Skip to main content

Job Opportunities: త్రివిధ దళాల్లో మహిళలకు ధీటైన ఉన్న‌త మార్గాలు ఇవే..

త్రివిధ దళాలు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. వీటిలో కెరీర్ అంటే.. పురుషులకే అనే అభిప్రాయం! మహిళలు రాణించలేరనే అపోహ! మూడు విభాగాల్లో.. ఎందులో చూసినా.. పురుషులకే పెద్దపీట అనే అభిప్రాయం! కానీ.. ఇటీవల కాలంలో పరిస్థితి మారుతోంది.
ministry of defence recruitment
Ministry of Defence

త్రివిధ దళాల్లో మహిళలకు ప్రాధాన్యం లభిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ.. త్రివిధ దళాల్లో చేరిన మహిళలకు పర్మనెంట్ కమిషన్ అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో మహిళలకు అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలు.. అవసరమైన అర్హతలు.. ఎంపిక విధానాల గురించి తెలుసుకుందాం..

ఇంతటి కఠినమైన కెరీర్ వైపు..
త్రివిధ దళాలు..నిత్యం సరిహద్దుల్లో పహారా.. దేశ రక్షణలో భాగంగా అనుక్షణం అప్రమత్తతో, డేగ కళ్లతో శత్రువులపై నిఘా.. నిద్రాహారాలు మాని.. ప్రాణాలకు తెగించి.. ఉగ్రవాదులను మట్టుబెట్టడం..! ఇలా ఎంతో కఠినమైన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకే.. సాయుధ దళాల్లో పురుషులు మాత్రమే రాణించగలరనే అభిప్రాయం ఎన్నో ఏళ్లుగా స్థిరపడిపోయింది. ఆడపిల్లలను ఇంతటి కఠినమైన కెరీర్ వైపు పంపడం ఎందుకు? అనే విముఖత తల్లిదండ్రుల్లో సైతం కనిపిస్తుంటుంది. కాని ఇటీవల కాలంలో పరిస్థితి మారుతోంది. త్రివిధ దళాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యం లభిస్తోంది. తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి సైతం మారుతోంది.

షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి పర్మనెంట్ కమిషన్ వరకు..

SSC


వాస్తవానికి త్రివిధ దళాల్లో మహిళలకు అవకాశం కల్పించడం అనేది 1992లోనే ప్రారంభమైంది. ఎంపికైన మహిళలను షార్ట్ సర్వీస్ కమిషన్ (అంటే.. కొద్దికాలం పాటు పనిచేసిన తర్వాత ఉద్యోగ విరమణ చేసే విధంగా)లో నియమించేవారు. 1992లో ప్రారంభమైన ఉమెన్ షార్ట్ సర్వీస్ కమిషన్ తొలుత అయిదేళ్లకే ఉండేది. తర్వాత మరో అయిదేళ్లు పొడిగించుకునే వీలు కల్పించారు. 2006లో గరిష్టంగా 14ఏళ్లపాటు త్రివిధ దళాల్లో మహిళలు పనిచేసేలా షార్ట్ సర్వీస్ కమిషన్ నిబంధనలు మార్చారు.

ఆ తర్వాత 2008లో జడ్జ్ అడ్వొకేట్ జనరల్(జేఏజీ), ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్ విభాగాల్లో పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సుప్రీంకోర్టు.. మహిళలకు త్రివిధ దళాల్లోని అన్ని విభాగాల్లో పర్మనెంట్ కమిషన్‌కు అవకాశం కల్పించాలని తీర్పు ఇచ్చింది. దీంతో సాయుధ దళాల్లో మహిళలు దీర్ఘ కాలం పని చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

డిగ్రీ, పీజీ అర్హతతో..
త్రివిధ దళాలు అనగానే ఆర్మీనే మనకు స్ఫురిస్తుంది. ఆర్మీలో మహిళలకు డిగ్రీ, పీజీ అర్హతతో పలు కెరీర్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

19ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలు..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) జాతీయ స్థాయిలో నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్‌ఈ)లో ప్రతిభ ఆధారంగా ఆర్మీలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో.. ఎస్‌ఎస్‌సీడబ్ల్యులో(నాన్-టెక్నికల్) ప్రవేశం పొందొచ్చు. ఏటా రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్షకు అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నోటిఫికేషన్‌లో పేర్కొన్న కటాఫ్ తేదీ నాటికి 19ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి తర్వాత దశలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఖరారు చేస్తారు.

