Mangarani: యూ ట్యూబ్ వేదికగా పాఠాలు చెప్తున్న డిజిటల్ స్టార్ టీచర్
‘‘మా నాన్న తాపీమేస్త్రి. మా అమ్మ గృహిణి. పదవ తరగతి వరకు మా మురారి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మకేమో పిల్లలు బాగా చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని కోరిక. నాన్నకేమో నన్ను టీచర్‌గా చూడాలని ఇష్టం. మా అమ్మానాన్నల కలను నెరవేర్చగలిగాను. రాజమండ్రి మున్సిపల్ స్కూల్‌లో 2010లో టీచర్‌గా చేరాను. ఫస్ట్ క్లాస్ ఇచ్చారు. నాకప్పటికే మూడేళ్ల పాప. చిన్న పిల్లలకు పాఠాలకంటే ముందు కాన్సెప్ట్ నేరి్పంచాలనుకున్నాను. పాత న్యూస్ పేపర్‌లు, రంగు పేపర్‌లతో టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేశాను. ఆ ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చింది. నాకు కంప్యూటర్ కోర్సులు బాగా ఇష్టం. బీఎస్‌సీ కంప్యూటర్స్ చేశాను. ఆ పరిజ్ఞానం నాకు బోధనలో బాగా ఉపకరించింది. ఇంటర్నెట్‌లో శోధించి అనేక బాలగేయాలను సేకరించాను. కిన్ మాస్టర్, పవర్ డైరెక్టర్, వీడియో షో వంటి మొబైల్ యాప్‌లు ఉపయోగిస్తూ కాన్సెప్ట్‌లు తయారు చేసుకున్నాను. కార్పొరేట్ స్కూళ్లకు ఉన్నంతంగా మాకు వనరులుండవు. నాకు అందుబాటులో ఉన్న వనరులతో నాకు చేతనైనంతగా బోధన పరికరాలు తయారు చేసుకునేదాన్ని. ఇంటర్నెట్‌లో అన్నీ! ‘ఇప్పుడు అన్నీ ఇంటర్నెట్‌లో ఉన్నాయి కదా! మళ్లీ ఈ వీడియోలు ఎందుకు’ అనే కామెంట్‌లు వచ్చాయి. కానీ కొండంత సబ్జెక్ట్ నుంచి ఆ వయసు పిల్లలకు ఎంత సమాచారాన్ని వివరించాలి, అందుకు తగినట్లు మాడ్యూల్స్ ఎలా రూపొందించుకోవాలి అనే విషయంలో స్పష్టత ఉండాలి. ఒక సబ్జెక్టును ఒక తరగతి విద్యార్థీకి వివరించే క్రమంలో పాఠం ఎలా మొదలుపెట్టాలి, ఎలా ముగించాలనేది తెలిసి ఉండాలి. దీక్ష, సమగ్ర శిక్ష వంటి ప్రభుత్వ విద్యాబోధన కార్యక్రమాల్లో పని చేసి ఉండడం, టెక్స్›్ట బుక్ కంటెంట్ రైటర్‌గా పాఠాలు రాసిన అనుభవం, స్టేట్ రీసోర్స్ పర్సన్స్ గ్రూప్‌కి శిక్షణ ఇవ్వడం నాకు బాగా కలిసొచ్చాయి. గేయాలు, పాఠాలు, లెక్కలు అన్నింటికీ కాన్సెప్ట్ బోధన పాఠాలు రూపొందించగలిగాను. ఈ ప్రయత్నం కోవిడ్ సమయంలో బాగా ఉపయోగపడింది. ఫ్రూట్స్ ప్రోగ్రామ్ రూపొందించి ఆసక్తి ఉన్న టీచర్లకు ఆన్ లైన్ లోనే శిక్షణ ఇచ్చి రాష్ట్రంలో పిల్లలకు చేరువ చేశాం. ఈ ప్రయత్నంలో వందమందికి పైగా టీచర్లు పాల్గొన్నారు. రెండు గంటల క్లాసు కోసం మేము ఐదు గంటల హోమ్‌వర్క్ చేసేవాళ్లం. ఏపీ ఫైబర్‌నెట్ వాళ్లు ఇందుకోసం ఒక చానెల్ ఏర్పాటు చేయడంతో సిగ్నల్ సమస్య లేకుండా మా బోధన సౌకర్యవంతంగా సాగింది. యూ ట్యూట్‌లో నా పాఠాలు విన్న పిల్లలు కొందరు స్వయంగా ఫోన్ చేస్తారు. ‘మీ వీడియో చూసి మ్యాథ్స్ నేర్చుకున్నాను, నాకు ఫలానా పాఠం కావాలి, త్వరగా వీడియో చేయండి’ అని డిమాండ్ చేస్తుంటారు. పిల్లలు అలా అడుగుతుంటే చాలా ముచ్చటేస్తుంటుంది.
