Skip to main content

Google Map మోసగించింది!.. ఇంటర్‌ విద్యార్థి

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు మార్చి 15న తొలిరోజు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా జరిగాయి.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలోని పరీక్ష కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చి, పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన 9 మంది విద్యార్థులు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధన కారణంగా పలు జిల్లాల్లో కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. మొదటి రోజు 95 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. సుమారు 23 వేల మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాలకు పరిశీలకులను పంపించినట్లు చెప్పారు. మార్చి 16 నుంచి సెకండియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

వారు ఆత్మవిశ్వాసం చాటారు...

  • విద్యుత్‌ షాక్‌కు గురై గతేడాది మణికట్టు వరకు చేతులు కోల్పోయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోని నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం గామాపూర్‌ తండా విద్యార్థి చౌహాన్‌ సాయికిరణ్‌ ఓ సహాయకుడి సాయంతో ఇంటర్‌ పరీక్ష రాశాడు.
  • కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్‌ తండాకు చెందిన విజయ్‌సింగ్‌ అనే విద్యార్థికి గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. అయినా పరీక్ష రాసేందుకు హాజరయ్యాడు.
  • గతంలో జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో ఎడమ చేయిని కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం శివారు రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన ఆదివాసీ గిరిజన విద్యార్థిని మడిమి మోతీ ఒంటి చేత్తోనే పరీక్ష రాసింది.
  • గత కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న భద్రాద్రి జిల్లా పినపాక మండలం భట్టుపల్లి కేజీబీవీ విద్యార్థిని కోరం శైలజను కుటుంబ సభ్యులు పినపాకలోని పరీక్ష కేంద్రానికి తీసుకురాగా పోలీసులు ఆమెను కుర్చీపై కూర్చోబెట్టి పరీక్ష రాయించారు.
  • భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని నలంద కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థి ఫిట్స్‌కు గురైనప్పటికీ సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొంది మళ్లీ పరీక్ష రాసేందుకు వచ్చాడు.
  • మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని అనంతారం మోడల్‌ కళాశాలలో అభిలాష్‌ అనే విద్యార్థి అపెండిసైటిస్‌ బారినపడినప్పటికీ ఆపరేషన్‌ చేయించుకున్న 24 గంటల్లోనే పరీక్ష కేంద్రానికి వచ్చి పరీక్ష రాశాడు.
  • నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలోని తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో చదువుతున్న సాంపల్లి తండావాసి రాథోడ్‌ అక్షయకు గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగాయి. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ బుధవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకున్న ఆమెకు ఇన్విజిలేటర్లు ప్రత్యేకంగా గది బయట కుర్చీ ఏర్పాటు చేశారు. సహాయకుడి సాయంతో ఆమె పరీక్ష రాసింది.
  • మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం స్టేషన్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బైపీసీ ఫస్టియర్‌ చదువుతున్న శిరీష అనే యువతి తన 3 నెలల పాప (దీక్షిత), తల్లితో కలసి మండల కేంద్రంలోని ఓ సెంటర్‌కు వచ్చింది. ఆమె పరీక్ష రాస్తున్నంతసేపు మనవరాలిని అమ్మమ్మ ఆడిస్తూ గడిపింది.

గూగుల్‌ మ్యాప్‌ మోసగించింది!

ఖమ్మం రూరల్‌ మండలం కొండాపురానికి చెందిన కొండా వినయ్‌ ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ సీఈసీ చదువుతున్నాడు. ఎన్నెస్పీ క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష రాయాల్సిన అతను గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా బయలుదేరగా అది ఇంకో ప్రాంతానికి దారిచూపింది. దీంతో సరైన చిరునామా తెలుసుకొని ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకొనే సరికి 20 నిమిషాలు ఆలస్యం కావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. మరోవైపు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 13 మంది, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు ఉదయం 9 గంటలు దాటాక పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో అధికారులు వారిని తిప్పిపంపారు.

పరీక్షలకు హాజరైన విద్యార్థులు వివరాలు..

మొత్తం విద్యార్థులు

5,05,625

హాజరైనవారు

4,82,427

గైర్హాజరైనవారు

23,198

గైర్హాజరైనవారి శాతం

4.58%

Published date : 16 Mar 2023 03:54PM

Photo Stories