నేరుగా..ఆర్మీ..  :

Army


యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్‌ఈ పరీక్షతోనే కాకుండా.. ఆర్మీ విభాగం నేరుగా కూడా మహిళల కోసం నియామక ప్రక్రియ నిర్వహిస్తోంది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్, జడ్జ్ అడ్వొకేట్ జనరల్ అనే రెండు విభాగాల్లో.. షార్ట్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో నియామకాలు చేపడుతోంది.

50 శాతం మార్కులతో..:
డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఎన్‌సీసీ సీనియర్ డివిజన్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. అలాగే ఎన్‌సీసీ-సీ సర్టిఫికెట్ ఎగ్జామ్‌లో బి గ్రేడ్‌తో ఉత్తీర్ణత పొందాలి. ఏటా రెండుసార్లు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇందులో ఎంపికైన వారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ విజయం సాధిస్తే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)-చెన్నైలో 49 వారాలపాటు శిక్షణనిచ్చి ఆర్మీలో ఉద్యోగం ఇస్తారు.

ఎస్‌ఎస్‌సీ డబ్ల్యు(జేఏజీ) :
ఆర్మీలో నాన్-టెక్నికల్ విభాగంలో కీలకమైనదిగా ఎస్‌ఎస్‌సీడబ్ల్యు(జేఏజీ)ని పేర్కొనొచ్చు. కారణం.. ఇది ఆర్మీలో అంతర్గతంగా ఉండే న్యాయ విభాగానికి సంబంధించిన సర్వీస్. అందుకే దీన్ని జడ్జ్ అడ్వొకేట్ జనరల్‌గా పిలుస్తారు. ఏటా రెండుసార్లు(జూలై/ఆగస్ట్; జనవరి/ఫిబ్రవరి) నోటిఫికేషన్ వెలువడుతుంది.
అర్హత: 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదుకు అర్హత పొంది ఉండాలి.
వయో పరిమితి: 21ఏళ్ల నుంచి 27ఏళ్లు.

గ్రాడ్యుయేట్ టెక్నికల్ ఎంట్రీస్-ఎస్‌ఎస్‌సీ (టెక్నికల్) ఉమెన్ :
ఆర్మీలోని టెక్నికల్ విభాగంలో సైతం మహిళలకు అవకాశం కల్పించే విధానం.. షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్నికల్) ఉమెన్ ఎంట్రీ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఏటా రెండుసార్లు 20 మంది చొప్పున మొత్తం 40 మంది మహిళలను టెక్నికల్ విభాగాలకు ఎంపిక చేస్తారు. ఇందుకోసం ఏటా జూన్/జూలై; డిసెంబర్/జనవరి నెలల్లో నోటిఫికేషన్ విడుదలవుతుంది.
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్.
వయో పరిమితి: 20ఏళ్ల నుంచి 27 ఏళ్లు.

అందరికీ ఓటీఏ-చెన్నైలో శిక్షణ :
ఆర్మీలో ఈ విభాగాల్లో ఎంపికైన మహిళా అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల పాటు శిక్షణనిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి కమిషన్డ్ ర్యాంకుతో ఆఫీసర్ హోదాలో విధులు కేటాయిస్తారు. డెరైక్ట్ ఎంట్రీ స్కీమ్ విధానాల్లో ఫిజికల్ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు ఉంటాయి.

మిలటరీ నర్సింగ్ సర్వీస్ :
ఆర్మీలో మహిళా అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో మార్గం.. మిలటరీ నర్సింగ్ సర్వీస్. బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల నియామకం ఖరారు చేస్తారు.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in

ఎయిర్‌ఫోర్స్‌లో పెలైట్‌గా:

Air


గగనతల గస్తీ విభాగంగా పేరొందిన ఎయిర్‌ఫోర్స్‌లోనూ ఇప్పుడు మహిళలకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఎయిర్‌ఫోర్స్‌లో ఖాళీల భర్తీకి ఏఎఫ్‌క్యాట్(ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్)ను నిర్వహిస్తారు. దీనిద్వారా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ(నాన్-టెక్నికల్) విభాగాల్లో ఖాళీలు భర్తీ చేస్తారు. ఎయిర్ ఫోర్స్‌లో మహిళలకు అందుబాటులో ఉన్న మరిన్ని అవకాశాలు..

