Skip to main content

సివిల్స్ పరీక్షలో మార్పులు ఖాయమేనా..!

జాతీయస్థాయిలో.. అత్యున్నత సర్వీసులుగా భావించే.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్.. తదితర 24 సర్వీసులకు ఎంపిక ప్రక్రియ సివిల్ సర్వీసెస్ పరీక్షలో మార్పులకు యూపీఎస్సీ శ్రీకారం చుట్టిందా..! తొలిదశ సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో..
కీలక మార్పులు జరగనున్నాయా?! అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది!! ఇటీవల యూపీఎస్సీ విజన్ డాక్యుమెంట్‌లో చేసినట్టు చెబుతున్న ప్రతిపాదనల ప్రకారం సీశాట్ పేపర్ నుంచి అభ్యర్థులకు ఉపశమనం లభించనుంది. అదే సమయంలో దరఖాస్తు చేసినా అటెంప్ట్‌గానే పరిగణించాలనే సిఫార్సుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ పరీక్ష నిర్వహణ సంస్థ యూపీఎస్సీ తాజాగా ‘విజన్ డాక్యుమెంట్’ పేరుతో ప్రభుత్వానికి చేసిన ముఖ్య సిఫార్సులపై నిపుణుల విశ్లేషణ...
 
 జాతీయస్థాయిలో ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు పోటీపడే అభ్యర్థుల సంఖ్య దాదాపు అయిదు నుంచి ఆరు లక్షల వరకూ ఉంటుంది. ప్రభుత్వ రంగంలో క్రేజీ కెరీర్‌ను అందించే సివిల్స్ పరీక్షలో విజయం సాధించేందుకు లక్షల మంది ప్రతిభావంతులు ఏళ్ల తరబడి కృషిచేస్తుంటారు. ఇలాంటి ప్రతిష్టాత్మక పరీక్షలో మార్పులు తేవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ద డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ)కి అందజేసిన ఈ డాక్యుమెంట్ అధికారికంగా బహిర్గతం కాకపోయినా.. కీలక సిఫార్సుల గురించి సమాచారం బయటికి వచ్చింది. ఈ సిఫార్సులు సివిల్స్ అభ్యర్థుల్లో ఒకవైపు మోదం, మరోవైపు ఖేదం కలిగించేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 జీఎస్ పేపర్-2 (సీ-శాట్) తొలగింపు!
 యూపీఎస్సీ విజన్ డాక్యుమెంట్‌లో కీలక సిఫార్సు.. రెండు పేపర్లుగా నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్-2ను తొలగించాలనేది! ఈ పేపర్‌నే అభ్యర్థులు సీ-శాట్(సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్)గా పిలుస్తున్నారు. వాస్తవానికి 2011లో ఈ పేపర్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచీ దీనిపై అభ్యర్థుల్లో వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. సీ-శాట్ సిలబస్‌లో పేర్కొన్న అంశాలే ఇందుకు కారణమని చెప్పొచ్చు. సీ-శాట్ పేపర్ సిలబస్‌లో కాంప్రెహెన్షన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్‌క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ అంశాలను పేర్కొన్నారు. ఇవి ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు అనుకూలమనే భావన నెలకొంది. సీశాట్ కారణంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, సంప్రదాయ డిగ్రీ కోర్సుల విద్యార్థులు సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించడం కష్టంగా మారిందంటూ.. అప్పట్లో జాతీయస్థాయిలో నిరసన సైతం వ్యక్తమైంది. దాంతో సీ-శాట్(జీఎస్ పేపర్-2) అర్హత పరీక్ష మాత్రమేనంటూనే.. ఇందులో కనీసం 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుందని యూపీఎస్సీ పేర్కొంది. దీనిపైనా అభ్యర్థులు అసంతృప్తితోనే ఉన్నారు. సీ-శాట్‌పై వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకున్న యూపీఎస్సీ.. ఈ పేపర్‌ను తొలగించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
 
 మరి రెండో పేపర్?!
 రెండు పేపర్లుగా 400 మార్కులకు నిర్వహించే ప్రిలిమ్స్‌లో.. సీ-శాట్ పేపర్‌ను తొలగిస్తే.. కొత్తగా రెండో పేపర్ ఏంటనే సందేహం అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న జనరల్ స్టడీస్ సిలబస్‌నే రెండు పేపర్లుగా నిర్వహించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర అంశాలు ఉండే జనరల్ స్టడీస్ పేపర్‌నే రెండుగా విభజించే వీలుంది. వీటికి ప్రస్తుతం సీ-శాట్ సిలబస్‌లో పేర్కొన్న జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ కూడా చేర్చి ప్రశ్నలు అడగొచ్చని అంచనా వేస్తున్నారు.
 
