Skip to main content

Good News: విద్యార్ధులకు నైపుణ్యాలను పెంపొందించేలా ఉచిత శిక్షణ

డిగ్రీ విద్యార్ధుల సాఫ్ట్‌ స్కిల్స్‌ నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగావకాశాలు మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Good News
విద్యార్ధులకు నైపుణ్యాలను పెంపొందించేలా ఉచిత శిక్షణ

ప్రపంచంలో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్రంలో 1.62 లక్షల మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించేందుకు సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఈమేరకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకోగా గడువు తేదీని 2022 డిసెంబర్ చివరి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఒప్పందం ప్రకారం గడువు 2021 డిసెంబర్ ఆఖరుతో ముగుస్తున్నప్పటికీ కరోనాతో విద్యాసంస్థలు దీర్ఘకాలం మూతపడటం, విద్యార్థులు నెలల తరబడి కాలేజీలకు దూరం కావడంతో ఒప్పందం గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 కాలేజీల పరిధిలో చదువుతున్న విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు మైక్రోసాఫ్ట్ వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.79 కోట్లను వెచ్చిస్తోంది. ఆన్ లైన్ ద్వారా అత్యంత నాణ్యమైన కొత్త కరిక్యులమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. బ్రాండ్ వాల్యూ ఉన్న మైక్రోసాఫ్ట్ అందించే ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల గుర్తింపు ఉన్నందున విద్యార్ధులకు ఎంతో మేలు జరగనుంది. శిక్షణ ప్రాజెక్టు అమలు కోసం పర్యవేక్షణ, మూల్యాంకన కమిటీని ప్రభుత్వం నియమించింది.

40 కోర్సులలో శిక్షణ

మైక్రోసాఫ్ట్ సంస్థ అధునాతన సాఫ్ట్వేర్ అంశాలపై విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేక డొమైన్ ద్వారా 40 సర్టిఫికేషన్ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.7,500 (100 యూఎస్ డాలర్లు) విలువ గల ‘అజూర్పాస్’ను ప్రతి విద్యార్థికి సమకూర్చనుంది. దీని ద్వారా 1.62 లక్షల మంది విద్యార్థులు క్లౌడ్ టెక్నాలజీ ద్వారా శిక్షణాంశాలను సులభంగా పొందగలుగుతారు. సర్టిఫికేషన్ కోర్సులతో పాటు అదనంగా ‘లింకిడ్ ఇన్ లెర్నింగ్’ ద్వారా బిజినెస్, క్రియేటివిటీ, టెక్నికల్ విభాగాలకు సంబంధించిన 8,600 కోర్సులు విద్యార్ధులు నేర్చుకునేందుకు అందుబాటులోకి వస్తాయి. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్డేటా లాంటి 25 ఫ్రీ అజూర్ సర్వీసులు అందుతాయి. శిక్షణ కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ లెర్న్ (ఎంఎస్ లెర్న్) ముఖ్యమైన ప్లాట్ఫాంగా ఉంటుంది. సెల్ఫ్పేస్డ్, డిజిటల్ లెర్నింగ్ వనరుల ద్వారా విద్యార్ధులు నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతారు. పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది.

ప్రాజెక్టు పర్యవేక్షణకు ఉన్నత కమిటీ

1.62 లక్షల మంది విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సుల ప్రాజెక్టు అమలు, పురోగతి పరిశీలనకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి ఛైర్మన్ గా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి సభ్యుడిగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా మరో నలుగురితో కమిటీ ఏర్పాటైంది. మైక్రోసాఫ్ట్తో ఉన్నత విద్యామండలి ఒప్పందం గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండగా కరోనా వల్ల ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగినందున 2022 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. శిక్షణలో భాగంగా మైక్రోసాఫ్ట్ గుర్తించిన సంస్థల ద్వారా మాక్ టెస్టులు, పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపడతారు. విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ అందించే సర్టిఫికెట్లను డిజి లాకర్లో భద్రపరుస్తారు.

