భర్త ఆటో డ్రైవర్.. భార్యకు డాక్టరేట్
మహబూబ్‌నగర్ జిల్లా బొడ్డెమ్మ పాటలు, జనజీవన చిత్రన అనే అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకుని తగిలి శ్యామల Osmania University నుంచి డాక్టరేట్ సంపాదించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన శ్యామల బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఓయూ ఓరియంటల్ విభాగం తెలుగు శాఖ నుంచి డాక్టరేట్ పొందారు. శ్యామల ఆంధ్రసారస్వత పరిషత్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా బొడ్డెమ్మ ఆటలో పాటలను ముందు తరాల వారికి లిఖితరూపకంగా అందించాలనుకున్నారు. బొడ్డెమ్మ పాటలను పరిశోధనాంశంగా తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథానికి సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు పర్యవేక్షకులుగా వెంకట్‌రెడ్డి, సిల్మా నాయక్ సహకరించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామల భర్త చెరుకు రాంచందర్ ఆటో నడుపుతూ తనను చదివించారని ఆయన కష్టాన్ని వృథా చేయకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
చదవండి: ఉస్మానియా యూనివర్సిటీ లోగోను మార్చలేదు