ఫ్లయింగ్ బ్రాంచ్ :
షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో మహిళలకు అవకాశం లభిస్తోంది. రాత పరీక్ష, తదుపరి దశలో ఇంటర్వ్యూలో విజయం సాధిస్తే పైలట్‌గా ఎంపిక చేస్తారు. ఇటీవల కాలంలో ఫైటర్ ఫ్లయిట్స్ నడిపే అవకాశం సైతం మహిళలకు లభిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణనిస్తారు.
అర్హత: డిగ్రీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్ చదివుండాలి.
వయో పరిమితి: 20 నుంచి 24 ఏళ్లు.

గ్రౌండ్ డ్యూటీ-టెక్నికల్ :
ఈ విధానంలో మహిళా అభ్యర్థులను షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఏరోనాటికల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మహిళలకు అవకాశం కల్పిస్తారు.
అర్హత: బీటెక్/బీఈలో సంబంధిత బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. దీంతోపాటు ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌తో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
వయో పరిమితి: 20ఏళ్ల నుంచి 26 ఏళ్లు.

గ్రౌండ్ డ్యూటీ(నాన్-టెక్నికల్) :
ఈ విధానంలో అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లాజిస్టిక్స్ విభాగాల్లో మహిళలను ఎంపిక చేస్తారు.
అర్హత: 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. అకౌంట్స్ విభాగానికి మాత్రం బీకాం ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు.
వయో పరిమితి: 20 ఏళ్ల నుంచి 26 ఏళ్లు.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్(ఫ్లయింగ్ బ్రాంచ్) :
వైమానిక దళంలో ఫ్లయింగ్ విభాగంలో మహిళలు కొలువులు అందుకునేందుకు మార్గం.. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ(ఫ్లయింగ్). ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్‌లో ‘సి’ సర్టిఫికెట్ ఉండి.. డిగ్రీలో 60శాతం మార్కులతోపాటు ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్‌లో 60శాతం మార్కులు సాధించాలి.
వయో పరిమితి: 20 ఏళ్ల నుంచి 24 ఏళ్లు.
వీటితోపాటు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో.. మెటీరియాలజీ; ఎడ్యుకేషన్ విభాగాల్లోనూ మహిళలకు షార్ట్ సర్వీస్ కమిషన్ హోదాలో అవకాశాలు లభిస్తాయి.

గెజిటెడ్ ర్యాంకు :

Rank


ఎయిర్‌ఫోర్స్‌లో ఏఎఫ్‌క్యాట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్-ఎ గెజిటెడ్ హోదాతో కొలువు లభిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్‌తో కెరీర్ ప్రారంభించిన వారికి సదరు వ్యవధి పూర్తి చేశాక.. పర్మనెంట్ కమిషన్‌కు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఏఎఫ్‌క్యాట్ ద్వారా ఆయా పోస్ట్‌లను భర్తీ చేసే క్రమంలో రెండంచెల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తొలుత 300 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న మూడు(డెహ్రాడూన్, వారణాసి, గాంధీనగర్) ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డ్స్‌లో తదుపరి దశలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ప్రక్రియ జరుగుతుంది. ఫ్లయింగ్ బ్రాంచ్ విజేతలకు మలి దశలో కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్(సీపీఎస్‌ఎస్) టెస్టు నిర్వహిస్తారు. వీటిలోనూ విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా.. మెడికల్ టెస్టు ఉంటుంది. ఆ తర్వాత రాత పరీక్ష, మెడికల్ టెస్టులో మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందించి కొలువులు ఖరారు చేస్తారు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు ఏఎఫ్‌క్యాట్‌తోపాటు మలి దశలో ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ కూడా ఉంటుంది.
వెబ్‌సైట్: https:afcat.cdac.in  

నావికా దళంలో.. నారీ భేరీ:

navy


పస్తుతం మహిళలకు భారత నావికా దళం(ఇండియన్ నేవీ) పలు అవకాశాలు కల్పిస్తోంది. ఏటీసీ, అబ్జర్వర్, లా, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, నేవల్ ఆర్కిటెక్చర్, పైలట్(మారిటైమ్ రికన్నెసెన్స్ స్ట్రీమ్), నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ విభాగాల్లో మహిళలకు షార్ట్ సర్వీస్ కమిషన్ ర్యాంకుతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

విభాగాలు.. అర్హతలు :
ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్):
అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
వయో పరిమితి: 19బీ నుంచి 25 ఏళ్లు.

