విద్యార్థుల కోసం Google Read Along యాప్
- విద్యార్థులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
- సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్ర శిక్షా పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ‘గూగుల్ రీడ్ అలాంగ్’ యాప్‌ను ప్రారంభించేందుకు గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుందని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘గూగుల్ రీడ్ అలాంగ్’ యాప్ ఉపయోగాలను వివరించడానికి జిల్లాస్థాయి అధికారులు, ఉపాధ్యాయులతో బుధవారం ఆన్‌లైన్ శిక్షణా సమావేశం నిర్వహించారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పెంచడం కోసం, వినోదభరితంగా, ఆకర్షణీయంగా నేర్చుకోవడానికి, చదవడానికి ఏర్పాటు చేసిన యాప్ అని పేర్కొన్నారు. ఈ యాప్‌లో గూగుల్ అధునాతన టెక్నాలజీ ఆధారంగా స్నేహపూర్వక అభ్యసన కోసం ‘దియా’ యానిమేటెడ్ అసిస్టెంట్ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు బిగ్గరగా చదివే సమయంలో దియా విని ప్రతిస్పందిస్తూ కొత్త పదాలు, కష్టమైన పదాలు ఉచ్ఛరించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ యాప్‌ను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని వెట్రిసెల్వి కోరారు. తెలుగు ఇంగ్లిష్‌తో పాటు 11 భాషల్లో వెయ్యికి పైగా బొమ్మలు, కథలు, ఆటలు ఇందులో ఉంటాయని తెలిపారు. అలానే పాఠ్య పుస్తకాల్లోని కథలు, తదితర అంశాలు కూడా మున్ముందు అనుసంధానం చేస్తామని తెలిపారు.ఈ యాప్ గురించి ఈ నెల 20 నుంచి జూలై 5 వరకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించి, వేసవి సెలవుల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం కూడా ఈ యాప్ వినియోగాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
Also read: Bendapudi High School Students: విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్.. వీళ్ల ప్రతిభని చూసి..