Skip to main content

CM Revanth Reddy: అత్యున్నత ఫలితాలే లక్ష్యం కావాలి

సాక్షి, హైదరాబాద్‌: పరీక్షల నిర్వహణలో గుణాత్మక మార్పు తేవాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
Discussion on Exam Conduct  Education Department Officials Meeting  Chief Minister Revanth Reddyhighest results should be the aim   Hyderabad Chief Minister Revanth Reddy

టెన్త్, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ తొలిసారిగా డిసెంబ‌ర్ 12న‌విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి హోదాలో నవీన్‌ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన హాజరయ్యారు. ఇంటర్, టెన్త్‌ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, రాబోయే ఫలితాలపై ఆరా తీశారు.

చదవండి: TSPSC: సీఎం రేవంత్‌ సమీక్ష.. పరీక్షలు రీ షెడ్యూల్‌!

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఏడాది పేపర్‌ లీకేజీ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు.

కాగా ఆన్‌లైన్‌ మూల్యాంకన విధానాన్ని ఇంటర్‌ అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో ఫలితాల వెల్లడికి ఆస్కారం ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది.  

ప్రైవేటుతో సమానంగా ఫలితాలు రావాలి 

ప్రైవేటు విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. దీంతో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చా రు. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాదిరిగా ప్రభు త్వ స్కూళ్లల్లోనూ ఫలితాలు పెంచాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెళకువలు మెరుగు పర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇంటర్‌ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్‌ ఇవ్వాలని సూచించారు. 

మండలానికో కాలేజీ 

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యార్థులకు కాలేజీలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రతి మండలానికి ఓ కాలేజీ ఏర్పాటు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అవసరాన్ని బట్టి అధ్యాపకులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్‌ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంపై ఆయన ఆరా తీశారు. 

పదోన్నతులు చేపడితే  ఖాళీలపై స్పష్టత 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, పరీక్షలు, ఫలితాల గురించి దేవసేన సీఎంకు వివరించారు. వివిధ సబ్జెక్టు టీచర్ల కొరత, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో జరిగిన కసరత్తు చర్చకు వచ్చినట్టు తెలిసింది.

5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు చేపట్టిన ప్రక్రియ ఆగి పోయిందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 18 వేలకు పైగా ఖాళీలున్నాయని, పదోన్నతులు చేపడితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టమైన సమాచారం వస్తుందని వివరించారు.

టెట్‌ ఉత్తీర్ణులకే పదోన్నతులు ఇవ్వాలన్న కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని చెప్పగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం.  

Published date : 13 Dec 2023 11:54AM

Photo Stories