చదవండి:
Youtube: విడుదల చేసిన ఇంపాక్ట్ రిపోర్ట్ ప్రకారం.. టాప్ చానెళ్లలో కొన్ని..
YouTube: యూట్యూబ్ టాపర్లు వీరే.. చదువు, గేమ్‌లు నుండి వినోదం వరకు..
YouTube : దేశంలో టాప్-10 సక్సెస్ యూట్యూబర్స్ వీరే..! వీరి సంపాదన చూస్తే..
నిత్య విద్యార్థిని!
ఇప్పుడు పాఠాలను మరింత అడ్వాన్స్ డ్‌గా రూపొందించడానికి ఆన్ లైన్ లో యానిమేషన్ కోర్సు చేస్తున్నాను. అలాగే పిల్లలకు తెలుగు భాష మీద పట్టు రావడం కోసం ఓ ఎన్ ఆర్‌ఐ సూచనతో పజిల్స్ రూపొందిస్తున్నాను. కుటుంబం, ఉద్యోగంతోపాటు ఇన్ని చేయగలుగుతున్నానంటే... నా ఉత్సాహానికి మా ఇంట్లో అందరూ సహకరించడం వల్లనే సాధ్యమవుతోంది. స్టూడియోలో రికార్డ్ చేయగలిగిన స్థోమత నాకు లేదు. ఊరంతా నిద్రపోయి, నిశ్శబ్దంగా ఉన్న సమయంలో వాయిస్ రికార్డు చేయాలి. పిల్లల గొంతులు మా పిల్లలవే. రికార్డింగ్ పూర్తయ్యే వరకు వాళ్లు కూడా నిద్రపోరు. నాకు కంప్యూటర్ కోర్సు ఇష్టమని అప్పట్లో మా నాన్న తనకు ఉన్నంతలోనే ఖర్చులు సర్దుబాటు చేసుకుని నాకు కంప్యూటర్ కొనిచ్చారు. ఇప్పుడు మా వారు నాకు ఉపయోగపడుతుందని డెబ్బై వేల ఫోన్ బహుమతిగా ఇచ్చారు’’ అని తన పన్నెండేళ్ల బోధన ప్రస్థానాన్ని వివరించారు మంగారాణి.
గోదారమ్మాయి!
రాజమండ్రిలో మొదలైన మంగారాణి పాఠం ఖండాలు దాటింది. దాదాపుగా వంద దేశాలకు చేరింది. ఏడు కోట్ల మందిని స్క్రీన్ కు కట్టిపడేసింది. యూ ట్యూబ్ కూడా ఆశ్చర్యానందాలకు లోనయింది. ఆమెను అభినందనల్లో ముంచెత్తింది. ఈ డిజిటల్ స్టార్ టీచర్ పుట్టింది ఐటీ హబ్‌లున్న మెట్రోనగరంలో కాదు, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం నగరానికి పాతిక కిలోమీటర్ల దూరాన మురారి గ్రామంలో.
జాయ్ ఆఫ్ లెర్నింగ్
గేయాలతోపాటు పాఠాలు కూడా పిల్లల చేత యాక్షన్ చేయిస్తూ చెప్పించడం వంటి ప్రయోగాలు చేశాను. వాటిని నా ఫోన్ లో రికార్డు చేసి ‘మంగారాణి లెసన్స్ పేరుతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో ఎక్కువ మందికి చేరాయి. ‘తరగతి అంటే టీచర్ చెప్పింది విని తీరాల్సిందే’ననే ఆలోచనే పిల్లలను పాఠాలకు దూరం చేస్తుంది. తరగతి గది అంటే సంతోషంగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయగలిగిన ప్రదేశం అనుకుంటే... పిల్లలు పాఠాలు సంతోషంగా వింటారు. స్కూల్‌లో కంప్యూటర్‌లు లేకపోవడంతో నా లాప్‌టాప్‌తో నేరి్పంచేదాన్ని. టీచింగ్ మెథడాలజీని అధ్యయనం చేయడానికి ఫిన్ లాండ్‌కి వెళ్లిన టీచర్ ప్రొజెక్టర్ స్క్రీన్ ఇచ్చారు. ఒక ఎన్ ఆర్‌ఐ మా స్కూల్ గురించి తెలుసుకుని చూడడానికి వచ్చి ప్రొజెక్టర్ ఇచ్చారు. అలా నా ప్రయత్నంలో ఎంతోమంది సహకరిస్తున్నారు. నా కంప్యూటర్ పాఠాలు 2012 నాటికి పూర్తి స్వరూపానికి వచ్చాయి. ఈ పదేళ్లలో వెయ్యి పాఠాలు అప్‌లోడ్ చేశాను. వాటిని వంద దేశాల వాళ్లు చూస్తున్నారిప్పుడు. బంగ్లాదేశ్ వాళ్లు ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఈ కారణంగా నాకు దేశవిదేశాల్లోని టీచర్‌లతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచి్చంది.