College: ప్రతిభావంతుల కార్ఖానా ‘సిటీ కాలేజీ’
- సిటీ కాలేజీ శతాబ్ధి ఉత్సవాల్లో నవీన్ మిట్టల్
- సాదాసీదాగా వేడుకలు
- హాజరుకాని పూర్వ విద్యార్థుల
వందేళ్లుగా ఎంతోమంది ప్రతిభావంతులను అందించిన ఘనత ప్రభుత్వ సిటీ కళాశాలకు దక్కుతుందని కళాశాలల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. మంగళవారం సిటీ కళాశాల శతాబ్ధి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సిటీ కళాశాల మినీ విశ్వవిద్యాలయమని... విస్తృతమైన బోధనానుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారని కొనియాడారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా 50కి పైగా ఆధునాతన కోర్సులను అందిస్తున్న ఘనత సిటీ కాలేజీకి దక్కుతుందన్నారు. 100 మంది విద్యార్థులతో ప్రారంభమై నేడు 4,500 మంది విద్యార్థులు నగరంలోనే ప్రథమ కాలేజీగా నిలిచిందన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఆచార్య గంటా చక్రపాణి మాట్లాడుతూ... తెలంగాణలోని తొలితరం విద్యావేత్తల్లో పలువురు సిటీ కళాశాల పూర్వ విద్యార్థులేనన్నారు. సిటీ కళాశాలను హైదరాబాద్‌కు శాంతినికేతన్‌గా అభివరి్ణంచారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వనితులుగా నిజాం వారసుడు నవాబ్ నజబ్ అలీ ఖాన్, కళాశాల పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది విద్యాధర్ భట్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ పి.బాల భాస్కర్, శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ కోయి కోటేశ్వర్ రావు, అనురాధ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ విప్లవ్‌దత్ శుక్లా, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సాదాసీదాగా శతాబ్ది ఉత్సవాలు...
అతి పురాతనమైన సిటీ కళాశాల ఉత్సవాలు ఎలాంటి ఆడంబరాలు లేకుండా సీదాసాదాగా కళాశాల ఆడిటోరియం హాల్‌లో నిర్వహించారు. కళాశాలలో చదువుకొని వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు, పూర్వ విద్యార్థులు కార్యక్రమానికి హాజరు కాకపోవడం విశేషం. కళాశాల ఆవరణలో శానిటైజేషన్ పనులు చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిచ్చాయి.