Scholarship: ఉపకార దరఖాస్తులకు గడువు పొడిగింపు
జనవరి 31వ తేదీతో ఉపకార దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ.. అర్హులైన విద్యార్థులంతా వెంటనే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల అప్‌లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
వాస్తవానికి గతేడాది డిసెంబర్ 30వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగిసినప్పటికీ విద్యార్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండింది. దీంతో జనవరి 31 వరకు గడువు పెంచారు. అయినప్పటికీ విద్యార్థులు పూర్తిస్థాయిలో దరఖాస్తులు సమర్పించకపోవడం, కొన్ని రకాల కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో గడువు పొడిగింపు ప్రభుత్వానికి అనివార్యమైంది. ఈ క్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఫిబ్రవరి 2న ఉత్తర్వులు జారీ చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తులు 12.65 లక్షలు వస్తాయని అధికారులు అంచనా వేశారు.
చదవండి: Pre Matric, Post Matric Scholarship: స్కాలర్‌షిప్ హార్డ్ కాపీలు అందించాలి
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను గతేడాది ఆగస్టు 19వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. డిసెంబర్ 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవ కాశం కల్పించారు. అయితే వివిధ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాకపోవడం, ఎన్నికల ప్ర క్రియ, విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ ప త్రాల జారీలో జాప్యం జరగడంతో ప్రభుత్వం నెల పాటు గడువును పొడిగించింది. జనవరి 31వ తేదీ నాటికి గడువు పూర్తి కాగా ఫ్రెషర్స్ కేటగిరీలో 4,20,262 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ కేటగిరీలో మరో 1.30 లక్షల మంది ఇంకా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది.