సివిల్స్ ఇంటర్వూలో విజయం వైపు సాగండిలా.. ప్రభుత్వ కొలువు కొట్టండలా..
మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షల్లో ప్రతిభ చూపితే.. చివరగా నిర్ణయాత్మక దశ.. ఇంటర్వూ (పర్సనాలిటీ టెస్ట్) ఉంటుంది! ఇందులోనూ విజయం సాధిస్తే.. కలల కొలువు సొంతమవుతుంది. కరోనా కారణంగా వాయిదా పడిన సివిల్స్–2020 ఇంటర్వూలకు సంబంధించి తాజా షెడ్యూల్‌ను యూపీఎస్‌సీ విడుదల చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం–ఆగస్ట్ 2వ తేదీ నుంచి ఇంటర్వూలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. సివిల్స్ ఇంటర్వూ్యలో విజయం సాధించేందుకు నిపుణుల సలహాలు...
సివిల్స్ మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి.. ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. సివిల్స్–2020 నోటిఫికేషన్‌కు సంబంధించి మొత్తం 796 పోస్ట్‌లకు, 2,046 మందిని పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేశారు. అభ్యర్థులకు సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను, సమయస్ఫూర్తి ని, పాలన దక్షతను పరిశీలించే ప్రక్రియగా ఇంటర్వూలను పేర్కొనొచ్చు. కాబట్టి అభ్యర్థులు సివిల్స్ ఇంటర్వూలు క్లిష్టం అనే భావన వీడి.. సామాజిక దృక్పథంతో, సమకాలీన అవగాహనతో, స్పష్టమైన అభిప్రాయాలతో హాజరైతే విజయం సాధించడం సులభమే అంటున్నారు నిపుణులు.
ఇంటర్వూకు 275 మార్కులు..
మొత్తం 2025 మార్కులకు నిర్వహించే సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. ఇంటర్వూకు కేటాయించిన మార్కులు 275. మొత్తం మార్కులను చూస్తే ఇంటర్వూ మార్కులు తక్కువే అనే భావన కలగడం సహజం. కానీ.. ఈ 275 మార్కులే తుది ఎంపికలో కీలకంగా నిలుస్తున్నాయి.
మీ గురించి.. మెప్పించేలా..
సివిల్స్ ఇంటర్వూకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు మెయిన్ పరీక్ష సమయంలో పూర్తి చేసిన డిటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్‌లో పొందుపర్చిన సర్వీసు ప్రాధాన్యత, హాబీలు, వ్యక్తిగత నేపథ్యం, పుట్టిన ప్రదేశం వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇంటర్వూలో ‘మీ గురించి చెప్పండి?’ అనే ప్రశ్న ఎదురైతే.. వీలైనంత వరకు అభ్యర్థి తన అకడమిక్ వివరాలు, ఉద్యోగం చేస్తుంటే.. ప్రొఫెషన్, సాధించిన ఘనతల గురించి చెప్పడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ బోర్డ్ సభ్యులు వ్యక్తిగత నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే.. అప్పుడు మాత్రమే వాటిని ప్రస్తావించొచ్చు.
సోషల్ సర్వీస్ లక్ష్యంగా..
సివిల్స్ ఇంటర్వూలో అభ్యర్థులకు ఎదురయ్యే మరో ప్రశ్న.. సివిల్ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి అని?! దీనికి ఎక్కువ మంది అభ్యర్థులు సామాజిక సేవ తమ లక్ష్యమని ఠక్కున సమాధానం చెబుతుంటారు. ముఖ్యంగా టెక్నికల్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్స్ ‘సోషల్ సర్వీస్ లక్ష్యంగా సివిల్స్’ అనే సమాధానం చెప్పేటప్పుడు.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.బోర్డు సభ్యులను ఒప్పించేలా జవాబు చెప్పగలగాలి. తాము ప్రస్తుత చేస్తున్న ఉద్యోగం ద్వారా సమాజానికి ఉపయోగపడుతున్న తీరును వివరించాలి. ఉదాహరణకు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయితే.. నేటి డిజిటల్ యుగంలో సాఫ్ట్‌వేర్ సేవల ద్వారా సమాజానికి కలుగుతున్న ప్రయోజనం చెప్పగలగాలి.
ఇంకా చదవండి: part 2: సివిల్స్ సర్వీసెస్ ఇంటర్వూల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలివే..