విద్యార్థుల్లో ప్రత్యేక నైపుణ్యాల పెంపుదల
చదువుకు తగ్గ కొలువు దక్కించుకోవాలంటే అదనపు నైపుణ్యాలు తప్పనిసరి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. జిల్లాలోని 14 డిగ్రీ కళాశాలల్లో ఉపాధి కల్పన శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గానికో స్కిల్ హబ్ కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రత్యేకంగా ‘ఎక్సలెన్స్ సెంటర్’ ద్వారా శిక్షణ ఇస్తోంది.
డిగ్రీ స్థాయిలోనే నైపుణ్యాభివృద్ధి
ఉమ్మడి జిల్లాలోని 29 డిగ్రీ కళాశాలల్లో ఉపాధి కల్పన శిక్షణ కేంద్రాలు (ఎంప్లాయిబులిటీ స్కిల్ సెంటర్స్) ఏర్పాటయ్యాయి. ఇందులో అనంతపురం జిల్లా పరిధిలో 14 ఉన్నాయి. వీటి ద్వారా 2022–23 విద్యాసంవత్సరంలో 7,314 మంది డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అకడమిక్ కోర్సులు ఆయా కళాశాలల్లోనే అభ్యసిస్తారు. అలాగే అదనపు నైపుణ్యాలు పెంపొందించేలా తర్ఫీదు ఇస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ –కామర్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, ఫార్మా మార్కెటింగ్, ట్యాలీ విత్ జీఎస్టీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్, పైథాన్ ట్రైనింగ్, హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్స్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాల్లో చేరేలా తీర్చిదిద్దుతున్నారు.
చదవండి:
Sakshi Media: ఆధ్యర్యంలో ఎంసెట్, నీట్ విద్యార్థులకు మాక్‌టెస్టులు..
High Court: ఈ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు?
TSPSC: పరీక్షపత్రాల లీకేజీ.. రంగంలోకి ఈడీ..
AP EAPCET 2023: ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఇసారి ఈ అడ్మిషన్లు ఇలా..
స్కిల్ హబ్‌లతో భవితకు దన్ను
కాలానుగుణంగా పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు దీటుగా నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్ హబ్ విధానాన్ని తెచ్చింది. పలు రంగాలకు చెందిన కోర్సుల్లో తర్ఫీదు ఇస్తూ అవకాశాలు కల్పించడానికి వీటిని వేదికగా మార్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక స్కిల్ హబ్ చొప్పున ఏర్పాటు చేసింది. ప్రతి బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇస్తోంది. నిర్దేశించిన అర్హతలు కల్గిన వారిని ఆయా కోర్సుల్లో చేర్చుకుని శిక్షణ ఇస్తున్నారు.
స్కిల్ కాలేజీలో శిక్షణ.. ఉద్యోగం
అనంతపురం జేఎన్‌టీయూలోని సీఎం ఎక్సలెన్స్ సెంటర్‌లో స్కిల్ కళాశాల ఏర్పాటైంది. ఇక్కడ నైపుణ్యం పెంపొందించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు అదనపు నైపుణ్యాలు పెంపొందించడానికి వీలుగా మరిన్ని కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. తాజాగా రెండు కోర్సులు నిర్వహిస్తున్నారు. సీఎన్‌సీ ప్రోగ్రామింగ్ అనే కోర్సుకు బీటెక్ మెకానికల్ పూర్తి చేసిన వారు లేదా డిప్లొమా మెకానికల్ పూర్తి చేసి రెండేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులు. మూడు ఏప్రిల్ల ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. ఏప్రిల్కు రూ.20 వేల వేతనం తగ్గకుండా ఉద్యోగం వచ్చేలా చూస్తారు. మెకాట్రానిక్స్ అనే కోర్సుకు బీటెక్ మెకానికల్, ఈఈఈ, ఈసీఈ పూర్తి చేసిన వారు లేదా డిప్లొమా పూర్తి చేసి రెండేళ్ల అనుభవం గల వారు అర్హులు. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది చొప్పున ఎన్ని బ్యాచ్‌లు అయినా నిర్వహిస్తారు.
యువతకు ప్రత్యేక శిక్షణ
చదువు పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటున్న నిరుద్యోగ యువతకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. పీఎంకేవీవై 3.0, న్యూ ఇన్షియేటివ్, సెక్టార్ స్పెసిఫిక్, ఆర్‌పీఎల్, ఈఎస్‌డీఎం, ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. 2022–23లో 830 మందికి లక్ష్యం నిర్దేశించగా, 675 మందికి ఉద్యోగాలు కల్పించారు. కియా కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు అనంతపురం, పెనుకొండలో రెండు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 2022–23లో ఇప్పటి దాకా 5 వేల మందికి శిక్షణ ఇవ్వగా 4,100 మందికి కియా పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకూ మూడు రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2022–23లో 15 ప్రోగ్రామ్‌లు నిర్వహించి 469 మందికి శిక్షణ ఇచ్చారు. ఇందులో 89 మంది యూనిట్లు స్థాపించారు. 26 మెగా జాబ్‌మేళాలు నిర్వహించి 9,500 మందికి ఉద్యోగాలు కల్పించారు.