Skip to main content

High Court: జేఎన్టీయూ–ఏలో 8 మంది ప్రొఫెసర్ల తొలగింపు

అనంతపురం: జేఎన్టీయూ (అనంతపురం)లో ఎనిమిది మంది ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు వర్సిటీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.
High Court
జేఎన్టీయూ–ఏలో 8 మంది ప్రొఫెసర్ల తొలగింపు

ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.శశిధర్ జూలై 16న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి 2017, 2018 సంవత్సరాల్లో జారీచేసిన నోటిఫికేషన్లను హైకోర్టు మూడు రోజుల కిందట రద్దు చేసింది. ఈ తీర్పును అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా 22 మంది ప్రొఫెసర్లు ఉద్యోగాలు కోల్పోగా... వారిలో జేఎన్టీయూ–ఏలో ఎనిమిది మంది ఉన్నారు.

ప్రొఫెసర్లు వెంకటేశ్వరరావు (ఈఈఈ– కలికిరి క్యాంపస్), నాగప్రసాద్ నాయుడు (మెకానికల్– కలికిరి), నీరజ నాయుడు (సివిల్–కలికిరి), నసీనా (సీఎస్ఈ–కలికిరి), సుభాష్ (ఈసీఈ–కలికిరి), చంగల్రాజు (మేథమేటిక్స్–కలికిరి), రమణారెడ్డి (ఈసీఈ–పులివెందుల), నగేష్ (ఈఈఈ–పులివెందుల)లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ప్రొఫెసర్ సుభాష్ ఇటీవలే ఉద్యోగ విరమణ చేయడం గమనార్హం. ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు జేఎన్టీయూ కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఆయనను విధుల నుంచి తొలగించడంతో తాత్కాలిక ప్రిన్సిపాల్గా జేఎన్టీయూ–ఏ రిజిస్ట్రార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు 

జేఎన్టీయూ–ఏలో గత ప్రభుత్వ హయాంలో రెగ్యులర్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టలేదు. విధివిధానాలు, నియమనిబంధనలు నోటిఫికేషన్లో సక్రమంగా పొందుపరచకుండానే భర్తీ ప్రక్రియ చేపట్టారు. హడావుడిగా నోటిఫికేషన్లు జారీ చేసి 2019, జనవరిలో ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు చేపట్టారు. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రొఫెసర్ పోస్టుల భర్తీతో తప్పిదాలు జరిగాయని హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీహెచ్డీ పూర్తి చేసి ఐదేళ్ల అనుభవం ఉంటేనే ప్రొఫెసర్ పోస్టుకు అర్హులు. ఈ నిబంధన పాటించకుండా ఏకంగా ముగ్గురికి ప్రొఫెసర్ పోస్టులు కట్టబెట్టారు. మిగిలిన వారి విషయంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి.. వెంటనే వారిని తొలగించాలని ఆదేశించింది. దీంతో శనివారం వర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించి ఎనిమిది మందిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.  

Published date : 17 Jul 2023 05:01PM

Photo Stories