సైన్స్ కోర్సులు c/o మేటి ఇన్‌స్టిట్యూట్స్
జాతీయంగా, అంతర్జాతీయంగా సైన్స్ పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని టాప్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో చదివితే.. ఉజ్వల కెరీర్‌కు ఎర్రతివాచీ పరిచినట్లే! ఈ నేపథ్యంలో దేశంలోని టాప్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లు, అవి అందిస్తున్న కోర్సులు, ప్రవేశ ప్రక్రియలపై ప్రత్యేక కథనం...
ఐఐఎస్సీ
సైన్స్ విద్య, పరిశోధనలకు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) తలమానికంగా నిలుస్తోంది. ఓ వైపు సైన్స్‌లో వినూత్న కోర్సులు అందిస్తూనే.. మరోవైపు పరిశోధనల్లోనూ దూసుకెళ్తోంది. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ముందు వరుసలో నిలుస్తోంది.
అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్.
చిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్): ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులు ఇందులో చేరేందుకు అర్హులు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు అదనంగా బయాలజీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌లను చదవిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్షలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కోర్సుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్య జరుగుతుంది.
పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు:
పీజీ స్థాయిలో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్), మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఎంటెక్ (స్పాన్సర్డ్).. కోర్సులు అందిస్తోంది. –బీటెక్/బీఈ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోరు కలిగిన అభ్యర్థులు ఎంటెక్‌లో ప్రవేశాలకు అర్హులు. బీఈ/బీటెక్/ బీడీఈఎస్/బీఆర్క్ ఉత్తీర్ణత, వ్యాలిడ్ గేట్, సీడ్ స్కోరు కలిగిన అభ్యర్థులు మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ రీసెర్చ్ ప్రోగ్రామ్స్:
ఐఐఎస్సీ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో సైతం ప్రవేశం కల్పిస్తోంది. ఇందులో చేరేందుకు జామ్ స్కోర్ తప్పనిసరి. జామ్‌లో మ్యాథ్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ పేపర్‌లో క్వాలిఫై అయిన బీఈ/బీటెక్ అభ్యర్థులు మ్యాథమెటికల్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
జామ్‌లో బయోటెక్నాలజీ పేపర్‌లో క్వాలిఫై అయిన బీఈ/బీటెక్ అభ్యర్థులు బయోలాజికల్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
జెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంటెక్(రీసెర్చ్)/పీహెచ్‌డీ, –ఎక్స్‌టర్నల్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్(ఈఆర్‌పీ) సైతం అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.iisc.ac.in
నైపర్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్).. ఫార్మా విద్య, పరిశోధనలకు ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు నైపర్‌లు ఉన్నాయి. ఇవి పలు స్పెషలైజేషన్స్‌తో పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. నైపర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు.
అర్హతలు:
60 శాతం మార్కులతో బీఫార్మసీతోపాటు వ్యాలిడ్ జీప్యాట్ స్కోరు లేదా 6.75 సీజీపీఏ(10పాయింట్ల స్కేల్‌లో) ఉండాలి. ఫైనలియర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు నైపర్ మాస్టర్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక:
నైపర్ జేఈఈ మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి ఎంఎస్(ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్(ఫార్మా) కోర్సుల్లో ప్రవేశాలను ఖరారు చేస్తారు. ఎంబీఏ ఫార్మా(హైదరాబాద్, ఎస్.ఎ.ఎస్.నగర్) సీట్లను ఎంట్రన్స్ టెస్టు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలలో పొందిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. ఎంట్రన్స్ టెస్టుకు 85శాతం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
పరీక్ష విధానం:
మాస్టర్స్, ఎంబీఏ(ఫార్మా) కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నలు.. బీఫార్మసీ, ఎంఎస్సీ స్థాయిలో ఉంటాయి.
