అగ్రి ఇన్ఫోటెక్–2021
Sakshi Education
వ్యవసాయంలో అత్యాధునిక సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా అగ్రి ఇన్ఫోటెక్ భారీ ప్రదర్శనను నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలు సంయుక్తంగా నిర్ణయించాయి.
డిసెంబర్ 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనకు గుంటూరు లాంలోని విశ్వవిద్యాలయ ప్రాంగణం వేదిక కానుంది. సుమారు 200లకు పైగా అగ్రి ఇన్ఫోటెక్ సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. టెక్నాలజీ ఆవిష్కరణ, వ్యవసాయ మెళకువలు, వాతావరణ మార్పు వంటి అంశాలు సాగు తీరుపై ఎలా ప్రభావం చూపుతాయో, వాటికి పరిష్కార మార్గాలేమిటో చెప్పడమే ఈ ప్రదర్శన లక్ష్యం. ఈ ప్రదర్శన నిర్వహణకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటైంది.
- అగ్రి ఇన్ఫోటెక్–2021లో పాల్గొనే వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పంటలపై అవగాహన కల్పిస్తుంది. సాగు రంగం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇస్తుంది.
- ఎరువుల నాణ్యత, వినియోగం, సేంద్రియ పద్ధతుల ఆచరణ వంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేలా ఈ ప్రదర్శన ఉంటుంది.
- సమీకృత పోషకాలు, తెగుళ్ల నివారణ వంటి వాటికి పరిష్కారాలను ఈ ప్రదర్శన ద్వారా అన్వేషించే ప్రయత్నం జరుగుతుంది.
- ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్, సహజ వనరుల నిర్వహణ, పర్యావరణ అనుకూలమైన వ్యవసాయ ఉత్పాదకాలు, వ్యవసాయ కూలీల కొరత వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నాయి.
చదవండి:
ICAR: వ్యవసాయ విద్యలో మన వర్సిటీకి 11వ ర్యాంక్
Published date : 13 Dec 2021 01:40PM