Skip to main content

యూనివర్సిటీకి వీసీ అయిన తొలి దళిత వ్యక్తిని నేనే.. నంబర్‌ వన్‌ వర్సిటీగా తీర్చిదిద్దుతా

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానని నూతన వైస్‌ చాన్సలర్‌ (వీసీ) డాక్టర్‌ కోరుకొండ బాబ్జీ తెలిపారు.
Dr Korukonda Babji
యూనివర్సిటీకి వీసీ అయిన తొలి దళిత వ్యక్తిని నేనే.. నంబర్‌ వన్‌ వర్సిటీగా తీర్చిదిద్దుతా

కళాశాలల్లో ప్రమాణాలను పెంచి నాణ్యమైన వైద్య విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటానన్నారు. తద్వారా సమాజానికి మెరికల్లాంటి వైద్యులను అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించుకుంటామన్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన బాబ్జీ వర్సిటీ భవిష్యత్‌ ప్రణాళికలు, తదితరాలపై ఫిబ్రవరి 14న ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

ఆ అదృష్టం నాకే దక్కింది.. 

1986లో వర్సిటీ ఏర్పడ్డాక ఇప్పటివరకు దళితులకు వీసీ అవకాశం దక్కలేదు. ఇప్పుడు తొలిసారిగా ఆ అదృష్టం నాకు దక్కింది. వర్సిటీకి వీసీ అయిన తొలి దళిత వైద్యుడిని నేనే అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. ఇది రాష్ట్రంలోని దళిత జాతికి దక్కిన గౌరవం. 

ఆ అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుంది.. 

1986లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా నేను వైద్య రంగంలోకి అడుగుపెట్టాను. అనంతరం అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేశాను. అడిషనల్‌ డీఎంఈ అకడమిక్, డీఎంఈగా మూడేళ్ల పాటు వ్యవహరించాను. ఈ క్రమంలో వైద్య, నర్సింగ్, పారామెడికల్‌ కళాశాలలు, 
బోధనాస్పత్రుల కార్యకలాపాలు, పనితీరుపై అనుభవం ఉంది. ఆ అనుభవం ఇప్పుడు ఎంతో ఉపయోగపడనుంది.

పరిశోధన కార్యకలాపాలపై దృష్టి సారిస్తే.. 

ఇక్కడ చాలా క్లినికల్‌ మెటీరియల్‌ ఉంది. దీనితో పరిశోధన కార్యకలాపాలపై దృష్టి పెడితే భవిష్యత్‌ తరాలకు మేలు చేసిన వారమవుతాం. పరిశోధనల ద్వారా మన వైద్యుల్లో నైపుణ్యాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మన వైద్య విద్యార్థులు రాణించగలరు. ఇందులో భాగంగా వర్సిటీ ద్వారా రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో పరిశోధనలను మరింత ముమ్మరం చేస్తాం. ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో వచ్చే ఏడాది ఐదు వైద్య కళాశాలల అకడమిక్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రంలో వైద్య విద్యకు అవకాశాలు మరింత పెరగనున్నాయి. వైద్య విద్యార్థులకు కళాశాలల నుంచి ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులపై విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేయొచ్చు. ఈ దిశగా గ్రీవెన్స్‌ సెల్‌ను మరింత బలోపేతం చేస్తాం.

Published date : 15 Feb 2023 04:03PM

Photo Stories