Deemed Medical Colleges: డీమ్డ్ మెడికల్ కాలేజీలపై సర్కారు గరం
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయా లని భావిస్తోంది. అవసరమైతే కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 15న ’సాక్షి’ లో ‘వైద్య విద్య సీట్లపై ప్రైవేట్ కన్ను’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు.
ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కన్వినర్ కోటా, రిజర్వేషన్ కోటా సీట్లు తగ్గిపోయి మెరిట్, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి, ఈ అంశం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, డీమ్డ్ వర్సిటీలను అడ్డుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్టుగా విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
చదవండి: 6 Hours Duty Daily: ‘వీరికి రోజుకు 6 గంటలే పని ఉండాలి’
దీనిపై కాళోజీ యూనివర్సిటీ అధికారులతోనూ మంత్రి సమీక్ష చేసినట్టు తెలిసింది. యూజీసీ తీరు బడుగు, బల హీన వర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థులకు తీరని అన్యాయం చేసే విధంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించినట్టు అధికారులు చెబుతున్నారు.
‘మల్లారెడ్డి’ బాటలో మరికొన్ని కాలేజీలు!
మల్లారెడ్డి మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలకు డీమ్డ్ వర్సిటీ హోదాను ఇస్తూ ఇటీవలే యూజీసీ నిర్ణయం తీసుకుంది. ఫీజుల ఖరారు, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల మూల్యాంకనం వంటివన్నీ వర్సిటీ హోదాలో సొంతంగా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. తెలంగాణ స్థానిక కోటా అమలు చేయాల్సిన అవసరం లేకుండా మినహాయింపులు ఇచ్చింది. దీంతో మల్లారెడ్డి కాలేజీల్లో ఉన్న 400 ఎంబీబీఎస్ సీట్లు, సుమారు 150 బీడీఎస్ (డెంటల్) సీట్లు పూర్తిగా మేనేజ్‌మెంట్ కోటాలోకి వెళ్లిపోయాయి.
గతేడాది వరకూ ఇందులో సగం సీట్లను కన్వినర్ కోటాలో భర్తీ చేసేవారు. నీట్‌లో మంచి ర్యాంక్ సాధించిన ప్రతిభ గల విద్యార్థులకు ఈ సీట్లు దక్కేవి. ర్యాంకు సాధించిన పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదివే అవకాశం దక్కేది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లలోనూ 85 శాతం తెలంగాణ విద్యార్థులకే కేటాయించేవారు.
కానీ ఇకపై ఈ నిబంధనలు ఏవీ పాటించాల్సిన అవసరం లేకుండా యూజీసీ ‘మల్లారెడ్డి’కి మినహాయింపులు ఇచి్చంది. ‘మల్లారెడ్డి’చూపిన బాటలో అపోలో, సీఎంఆర్ కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి దామోదర దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టారు.
కోట్లలో ఆదాయం!
డీమ్డ్ యూనివర్సిటీ హోదా తెచ్చుకుంటున్న మెడికల్ కాలేజీలకు రూ. వందల కోట్ల లబ్ధి చేకూరుతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీటు ఫీజు రూ. 60 వేలు మాత్రమే ఉండగా, మేనేజ్‌మెంట్ కోటా ఫీజు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రెగ్యులేటరీ కమిటీ ఫీజులను నిర్ణయిస్తోంది. అయితే డీమ్డ్ యూనివర్సిటీలు ఈ కమిటీతో సంబంధం లేకుండా, సొంతంగానే తమ ఫీజులను నిర్ణయించుకునే అధికారాన్ని యూజీసీ కల్పిస్తోంది.
మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజు సంవత్సరానికి రూ.17.5 లక్షలుగా ఉన్నట్టు కాళోజీ అధికారులు చెబుతున్నారు. గతంలో కన్వినర్ కోటా ఫీజు కింద 200 సీట్లకు ఏడాదికి రూ.1.2 కోట్లు వస్తే, ఇప్పుడు అవే 200 సీట్లకు ఏడాదికి రూ.35 కోట్ల ఆదాయం వస్తుంది. ఒక్క బ్యాచ్ పూర్తయ్యేసరికి ఏకంగా రూ.175 కోట్లు సమకూరుతుంది.
Tags
- Deemed Medical Colleges
- Government Medical colleges in Telangana
- Medical Colleges in Telangana
- Telangana Private Medical Colleges
- Private Medical Colleges
- Private Dental Colleges
- deemed university
- University Grants Commission
- UGC
- Medical education Seats
- Medical and Health Department
- Damodara Rajanarsimha
- Sakshi Paper Article
- telangana cm revanth reddy
- kaloji narayana rao university of health sciences
- knruhs
- Mallareddy Medical College
- NEET Rankers
- Telangana News
- Deemed Universities in Telangana