Palamuru University: డిగ్రీ పరీక్షలో గందరగోళం.. పాత సిలబస్ నుంచి ప్రశ్నలు
ఈ విద్యా సంవత్సరం ఆంగ్లం సబ్జెక్టులో చాలా వరకు మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే పాత సిలబస్ నుంచి ప్రశ్నలు రాగా.. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఈ విషయాన్ని ఆయా ఎగ్జామినర్ల దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే ప్రశ్నాపత్రాలను అధికారులు వెనక్కి తీసుకుని 45 నిమిషాల తర్వాత తిరిగి కొత్త ప్రశ్నాపత్రాలను ఇచ్చారు. దీంతో ఉదయం 9.30గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైనట్లు విద్యార్థులు పేర్కొన్నారు. కొన్ని చోట్ల మరింత ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
మార్చిన ప్రశ్నాపత్రాలను అధికారులు ఆన్‌లైన్‌న్ ద్వారా పంపించగా వెంటనే ప్రింట్ తీయించిన ఎగ్జామినర్లు విద్యార్థులకు ఇచ్చారు. ఎంతో కీలకమైన పరీక్షల్లో పీయూ పరీక్షల విభాగం అధికారులు నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చదవండి: ‘NAAC’ బృందం డిగ్రీ కళాశాల సందర్శన
అనుభవం లేనివారికి బాధ్యతలు..
యూనివర్సిటీ మొత్తంలో ఎగ్జామినేషన్ విభాగం ఎంతో కీలమైంది. ఇంత కీలకమైన బాధ్యతలను యూనివర్సిటీ అధికారులు సీనియర్, గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వారిని నియమించాల్సి ఉంది. కానీ గతంలో అడిషనల్ కంట్రోలర్ బాధ్యతలు నిర్వహించిన అధికారులు ప్రస్తుతం కంట్రోలర్‌గా ఉన్నారు.
ఆయన ఢిల్లీ వెళ్లడంతో.. పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఎలాంటి అనుభవం లేని ఓ అధికారిణికి అప్పగించినట్లు సమాచారం. దీంతో పరీక్షల నిర్వహణలో తప్పులు దొర్లినట్లు పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. వీసీ వెంటనే స్పందించి అర్హత, అవగాహన కలిగిన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
- ఈ విషయంపై ఇన్‌చార్జ్‌గా ఉన్న అధికారిణిని ఫోన్‌లో సంప్రదించగా.. పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లు జరగలేదని, ఎవరికీ ఇబ్బందులు లేవని.. ప్రశాంతంగా జరిగిందని చెప్పడం గమనార్హం.
48 పరీక్ష కేంద్రాల్లో 11 మంది డీబార్
పీయూ పరిధిలో 48 పరీక్ష కేంద్రాల్లో జరిగిన డిసెంబర్ 14న జరిగిన పరీక్షల్లో మొత్తం 11 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. ఈ మేరకు 5వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 10,921 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 10,626 మంది హాజరయ్యారు.
మరో 290 మంది గైర్హాజరు కాగా ఐదుగురు చూచిరాతలకు పాల్పడుతుండగా వారిని డీబార్ చేశారు. వీరితో పాటు 1వ సెమిస్టర్‌లో 13,234 మంది విద్యార్థులకు 12,430 మంది హాజరయ్యారు. 798 మంది గైర్హాజరు కాగా.. మరో ఆరుగురు చూచిరాతలకు పాల్పడగా అధికారులు వారిని డీబార్ చేశారు.
ప్రశ్నాపత్రం మార్చి ఇచ్చాం..
డిసెంబర్ 14న జరిగిన 5వ సెమిస్టర్ ఇంగ్లీష్ పరీక్షలో కొన్ని పాతప్రశ్నలు రాగా.. లోపాన్ని గుర్తించి వెంటనే పశ్నాపత్రాన్ని మార్చి ఇచ్చాం. దీంతో పరీక్ష 25 నిమిషాలు ఆలస్యం అయ్యింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
– రాజ్‌కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్