Budget 2024: స్కూళ్లకు నిధులు.. యూజీసీకి మాత్రం ఇలా..
గత ఏడాది సవరించిన అంచనాల ప్రకారం రూ.6,409 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం 2,500 కోట్లు కేటాయించింది. అయితే, 2024–25 బడ్జెట్‌లో స్కూళ్లకు కేటాయింపులు పెంచింది. పాఠశాల విద్యకు గత ఏడాది సవరించిన అంచనాల (రూ.72473.80) కన్నా దాదాపు రూ.500 కోట్ల మేర పెంచి 73008.10 కోట్లు కేటాయించింది. ఉన్నత విద్యకు మాత్రం గత ఏడాది రూ.57244.48 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.9,600 కోట్లు కోతవేసి 47619.77 కోట్లు కేటాయించడం గమనార్హం.
కేంద్రం ఐఐఎంలకు వరుసగా రెండో ఏడాది కూడా కోత విధించింది. గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.608.23 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే, ఐఐటీలకు గత ఏడాది సవరించిన అంచనాల మేరకు రూ.10384.21 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.10324.50 కోట్లు కేటాయించారు.
చదవండి: UGC: ఉన్నత విద్యా సంస్థల్లో అభ్యర్థులు దొరకకుంటే... రిజర్వ్‌డ్ పోస్ట్ డి-రిజర్వ్ కాదు!
అలాగే, కేంద్ర విశ్వవిద్యాలయాలకు నిధులను 28 శాతం పెంచారు. వీటికి గత ఏడాది రూ.12000.08 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.15472 కోట్లు కేటాయించడం విశేషం. కాగా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్లను రూ.8,200 కోట్ల మేర పెంచగా, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.308 కోట్ల మేర పెంచారు.
390 వర్సిటీలు... 3000 ఐటీఐలు
2014 నుంచి ఇప్పటివరకు పదేళ్లలో పెద్ద ఎత్తున ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్ విద్యాసంస్థలను, 390 యూనివర్సిటీలను ఏర్పాటుచేసినట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అలాగే, 3,000 ఐటీఐలను కూడా స్థాపించామన్నారు.
యువతను ఎంతవరకు సాధికారికంగా మార్చామన్నదానిపై మన ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. సంస్కరణలకు జాతీయ విద్యావిధానం–2020 నాంది పలుకుతోందని, ‘పీఎం శ్రీ’పథకం ద్వారా నాణ్యమైన బోధనను అందించడంతోపాటు విద్యార్థులను మరింత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
స్కిల్ ఇండియా మిషన్ కింద మూడువేల ఐటీఐలను ఏర్పాటుచేసి ఇప్పటివరకు 1.4 కోట్ల మందికి శిక్షణ ఇచ్చామని, 54 లక్షల మంది యువకుల ప్రతిభకు మెరుగులు దిద్దామని తెలిపారు.