Skip to main content

International Left-Handers Day: ఈ ప్రముఖలు లెఫ్ట్‌ హ్యాండర్స్ అని మికు తేలుసా?

నిర్మల్‌ ఖిల్లా: సాధారణంగా సమాజంలోని ప్రతీ వ్యక్తి ప్రత్యేక భిన్నమైన గుణం కలిగి ఉంటాడు. అయితే కొందరిలో వారి ప్రత్యేకతను బట్టి ఇట్టే గుర్తుపట్టొచ్చు.
International Left-Handers Day

ప్రతీ వందమందిలో 90 మంది కుడిచేతివాటం వారు ఉండగా మిగతా 10 శాతం మందిలో చాలా లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కనిపిస్తుంటారు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.. అన్నాడో సినీ కవి.. అంటే వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ఆ వ్యక్తికి ప్రత్యేకతను ఆపాదిస్తాం.

ఎడమ చేతివాటం అనేది జన్యు ప్రభావ ఫలితంగా ఏర్పడిందని వైద్య పరిశోధనల్లో రుజువైంది. నేడు ప్రపంచ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే సందర్భంగా కథనం.

చదవండి: NIRF 2024 Rankings: అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్‌.. విభాగాల వారీగా ర్యాంకులు ఇలా..

భిన్నమైన శైలి...

కుడిచేతివాటం వారి కన్నా ఎడమచేతివాటం వారు ప్రత్యేక స్థానాల్లో ఉంటారని, వారి మేధోశక్తి ఆలోచనలు, తెలివితేటలు భిన్నంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో చాలామంది ఎడమ చేతి వాటం కలిగిన వారే కావడం విశేషం. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఎడమ చేతితోనే రాస్తారు.

ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండూల్కర్‌, యువరాజు సింగ్‌, సినీ నటులు అమితాబ్‌ బచ్చన్‌, సావిత్రి లాంటివారు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ వారే కావడం గమనార్హం. ఎడమచేతి వాటం వారిలో సృజనాత్మకత, సంగీతం, కళలు, అభినయం, గ్రహణశక్తి సామర్థ్యాలు, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు అమితంగా ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

చదవండి: Top Universities And Colleges 2024 in India : దేశంలో టాప్ యూనివర్సిటీలు, కాలేజీలు ఇవే.. వీటిలో చ‌దివితే..!

జన్యు ప్రభావ ఫలితంగానే...

ప్రతీ వ్యక్తి పుట్టినప్పటి నుండే కుడి, ఎడమ చేతి వాటాలను సహజసిద్ధంగానే కలిగి ఉంటాడని సైన్స్‌ చెబుతోంది. ఒక మనిషికి మెదడు కుడి ఎడమ రెండు అర్ధ భాగాలుగా ఉంటుంది.

కుడి వైపు శరీర భాగాన్ని మెదడు ఎడమవైపు భాగం నియంత్రిస్తుందని, కుడి అర్ధ భాగం మెదడు బలంగా ఉన్నవారిలో ఎడమ చేతి వాటం వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నప్పటినుండే తల్లిదండ్రులు ఎడమ చేతి వాటం గమనిస్తే మాన్పించేందుకు ప్రయత్నం చేస్తారు. జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు అలా మాన్పించడం సాధ్యంకాదు.

ఒకే తరగతిలో ఐదుగురు...

నిర్మల్‌ జిల్లా మామడ మండలం పరిమండల్‌ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతిలో దాదాపు 22 మంది ఉండగా అందులో ఐదుగురు ఎడమ చేతి వాటం కలిగిన వారే ఉండడం విశేషం. వీరు హోం వర్క్‌, పెయింటింగ్స్‌, రాతపని ఏది చేయాలన్నా ఎడమ చేతితోనే చేస్తారు.

శ్రీకృతి, శ్రీహరి, సిద్ధార్థ, సమాధాన్‌, వర్షిత్‌ అనే పదేళ్లలోపు చిన్నారులతో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారు. వారంతా చదువు, రాత పనుల్లో చురుకుదనం కలిగి ఉన్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. డ్రాయింగ్‌, పెయింటింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు.

కొందరికి పుట్టుకతోనే ఎడమచేతి వాటం..

  • లెఫ్ట్‌ హ్యాండర్సే ప్రత్యేక ప్రతిభావంతులంటున్న నిపుణులు
  • ప్రత్యేకత చాటుతున్న లెఫ్ట్‌ హ్యాండర్స్‌
  • నేడు ప్రపంచ లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే

మాన్పించవద్దు..

ఏడాదిన్నర నుంచి రెండేళ్ల మధ్య వయసులో ఉన్నప్పటి నుండి పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెడతారు. ఈ సమయంలోనే కుడి, ఎడమ చేత వాటాలను గుర్తించవచ్చు. ఎడమ చేతి వాటాన్ని తల్లిదండ్రులు ఒక చెడు అలవాటుగా భావించి మాన్పించేందుకు ప్రయత్నం చేస్తారు.

అలా చేయడం వల్ల ఇతర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుడి చేత్తో రోజువారి పనులు చేసుకోవడం సహజమే. అయితే ఆ పనులను ఎడమచేత చేయడం కాస్త ఛాలెంజ్‌తో కూడుకున్నది.

రోజువారీ పనులన్నీ ఎడమచేత్తో చేస్తూ ప్రత్యేకంగా పేరొందిన వారి జాబితాలో మనదేశం చాలా పెద్దది. అందులో సైంటిస్టులు, క్రీడాకారులు, తత్వవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు చాలామంది ఉన్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఎడమ చేతివాటం ఉన్న వారేనని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

Published date : 13 Aug 2024 03:13PM

Photo Stories