Skip to main content

British High Commissioner: మీరూ కావచ్చు ఒక్కరోజు.. బ్రిటిష్ హైకమిషనర్!

బ్రిటిష్‌ హైకమిషనర్‌గా పనిచేయాలని ఉందా?.. ఏళ్లకొద్దీ కాదులెండి.. ఒక్కరోజు మాత్రమే.
British High Commissioner
మీరూ కావచ్చు ఒక్కరోజు.. బ్రిటిష్ హైకమిషనర్!

హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయం సెప్టెంబర్ 13న ఈ అవకాశం కల్పిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. అయితే అందరికీ ఈ చాన్స్ లేదు. 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతులు మాత్రమే అర్హులు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అర్హులైన యువతులు సెప్టెంబర్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తుదారులు..‘యువజనం వాతావరణ మార్పుల్లాంటి సమస్యల పరిష్కారంలో ఏ రకంగా మెరుగైన మద్దతు ఇవ్వగలరు’అన్న అంశంపై నిమిషం నిడివి ఉన్న వీడియో తీసి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. ఇన్ స్టాగ్రామ్లో @UKinIndia కు ట్యాగ్ చేయడంతోపాటు #DayoftheGirl హ్యాష్ట్యాగ్ను ఉపయోగించాలి.

సెప్టెంబర్ 28న విజేత వివరాలు వెల్లడి...

‘భారత ప్రధాని మోదీ బాలిక సాధికారతకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. యూకే ప్రభుత్వం ఇచ్చే ఛీవెనింగ్ ఫెలోషిప్లో 60%, స్కాలర్షిప్లలో 52% మహిళలకు దక్కుతుండటం సంతోషదాయకం. ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ద్వారా మహిళలు ఏదైనా సాధించగలరు అన్న అంశాన్ని చాటిచెప్పాలని నిర్ణయించాం’అని భారత్లో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ప్రకటనలో తెలిపారు. 2017 నుంచి ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ను నిర్వహిస్తున్నామని వివరించింది. దరఖాస్తుదారుల వివరాలను హైకమిషన్ నేతృత్వంలోని న్యాయనిర్ణేతలు పరిశీలించి ఒకరిని ఎంపిక చేస్తారని, సెప్టెంబర్ 28న విజేత వివరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తామని తెలిపారు. ఒక్కొక్కరు ఒక్క దరఖాస్తే చేయాలని, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే ఆ వ్యక్తిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలను వీడియోలో ఉంచరాదని పేర్కొన్నారు. విజేత ఒక రోజుపాటు ఢిల్లీలో బ్రిటిష్ హైకమిషనర్గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన రవాణా, వసతి ఖర్చులను కమిషన్ భరించదు.

చదవండి:

Skill Development Courses: ’స్కిల్’ పుల్ కోర్సులు...అవసరాలకు తగ్గ నైపుణ్యాలు

CPGET 2021: సీపీజీఈటీ–2021 హాల్‌టికెట్ల జారీ

Published date : 14 Sep 2021 02:07PM

Photo Stories