అబ్జర్వర్:
అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
వయో పరిమితి: 19 నుంచి 24 ఏళ్లు.

లా: ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పేరు నమోదుకు అర్హత.
వయో పరిమితి: 22 నుంచి 27 ఏళ్లు.

లాజిస్టిక్స్:
అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత లేదా ప్రథమ శ్రేణిలో ఎంబీఏ ఉత్తీర్ణత లేదా బీఎస్సీ/బీకాం/బీఎస్సీ(ఐటీ)లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతోపాటు ఫైనాన్స్/ లాజిస్టిక్స్/సప్లయి చైన్ మేనేజ్‌మెంట్/మెటీరియల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఏదో ఒక కోర్సులో ప్రథమ శ్రేణిలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. లేదా ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
వయో పరిమితి: 19½ నుంచి 25 ఏళ్లు

ఎడ్యుకేషన్: సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత. అదే విధంగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో అదే సబ్జెక్ట్ గ్రూప్‌తో ఉత్తీర్ణత. అదే విధంగా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా సీఎస్‌ఐటీ బ్రాంచ్‌తో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
 

నేవల్ ఆర్కిటెక్చర్:
అర్హత: మెకానికల్/సివిల్/ఏరోనాటికల్/మెటలర్జీ/నేవల్ ఆర్కిటెక్చర్ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణత.
వయో పరిమితి: 19 1/2 నుంచి 25 ఏళ్లు.

పైలట్(మారిటైమ్ రికన్నెసెన్స్ స్ట్రీమ్): బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
వయో పరిమితి: 19 నుంచి 24 ఏళ్లు.
నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్(ఎన్‌ఏఐ):
అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ప్రొడక్షన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఐటీ, కెమికల్, మెటలర్జీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తదితర బ్రాంచ్‌లతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణత.

పైలట్ జనరల్:
అర్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. అదే విధంగా ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.
వయో పరిమితి: 19 నుంచి 24 ఏళ్లు(కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉంటే 19 నుంచి 25 ఏళ్లు)

ఐఎన్‌ఈటీ ద్వారా ఎంపిక :
నేవీలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా ఎంపిక చేసే ఈ కొలువుల భర్తీకి ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 100 మార్కులకు జరిగే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే తొలుత షార్ట్ సర్వీస్ కమిషన్ పద్ధతిలో కొలువు ఖాయం అవుతుంది. ఆ తర్వాత ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణనిస్తారు. తర్వాత విధులు కేటాయిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/en/page/women-in-the-navy.html

ముఖ్యాంశాలు :
➤ 1992లో మొట్టమొదటిసారిగా మహిళా ఉద్యోగుల నియామకం.
➤ ప్రారంభంలో అయిదేళ్ల కాలానికే షార్ట్ సర్వీస్ కమిషన్
➤ 2006లో గరిష్టంగా 14 ఏళ్లపాటు పనిచేసేలా నిబంధనలు.
➤ 2008లో జడ్జ్ అడ్వొకేట్ జనరల్(జేఏజీ), ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్ విభాగాల్లో పర్మనెంట్ కమిషన్.
➤ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం-అన్ని విభాగాలకు పర్మనెంట్ కమిషన్ లభించే వీలు.
➤2015 నుంచి ఎయిర్‌ఫోర్స్ విభాగంలో ఫైటర్ పైలట్స్‌గానూ అవకాశం.
➤ తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా భావనా కాంత్.
➤ ఆర్మీలో ఇప్పటి వరకూ 1300 మంది మహిళలకు ఆఫీసర్ హోదా
➤ నేవీలో 600 వరకు మహిళా ఆఫీసర్లు
➤ ఎయిర్‌ఫోర్స్‌లో 1700 వరకు మహిళా ఆఫీసర్లు
➤ మొత్తం ఆఫీసర్స్‌లో పది శాతం మంది మహిళా ఆఫీసర్లు

Published date : 17 Mar 2022 07:06PM

Photo Stories