గ్రంథాలయం @ 68 ఇయర్స్
అన్ని వర్గాల పాఠకులకు పుస్తక విజ్ఞానం అందిస్తూ తాడిపత్రి గ్రంథాలయం పాఠకుల మన్ననలను పొందుతోంది. పట్టణంలోని ఇళ్లకొండయ్య వీధిలో పక్కా భవనంలో గ్రంఽథాలయం ఉంది. ఇందులో 2300 సభ్యులు ఉన్నారు. ఆలాగే 22వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. గ్రంథాలయ నిర్వహణతోపాటు అన్ని వర్గాల పాఠకులకు అందుబాటులో పుస్తకాలు ఉంటుండంతో ప్రతి రోజు 40 నుంచి 50 మంది పాఠకులు వస్తుంటారు. దీంతో పలువురికి తాడిపత్రి గ్రంథాలయ ఆదర్శంగా నిలుస్తోంది.
1955లో ప్రారంభం
కర్నూలు, వైఎస్సార్, అనంతపురం మూడు జిల్లాలకు కేంద్రంగా పట్టణం ఉంటోంది. పట్టణంలో దాదాపు 1.2 లక్షల జనాభా ఉంది. పట్టణంలోని ఇళ్ల కొండయ్య వీధిలో 1955లో ఒక గదిలో గ్రంథాలయాన్ని అధికారులు ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ నిధులు రూ 10 లక్షలు, రాజారామ్మోహన్‌రాయ్(కలకత్తా వారు) రూ 10 లక్షల నిధులతో 2017 ఫిబ్రవరి 6న నూతన భవనం ప్రారంభమైంది. తాడిపత్రి గ్రంథాలయంలో మూడు గదులున్నాయి. రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 వరకు సాయంత్రం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు గ్రంథాలయం పని చేస్తుంది. ప్రతి శుక్రవారం, నెలలో రెండో శనివారం, ప్రభుత్వ సెలవుల్లో గ్రంథాయలం పని చేయదు.
పాఠకులకు అందుబాటులో పుస్తకాలు ఇవే..
పురాణాలు, పోటీ పరీక్షలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, నవలలు, చిన్న పిల్లల పుస్తకాలు, మేనేజ్‌మెంట్, మెంటల్ ఎబిలిటీ, ఆరోగ్యం, వంటలు, హిందీ, ఇంగ్లిష్ పుస్తకాలు, సైకాలజీ, 8 తెలుగు దినపత్రికలు, మూడు ఆంగ్ల పత్రికలతోపాటు వార, మాస పత్రికలు ,విజ్ఞాన పత్రికలు, చిన్న పిల్లల కథల పుస్తకాలు అందుబాటులో ఉంటున్నాయి. గ్రంథాలయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి తద్వారా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తోంది. వివిధ రకాల పోటీ పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనపరచిని విద్యార్థులకు పోత్సహక బహుమతులను పంపిణీ చేస్తోంది.