Skip to main content

Education: చదివితే ఇలా.. భవిత ఎంచక్కా..

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత ఏడాది కంటే నెల రోజులు ముందుగానే ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి.
Education
చదివితే ఇలా.. భవిత ఎంచక్కా..

 ఉన్నత స్థానాలకు చేరాలన్న లక్ష్యంతో వచ్చిన విద్యార్థులు ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకుని, పక్కా ప్రణాళికతో చదివితే నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ప్రముఖ సంస్థల్లో మంచి వేతనంతో కొలువులు సాధించవచ్చని విద్యావేత్తలు సూచిస్తున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2 ప్రభుత్వ, 28 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 840 సీట్లకు 812 భర్తీ అయ్యాయి. ప్రైవేటు కళాశాలల్లో 9,500 సీట్లు ఉండగా రెండు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌ ద్వారా 7,200 భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లను స్పాట్‌ ద్వారా భర్తీ చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: Sambhavi: బేటీ బచావో, బేటీ పడావోపై విద్యార్థిని జాగృతి

ఇలా చేస్తే మేలు

  • విద్యార్థులు ఆషామాషీగా కాకుండా.. మొదటి సెమిస్టర్‌ నుంచే మార్కుల సాధనకు కృషి చేయాలి.
  • కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి. గ్రూప్‌ డిస్కషన్స్‌లో పాల్గొనాలి.
  • విద్యార్థులు అధ్యాపకులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
  • పదో తరగతి, ఇంటర్‌ మాదిరిగా ఇక్కడ బట్టీ విధానం పని చేయదు. అధ్యాపకులు చెప్పిన దానిని అర్థం చేసుకుని, అన్వయించుకుని, స్వీయ శిక్షణ పొందాలి.
  • ఇంటర్మీడియెట్‌ తరహాలో ఇక్కడ అన్ని మెటీరియల్స్‌ లభించవు. ఒక్కో విషయానికి సంబంధించి పలు పుస్తకాలు చదవాల్సి ఉంటుంది.
  • జర్నల్స్‌, డిజిటల్‌ లైబ్రరీ, అంతర్జాతీయ పత్ర సమర్పణలు, కళాశాలలో జరిగే సెమినార్లను సద్వినియోగం చేసుకోవాలి.
  • ప్రాజెక్టులకు అధిక సమయం కేటాయించాలి.
  • క్యాంపస్‌ ఎంపికలపై దృష్టి పెట్టాలి. రెండేళ్ల క్యాంపస్‌ సెలక్షన్లు జరిగిన తీరుపై అవగాహన పెంచుకోవాలి.
  • క్రమశిక్షణ, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే కళాశాలలను ఎంచుకోవాలి.
  • ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం చేయాలా? పరిశ్రమలు స్థాపించాలా లేక ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యమా? అనే అంశంపై స్పష్టత ఏర్పరచు కోవాలి.

ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయొద్దు
అన్ని సబ్జెక్టులూ తప్పకుండా చదవాలి. క్యాంపస్‌ ఇంటర్వ్యూలపై దృష్టి సారించాలి. అందుకు అధ్యాపకుల సూచనలు పాటించాలి. పరిశీలనా శక్తి, పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి. ఇంజినీరింగ్‌పై పట్టు సాధించాలి.
– డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, ప్రిన్సిపాల్‌, జేఎన్‌టీయూకే ఇంజినీరింగ్‌ కళాశాల, కాకినాడ
సర్టిఫికెట్‌ కోర్సులపై అవగాహన ఉండాలి
సి–లాంగ్వేజ్‌లో నిష్ణాతులు కావాలి. రెండో ఏడాది కొన్ని సర్టిఫికేషన్‌ కోర్సులపై దృష్టి సారించాలి. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వస్తువుల తయారీకి కావాల్సిన పరిజ్ఞానంపై అవగాహన అవసరం. పారిశ్రామిక సంస్థల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలి. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్‌ గోపాలకృష్ణ, ప్రొఫెసర్‌, మెకానికల్‌ విభాగం, జేఎన్‌టీయూకే, కాకినాడ
సీఆర్‌టీ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
రెగ్యులర్‌ సిలబస్‌తో పాటు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీఆర్‌టీ) శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. బీటెక్‌ పూర్తయ్యే వరకూ ఏ బ్రాంచి విద్యార్థి అయినా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఇంటర్నెట్‌ సాయంతో అంతర్జాతీయ పత్ర సమర్పణలు, పరిశోధనలను గమనించాలి. 80 శాతం పైబడి మార్కులు వచ్చేలా చూసుకోవవాలి. అటువంటి వారికే ప్రఖ్యాత సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్యాంపస్‌ ఎంపికలకు రెండో సంవత్సరం నుంచే శిక్షణ తీసుకోవాలి.
– పి.కృష్ణారావు, చైర్మన్‌, ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాల

Published date : 16 Oct 2023 01:50PM

Photo Stories