 దరఖాస్తు చేస్తే.. అటెంప్ట్ చేసినట్లే!
 విజన్ డాక్యుమెంట్‌లో ఒకవైపు అభ్యర్థులకు ఉపశమనం కలిగించేలా సీశాట్ పేపర్‌ను తొలగించాలని ప్రతిపాదించిన యూపీఎస్సీ.. మరోవైపు అభ్యర్థులకు పిడుగులాంటి ప్రతిపాదన చేసింది. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసినా.. అటెంప్ట్ చేసినట్లుగానే పరిగణించాలని కీలక సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల్లో హాజరు 50 శాతానికి మించకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి దరఖాస్తుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని యూపీఎస్సీ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. కానీ, సగానికి సగం మంది గైర్హాజరు అవుతుండటంతో అనేక వ్యయ ప్రయాసలు ఎదురవుతున్నాయని భావిస్తోంది. అందుకే దరఖాస్తు చేసినా.. అటెంప్ట్‌గానే పరిగణిస్తే.. సీరియస్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేస్తారనే అభిప్రాయంతో యూపీఎస్‌సీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఆరుసార్లు మాత్రమే అటెంప్ట్ చేసే అవకాశముంది. ప్రస్తుత విధానంలో.. దరఖాస్తు చేసి.. ప్రిపరేషన్ పూర్తికాలేదనుకుంటే.. పరీక్షకు హాజరు కాకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. తాజా ప్రతిపాదనతో దరఖాస్తు చేశాక హాజరు కాకపోతే.. ఎంతో విలువైన ఒక అటెంప్ట్ కోల్పోయినట్లే!
 
 బస్వాన్ కమిటీ సిఫార్సులే ఆధారమా?
 యూపీఎస్సీ విజన్ డాక్యుమెంట్‌లో ప్రతిపాదించినట్లు చెబుతున్న రెండు కీలక మార్పులకు 2015లో హెచ్‌ఆర్‌డీ మాజీ కార్యదర్శి బి.ఎస్.బస్వాన్ కమిటీ చేసిన సిఫార్సులే ఆధారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2016లో అందజేసిన నివేదికలో ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. అందులో అటెంప్ట్‌ల సంఖ్యను ఆరు నుంచి నాలుగుకు తగ్గించాలని సూచించింది. అదే విధంగా గరిష్ట వయో పరిమితిని 27 ఏళ్లకు తగ్గించాలని సలహా ఇచ్చింది. ఒకేసారి అటెంప్ట్‌ల సంఖ్యను తగ్గిస్తే.. అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మధ్యే మార్గంగా.. దరఖాస్తు చేసినా అటెంప్ట్‌గానే పరిగణించాలనే ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు.
 
