Skill Development Courses: ’స్కిల్’ పుల్ కోర్సులు...అవసరాలకు తగ్గ నైపుణ్యాలు
ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దడంతోపాటు పాఠ్యాంశాలను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు, శిక్షణ, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై సీఎం జగన్ సెప్టెంబర్ 13న తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
నిర్దేశిత ప్రమాణాలు సాధించాలి
ఐటీఐలను తీర్చిదిద్దడం ద్వారా ఆ ప్రాంతంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు స్థానికంగా ఒక పారిశ్రామిక శిక్షణ సంస్ధ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ప్రైవేట్ ఐటీఐల్లో కనీస సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికేషన్ చేయించాలని, ప్రతి కాలేజీ నిర్దేశిత ప్రమాణాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన బోధన సిబ్బందిని సమకూర్చడంతోపాటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో టీచింగ్ సిబ్బందిపై పరిశీలన చేయాలని ఆదేశించారు.
డ్రాపౌట్ యువత నైపుణ్యాలపై దృష్టి
ప్రతి ఐటీఐలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (ఎన్ ఏసీ) లాంటి సంస్థలను భాగస్వాములుగా చేయడం వల్ల నైపుణ్యాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టెన్త్ లోపు డ్రాపౌట్ యువకుల నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
75% ఉద్యోగాలు స్థానికులకే
కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల్లో శిక్షణ పొందిన అభ్యర్థుల డేటాను పంపడంతో పాటు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
నైపుణ్యాలు పెరగాలి..
తాగునీటి ప్లాంట్లు, మోటార్లు, సోలార్ యూనిట్లు.. ఇలా రోజువారీ అవసరాలతో ముడిపడినవి, నిత్యం మనం చూస్తున్న ఉపకరణాల నిర్వహణ, మరమ్మతులపై యువత నైపుణ్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పారిశుద్ధ్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు. నైపుణ్యం లేని మానవ వనరుల కారణంగా కొన్నిచోట్ల మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు సరిగా పనిచేయడం లేదని, నిర్వహణ కూడా సరిగా ఉండడం లేదని సీఎం ప్రస్తావించారు. నిత్య జీవితంతో సంబంధం ఉన్న అంశాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంగ్లిషులో పరిజ్ఞానాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు నిపుణులైన మానవ వనరులు
కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ కోసం నైపుణ్యం కలిగిన
మానవ వనరులను అందించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
పరిశ్రమల ప్రతినిధులతో సమావేశాలు
పరిశ్రమల ప్రతినిధులతో తరచూ సమావేశమయ్యేలా ప్రతి నెలా మూడు రోజులపాటు వారికి కేటాయించాలని ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఉండాలని, శిక్షణ పొందిన వారికి అప్రెంటిషిప్ లభించేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
విశాఖలో వెంటనే హై ఎండ్ స్కిల్ వర్శిటీ పనులు
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఒక కాలేజీని అందుబాటులోకి తెస్తున్నామని, విశాఖలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీ, తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖలో హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
వినూత్నంగా తరగతి గదులు
స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలతో పాటు కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల తరగతి గదుల నిర్మాణంలో వినూత్న పద్ధతులు పాటించాలని సీఎం జగన్ సూచించారు. ప్రస్తుతం 82 ప్రభుత్వ, 84 ప్రైవేట్ ఐటీఐలు శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సమావేశానికి ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ – శిక్షణ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్య, స్కిల్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూధన్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కె.అజయ్‌రెడ్డి, ఎండీ ఎన్.బంగార్రాజు తదితరులు హాజరయ్యారు.
బోధన డిజిటలైజేషన్
నిపుణులతో బోధనా తరగతులు నిర్వహించే సమయంలో డిజిటల్ పద్ధతిలో పొందుపర్చా లని, మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆ వీడియోలను వినియోగించుకోవచ్చని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు.
గ్రామాలకు ఇంటర్నెట్..
గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు, వర్క్‌ఫ్రం హోం మధ్య సమన్వయం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
సిలబస్ బాధ్యత స్కిల్ వర్సిటీలకు
నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్య ప్రణాళికను హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ, స్కిల్ యూనివర్శిటీలు రూపొందిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐవోటీ లాంటి అంశాల్లో యువత పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో బోధన, శిక్షణ ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
చదవండి:
ఆఫ్టర్ టెన్త్..సత్వర ఉపాధికి.. ఒకేషనల్ కోర్సులు ఇవే..!
ఏ ఇంటర్వ్యూలోనైన.. విజయం సాధించాలంటే ఇవి తప్పనిసరి..!