Coding School: గాడితప్పిన ‘కోడింగ్ స్కూల్’!
సాంకేతిక నిపుణులు, ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షకులతో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు చిన్నతనం నుంచే కల్పించి ఉత్తమ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల ఇప్పుడు సాధారణ గురుకులం మాదిరిగా తయారైంది. కోడింగ్ స్కూల్‌లో సాంకేతిక నిపుణులను పూర్తిస్థాయిలో నియమించకపోవడం... ఇన్ఫర్మెషన్ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై అవగాహన కలి్పంచే సదస్సులకు విద్యార్థులను తీసుకెళ్లకపోవడం, పారిశ్రామిక విజ్ఞాన యాత్రలను అటకెక్కించడం... కోడింగ్ తరగతులను సైతం నిర్దేశించిన సమయాల్లో నిర్వహించకపోవడంతో కోడింగ్ స్కూల్ స్ఫూర్తి దెబ్బతింటోంది.
చదవండి: Coding and Programming Skills: ఐటీలో కొలువులు.. లక్షల్లో వేతనం..
ఉన్నత లక్ష్యం...
సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎస్సీ గురుకులాల నుంచి ఎంపిక చేసి వారికి కోడింగ్ స్కూల్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కోడింగ్ పాఠశాలను నిర్వహిస్తోంది. ఈ క్యాంపస్‌లో బాలురు, బాలికలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఇక్కడే వసతి కలి్పస్తున్నారు. డిగ్రీ స్థాయి పిల్లలకు బాలానగర్ సమీపంలో కోడింగ్ కాలేజీని నిర్వహిస్తున్నారు. కోడింగ్ పాఠశాలలో సాధారణ గురుకుల పాఠశాల/కళాశాలకు సంబంధించిన తరగతులను సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగగా... కోడింగ్‌కు సంబంధించిన తరగతులు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఒక ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ప్రైవేటు సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ కోడింగ్ పాఠశాలలో సాంతికేతిక నిపుణులను, ట్రైనర్లను నియమించుకుని విద్యార్థులకు రోజుకు 4 గంటలపాటు తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వాలి. అంతర్జాతీయ, జాతీయ ఐటీ సదస్సులకు విద్యార్థులను తీసుకెళ్లి అవగాహన కల్పించాలి. ఇండ్రస్టియల్ టూర్లలో భాగంగా సాఫ్ట్‌వేర్ సంస్థలను ప్రత్యక్షంగా చూపించి కోడింగ్, ప్రోగ్రామింగ్, యానిమేషన్ తదితర కంప్యూటర్ ఇంజనీరింగ్‌పై అవగాహన పెంచాలి. ఇందుకు ఏటా కోడింగ్ అంశం కోసమే టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ రూ. 6 కోట్లు ఖర్చు చేస్తోంది. మూడేళ్ల కాలానికి రూ. 18 కోట్ల బడ్జెట్ కేటాయించింది.
చదవండి: Career Opportunities in Mobile App Development... నైపుణ్యాలు, కొలువులకు మార్గాలు..
కోడింగ్ స్కూల్ ఉద్దేశం
ఆరో తరగతి నుంచే విద్యార్థికి సాధారణ పాఠ్యాంశంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ప్రోగ్రామింగ్‌పై అవగాహన కలి్పస్తూ శిక్షణ ఇవ్వడం
లక్ష్యం
కాలేజీ స్థాయికి వచ్చేసరికి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ నిపుణులుగా విద్యార్థులను తయారు చేయడం
ఎన్ని స్కూళ్లు
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలో మూడు కేటగిరీల్లో ఈ స్కూళ్లున్నాయి. బాలురు–1, బాలికలు–1, డిగ్రీ ద్యార్థులకు–1
ఏటా చేస్తున్న ఖర్చు
సాధారణ పాఠశాల నిర్వహణ ఖర్చులకు అదనంగా ఏటా రూ. 6 కోట్లు.
ప్రస్తుత పరిస్థితి
కోడింగ్ బోధన అయోమయం.. సాధారణ పాఠశాలల మాదిరిగా క్లాసులు.
చదవండి: కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ప్రముఖ ఐటీ సంస్థల శిక్షణ.. వీటితో వచ్చే లాభాలివే..
తూట్లు పొడుస్తున్న కాంట్రాక్టు సంస్థ
2020 నుంచి మూడేళ్ల కాలానికి టెండర్లు దక్కించుకున్న ప్రైవేటు సంస్థ క్రమంగా కోడింగ్ లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. తగినంత మంది సాంకేతిక నిపుణులు, శిక్షకులను నియమించకుండా అరకొర తరగతులతో చేతులు దులుపుకుంటోంది. గత రెండేళ్లుగా ఇండ్రస్టియల్ టూర్లకు మంగళం పాడిన ఆ సంస్థ... అవగాహన సదస్సులను సైతం అటకెక్కించింది. కేవలం సాధారణ స్కూల్ కార్యకలాపాలతోపాటు రోజులో అరకొరగా థియరీ తరగతులతో కాలం వెళ్లదీస్తోంది. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సొసైటీకి పూర్తిస్థాయి కార్యదర్శి లేకపోవడం... ఇతర ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తినా సొసైటీ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సొసైటీలోని ఓ ఉన్నతాధికారి ప్రమేయం ఉండటంతో ప్రైవేటు సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు
వస్తున్నాయి.