ఎంతో ప్రయోజనకరం

విద్యార్ధులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాల శిక్షణపై మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ ప్రతిపాదనలు అందించిన అనంతరం ప్రభుత్వం సంబంధిత నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనలతో రాష్ట్ర విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివిధ యూనివర్సిటీలు, కాలేజీల ద్వారా స్టేక్ హోల్డర్ల‌ నుంచి కూడా అభిప్రాయాలను తీసుకుంది. మైక్రోసాఫ్ట్ శిక్షణతో పలు రకాలుగా మేలు జరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో నిర్వహించిన సమావేశానికి మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓమ్జివాన్ గుప్తా తదితరులు హాజరై ప్రతిపాదనలను వివరించారు. అకడమిక్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, సర్టిఫికేషన్ కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వీసీలు పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చే కోర్సులు

మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చే కోర్సులు

  •  అజూర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్స్
  •  అజూర్‌ అడ్మినిస్ట్రేటర్‌
  •  అజూర్‌ డెవలపర్‌
  •  అజూర్‌ డేటా సైంటిస్టు
  •  అజూర్‌ ఏఐ ఇంజనీర్‌
  •  అజూర్‌ డేటా ఇంజనీర్‌
  •  అజూర్‌ ఫండమెంటల్స్‌
  •  డేటా ఫండమెంటల్స్‌
  •  ఏఐ ఫండమెంటల్స్‌
  •  సైబర్‌ సెక్యూరిటీ ఫండమెంటల్స్‌
  •  ఇంట్రో ప్రోగ్రామింగ్‌ యూజింగ్‌ పైథాన్
  •  ఇంట్రో ప్రోగ్రామింగ్‌ యూజింగ్‌ జావా
  •  మొబిలిటీ అండ్‌ డివైస్‌ ఫండమెంటల్స్‌
  •  ఫుల్‌ స్టేక్‌ డెవలప్‌మెంట్‌ (వెబ్‌ అప్లికేషన్స్)
  •  సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఫండమెంటల్స్‌
  •  డేటాబేస్‌ ఫండమెంటల్స్‌
  •  హెచ్‌టీఎంఎల్‌ 5 అప్లికేషన్
  • డెవలప్‌మెంట్‌ ఫండమెంటల్స్‌
  •  నెట్‌వర్కింగ్‌ ఫండమెంటల్స్‌
  •  ఇంట్రో ప్రోగ్రామింగ్‌ యూజింగ్‌ జావా స్క్రిప్ట్‌
  •  అజూర్‌ సెక్యూరిటీ ఇంజనీర్‌
  •  డెస్క్‌టాప్‌ అడ్మినిస్ట్రేటర్‌
  •  విండో సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఫండమెంటల్స్‌
  •  అజూర్‌ డేటా అనలిస్ట్‌
  •  మైక్రోసాఫ్ట్‌ 365 ఎంటర్‌ప్రైజ్‌ అడ్మినిస్ట్రేటర్‌
  •  అజూర్‌ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్‌
  •  టీమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ అసోసియేట్‌ (ఎంఎస్‌ 700)
  •   మైక్రోసాఫ్ట్‌ 365 మెసేజింగ్‌ అడ్మినిస్ట్రేటర్‌
  •   మైక్రోసాఫ్ట్‌ 365 సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌
  •   డైనమిక్స్‌ 365 సేల్స్‌ ఫంక్షనల్‌ కన్సల్టెంట్‌ అసోసియేట్‌
  •   డైనమిక్స్‌ 365 మార్కెటింగ్ Šఫంక్షనల్‌ కన్సల్టెంట్‌ అసోసియేట్‌
  •   డైనమిక్స్‌ 365 ఫర్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఫంక్షనల్‌ కన్సల్టెంట్‌
  •   డైనమిక్స్‌ 365 ఫర్‌ ఫీల్డ్‌ సర్వీస్‌ ఫంక్షనల్‌ కన్సల్టెంట్‌
  •   డైనమిక్స్‌ 365  ఫైనాన్స్ ఫంక్షనల్‌ కన్సల్టెంట్‌
  •   డైనమిక్స్‌ 365  సప్లయ్‌ చైన్ మేనేజ్‌మెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫంక్షనల్‌ కన్సల్టెంట్‌ అసోసియేట్‌
  •   డైనమిక్స్‌ 365  సప్లయ్‌ చైన్ మేనేజ్‌మెంట్‌ ఫంక్షనల్‌ కన్సల్టెంట్‌ అసోసియేట్‌
  •   మైక్రోసాఫ్ట్‌ 365 ఫండమెంటల్స్‌
  •   పవర్‌ యాప్‌ ఫండమెంటల్స్‌
  •   డైనమిక్స్‌ 365 ఫండమెంటల్స్‌
  •   అజూర్‌ ఐవోటీ డెవలపర్‌
  •   మైక్రోసాఫ్ట్‌ 365 మోడరన్ డెస్క్‌టాప్‌ అడ్మినిస్ట్రేటర్‌ అసోసియేట్‌

చదవండి:

APPSC: ఉద్యోగాలు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

Jobs: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2వేలకు పైగా ఉద్యోగాలు..

Published date : 14 Oct 2021 01:24PM

Photo Stories