 మెయిన్‌లోనూ మార్పులు ఉంటాయా..?
 యూపీఎస్సీ విజన్ డాక్యుమెంట్ తాజా ప్రతిపాదనలను చూస్తే.. మెయిన్‌లోనూ మార్పులు ఉంటాయా? అనే సందేహం అభ్యర్థుల్లో తలెత్తుతోంది. బస్వాన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి ఉంటే.. మెయిన్‌లోనూ మార్పులు జరగడానికే ఎక్కువ అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. సివిల్స్ మెయిన్ పరీక్షలకు సంబంధించి ఆప్షనల్ పేపర్‌ను తొలగించాలనేది బస్వాన్ కమిటీ కీలక సిఫార్సు. కొన్ని ఆప్షనల్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్న అభ్యర్థుల విజయ శాతం ఎక్కువగా ఉంటోందనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కమిటీ ఈ సిఫార్సు చేసింది. విజన్ డాక్యుమెంట్‌లోనూ ఇలాంటి ప్రతిపాదన చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 సివిల్స్-2020 నుంచే అమలు!
 యూపీఎస్సీ విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్న ప్రతిపాదనలను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2020 నుంచే అమలు చేస్తారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. యూపీఎస్సీ ఏవైనా మార్పులు చేసేటప్పుడు కనీసం ఏడాది ముందుగా ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తుంది. కానీ.. 2011లో సీ-శాట్‌ను ప్రవేశపెట్టిన విషయం నోటిఫికేషన్ సమయంలోనే అభ్యర్థులకు తెలిసింది. కాబట్టి సివిల్స్-2020 నుంచే మార్పులు అమల్లోకి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదనే వాదన సైతం వినిపిస్తోంది. వాస్తవానికి ఏటా ఫిబ్రవరిలో సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ప్రిలిమ్స్ పరీక్షను జూన్‌లో, మెయిన్‌ను అక్టోబర్/నవంబర్‌ల్లో నిర్వహిస్తుంది. సివిల్స్-2020 నోటిఫికేషన్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఈలోపే విజన్ డాక్యుమెంట్‌కు ఆమోదం లభించి.. నోటిఫికేషన్‌కు రెండు, మూడు నెలల ముందుగా కొత్త మార్పుల గురించి ప్రకటించే ఆస్కారముందని నిపుణులు అంటున్నారు.
 
 మార్పులకు సిద్ధంగా..
 సివిల్స్ పరీక్షలో కొత్త మార్పులకు అభ్యర్థులు సిద్ధంగా ఉండటం మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీ-శాట్ తొలగింపు అభ్యర్థులకు అనుకూలమే. కానీ, దాని స్థానంలో జనరల్ స్టడీస్‌ను విస్తృతం చేసేలా కొత్త పేపర్‌ను ప్రవేశపెడితే ఆమేరకు జీఎస్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టిన అభ్యర్థులు సీ-శాట్‌తోపాటు జీఎస్‌కు మరింత ఎక్కువ సమయం కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 సీ-శాట్‌తో ఉపయోగం లేదు :
 ప్రస్తుతం నిర్వహిస్తున్న సీ-శాట్ పేపర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదనే చెప్పొచ్చు. ఈ పేపర్‌ను ప్రవేశపెట్టిన ఉద్దేశానికి అనుగుణంగా సిలబస్ లేదు. సివిల్ సర్వీసెస్ వంటి పరీక్షలకు నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో పరిపాలన దక్షతకు సంబంధించిన ప్రశ్నలు ఉండాలి. కానీ.. ప్రస్తుతం సీ-శాట్ గణిత నేపథ్యం ఉన్నవారికి అనుకూలంగా మారింది. సీ-శాట్‌ను తొలగించాలనే సిఫార్సు నిజమైతే ఆహ్వానించదగ్గ పరిణామమే.
 - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్,ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.
 
 గ్రామీణ అభ్యర్థులకు ప్రయోజనం..
 సీశాట్ పేపర్ తొలగింపు కచ్చితంగా గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనమే. దీనికి వెచ్చించే సమయాన్ని జనరల్ స్టడీస్‌కు కేటాయిస్తే విజయావకాశాలు మరింత మెరుగవుతాయి. ఇక తాజాగా పేర్కొన్న సిఫార్సును చూస్తే.. ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్‌నే రెండు పేపర్లుగానూ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తోంది.
 - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ.
 
 2020కి ప్రస్తుత విధానంలోనే..
 విజన్ డాక్యుమెంట్‌లో ప్రతిపాదనలను ఆమోదించి దాని ప్రకారం సివిల్స్-2020ని నిర్వహిస్తారని నేను భావించట్లేదు. కారణం.. ఏవైనా మార్పులు చేసేటప్పుడు యూపీఎస్సీ కనీసం ఏడాది ముందుగానే ప్రకటిస్తుంది. ఈసారి కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. దరఖాస్తు చేసినా.. అటెంప్ట్‌గానే పరిగణించాలనే సిఫార్సు ఆమోదయోగ్యం కాదు.
     - శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్.
Published date : 24 Jul 2019 12:05PM

Photo Stories