Open School: పాస్ గ్యారంటీ స్కీమ్ పేరుతో వసూళ్లు
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవే ట్ యాజమాన్యాల కింద ఏర్పాటైన మొత్తం 104 స్టడీ సెంటర్లలో అక్రమాలపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఏటా ఆయా సెంటర్లతో చేపట్టే అడ్మిషన్ల కసరత్తు నుంచే నిర్వాహకులు అవినీతికి పాల్పడుతున్నారు.
అర్ధంతరంగా చదువు మానేసి, ఇప్పుడు కొనసాగించాలనుకుంటున్న అభ్యర్థులు, గ్రామీణ యువత, మహిళలు, ఉద్యోగోన్నతుల కోసం పరీక్షలు రాసేవారిని మోసం చేస్తున్నారు.
ముందస్తుగా సగం చెల్లించాల్సిందే!
వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉద్యోగోన్నతి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, ఇతర అవసరాల కోసం పరీక్షలు రాసేందుకు అడ్మిషన్ పొందే అభ్యర్థులు అధికంగా నగదు చెల్లించాల్సిందే. ముందుగా డీల్ కుదుర్చుకుంటేనే అడ్మిషన్ కల్పిస్తారు.
ఇలా పది, ఇంటర్‌లో ప్రవేశం పొందే అభ్యర్థులు ముందస్తుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం సగం నగదు చెల్లించాల్సిందే. పరీక్షల సమయంలో విద్యాశాఖ అధికారులతో స్టడీ సెంటర్ నిర్వాహకులు కుమ్మకై మాస్ కాపీయింగ్‌కు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలోనే పరీక్షలు పూర్తి అయ్యాక మిగిలిన డీల్‌లో భాగంగా మిగిలిన సొమ్మును వసూలు చేసుకుంటారు.
మొత్తం వ్యవహారంలో విద్యాశాఖ అధికారులకు సైతం ముడుపులు చేరుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓపెన్ స్కూల్‌నే ఆదాయ వనరుగా చేసుకున్న స్టడీ సెంటర్ నిర్వాహకులు రూ.కోట్లకు పడగలెత్తినట్టు సమాచారం.
చదవండి: Open Tenth Admissions : ఏపీ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు.. వీరే అర్హులు..
రెగ్యులర్ స్థాయిలోనే విలువ
ఓపెన్ స్కూల్ సొసైటీ జారీ చేసే పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్‌లకు రెగ్యులర్ ధ్రువీకరణ పత్రాల స్థాయిలోనే విలువ ఉంది.ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు, ఉద్యోగోన్నతులు పొందేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
దీంతో చాలా మంది ఓపెన్‌స్కూల్ వైపు మొగ్గుచూపుతున్నారు. నామమాత్రపు ఫీజుతో అడ్మిషన్ తీసుకుని, నిర్వాహకులు అడిగినంత ముట్టజెబితే దర్జాగా చేతిలో సర్టిఫికెట్ వచ్చేస్తుంది. దీంతో అభ్యర్థుల అవసరం, ఆత్రుతను స్టడీ సెంటర్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.
అడిగినంత ఇచ్చుకోవాల్సిందే!
2023–24 సంవత్సరానికి సంబంధించి పది, ఇంటర్మీడియట్ ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు చిత్తూరు జిల్లా నుంచి 5,703 మంది, తిరుపతి జిల్లా నుంచి 3,965 మంది హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రైవేట్ సెంటర్ల నిర్వాహకులు సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరి అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అభ్యర్థుల చిరునామాకే పోస్టు ద్వారా సర్టిఫికెట్‌లు పంపించే విధానం ప్రవేశపెట్టింది. అయితే కొంత మంది నిర్వాహకులు మోసపూరితంగా వ్యవహరిస్తూ అడ్మిషన్ సమయంలో అభ్యర్థుల అడ్రెస్ నమోదు చేయకుండా సర్టిఫికెట్‌లు తమకే అందేలా చేసుకుంటున్నారు. అనంతరం అభ్యర్థులు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు నగదు చెల్లించాకే ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. ఈ విషయం తెలిసినా విద్యాశాఖ అధికారులు కాసులకు కక్కుర్తిపడి నోరు మెదపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమాలకు పాల్పడితే చర్యలు
ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ నిర్వాహకులు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులనే వసూలు చేయాలి. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయ్. ఫిర్యాదులు అందితే వెంటనే సంబంధిత సెంటర్‌ను రద్దు చేస్తాం. పది, ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు కచ్చితంగా సర్టిఫికెట్‌లు ఇచ్చేయాలి. నిర్వాహకుల వద్ద సర్టిఫికెట్‌లు ఉంటే సహించే ప్రసక్తే లేదు.
– దేవరాజు, డీఈఓ, చిత్తూరు
ఇబ్బంది పెట్టడం వాస్తవమే
ఓపెన్ స్కూల్ విధానంలో అక్రమాలు జరుగుతున్నాయి. అభ్యర్థులను ప్రైవేట్ సెంటర్ నిర్వాహకులు మోసం చేస్తున్నారు. జిల్లా వాసులనే కాకుండా పక్క రాష్ట్రాల వారి నుంచి కూడా భారీగా నగదు వసూలు చేస్తున్నారు. వీరి అక్రమాలను అరికట్టాల్సిన విద్యాశాఖ అధికారులు మామూళ్లకు ఆశపడి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
– శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి