది.
భారీగా పెరిగిన స్పోర్ట్స్ ఫీజు
కాకతీయ యూనివర్సిటీ ఇప్పటివరకు ప్రతీ విద్యార్థి నుంచి క్రీడా రుసుం కింద రూ.60 వసూలు చేసేది. కానీ, ఈ ఏడాది రూ.300 వసూలు చేయాలని నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రుసుం పెంచినా యూనివర్సిటీలో వసతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలతో పోలిస్తే కాకతీయ యూనివర్సిటీ క్రీడాకారులకు డీఏ కూడా చాలీచాలకుండా ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ అంశంపై గతంలో పలుమార్లు యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ల సంఘం విజ్ఞప్తి చేసినా ఫలితం కానరాలేదు. అంతేకాక క్రీడాకారుల ఎంపికకు నిర్వహించే సెలక్షన్ కమిటీకి కూడా రెండేళ్ల నుంచి ఎలాంటి చార్జీలు ఇవ్వడం లేదని తెలిసింది. ఇప్పటికై నా యూనివర్సిటీ అధికారులు సత్వరమే స్పందించి క్రీడా పోటీల నిర్వహణపై దృష్టి సారించాలని ఔత్సాహికులు, పీడీలు కోరుతున్నారు.
పోటీల నిర్వహణకు చొరవ చూపాలి
యూనివర్సిటీ స్థాయి పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా క్రీడాకారుల భవిష్యత్‌కు బాటలు వేసినట్లవుతుంది. ఈ విషయంలో వీసీ, పాలకమండలి, స్పోర్ట్స్ బోర్డు అధికారులు స్పందించాలి. పోటీలు జరగకపోతే క్రీడాకారులు చాలా నష్టపోతారు.
–డాక్టర్ బి.వెంకన్న, కేయూ పీడీల సంఘం కార్యదర్శి
కారణం తెలియడం లేదు..
మరో పక్షం రోజుల్లో కొన్ని క్రీడాంశాలకు సంబంధించి జాతీయస్థాయిలో యూనివర్సిటీ క్రీడలు జరగనున్నాయి. కానీ, కేయూ స్థాయి పోటీలపై అధికారులు ఇంతవరకు నిర్ణయం ఎందుకు తీసుకోలేదో తెలియదు. ఇకనైనా పోటీలు నిర్వహించి జట్లు ఎంపికచేయాలి.
–డాక్టర్ శ్రీనివాసరెడ్డి, పీడీ, వరంగల్