పీహెచ్‌డీ
సీఎస్‌ఐఆర్/యూజీసీ/ఐసీఎంఆర్/డీబీటీ/ డీఎస్‌టీ నెట్–జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం:
ప్రవేశ పరీక్షను 85 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 170 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌లో కెమికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విభాగాలు ఉంటాయి. ప్రశ్నలను ఎంఎస్(ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్(ఫార్మా), ఎంవీఎస్‌సీ, ఎండీ, ఎంఎస్సీ సిలబస్ నుంచి అడుగుతారు. వీటితోపాటు ప్రతి విభాగంలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జనరల్ ఆప్టిట్యూడ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
వెబ్‌సైట్: www.niperhyd.ac.in
ఐసీటీ
కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, అప్లయిడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ అండ్ బయోప్రాసెసింగ్ విభాగాల్లో ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐసీటీ) అత్యుత్తమంగా నిలుస్తోంది. కెమికల్ ఇంజనీరింగ్‌తోపాటు ఏడు స్పెషలైజేషన్స్‌లో బీటెక్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. వీటిలో 70 శాతం సీట్లను మహారాష్ట్ర విద్యార్థులకు, 30 శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు.
కోర్సులు ఇవే:
మాస్టర్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్,–మాస్టర్ ఆఫ్ ఫార్మసీ(ఎంఫార్మసీ) ∙మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్) ∙ఎంఈ(ప్లాస్టిక్ ఇంజనీరింగ్) ∙ఎంఎస్సీ(కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, టెక్స్‌టైల్ కెమిస్ట్రీ), –పీహెచ్‌డీ, ∙పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కెమికల్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్.
ప్రవేశాలు:
బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో సీట్లను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టు ద్వారా భర్తీ చేస్తారు. గేట్/జీప్యాట్ స్కోరు ఆధారంగా మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.ictmumbai.edu.in
ఐసర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్‌లు) సైన్సు విద్య, పరిశోధనల్లో జాతీయ ప్రాధాన్య సంస్థలుగా వెలుగొందుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు ఐసర్‌లు ఉన్నాయి. వీటిలో ప్రవేశం పొందితే సైన్సు పరిశోధన, బోధన–ఇతర అనుబంధ రంగాల్లో చక్కటి కెరీర్ సొంతమవడం ఖాయం.
కోర్సులు:
బీఎస్–ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ): ఈ కోర్సును సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఏడు క్యాంపస్‌లలో 1400కుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. బయలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు వ్యవధి ఐదేళ్లు. సైన్సు గ్రూపుతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన వారు ప్రవేశాలకు అర్హులు.
బీఎస్ డిగ్రీ: ఐసర్ బోపాల్.. ఎకనామిక్స్ అండ్ ఇంజనీరింగ్ సైన్సెస్‌లో నాలుగేళ్ల బీఎస్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇందులో ప్రవేశానికి ఇంటర్ లేదా తత్సమాన స్థాయిల్లో మ్యాథ్స్‌ను తప్పనిసరిగా చదివుండాలి. ఇంజనీరింగ్ విభాగంలో 60 సీట్లు, ఎకనామిక్స్ విభాగంలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రవేశాలు :
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్టు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వీటితోపాటు కేవీపీవై, జేఈఈ–అడ్వాన్స్‌డ్ విధానాల్లోనూ ప్రవేశాలు పొందవచ్చు.
పరీక్ష విధానం:
పరీక్ష 60 ప్రశ్నలతో మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుంచి 15 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.
సిలబస్:
ఐసర్ ఆప్టిట్యూడ్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎన్‌సీఈఆర్‌టీ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర పుస్తకాలను చదవాలి.
ముఖ్యతేదీలు:
దరఖాస్తుకు చివరితేదీ: 30 ఏప్రిల్ 2020
హాల్‌టిక్కెట్లు జారీ: 18 మే 2020
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్: 31 మే 2020
వెబ్‌సైట్: http://www.iiseradmission.in
సీసీఎంబీ
ఆధునిక జీవశాస్త్ర పరిశోధనలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) ప్రముఖంగా నిలుస్తోంది. సీసీఎంబీ... సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనిటిక్స్, డెవలప్‌మెంటల్ బయాలజీ, ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీ, కన్జర్వేషన్ బయాలజీ, ఎకాలజీ, ప్రొటీన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, బయాలజీ ఆఫ్ మైక్రోమాలిక్యూల్స్, బయాలజీ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎపిజెనిటిక్స్, క్రొమాటిన్ బయాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్ స్పెషలైజేషన్స్‌లో పీహెచ్‌డీని అందిస్తోంది. ఏటా అక్టోబర్‌లో అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 సెంటర్లలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.ccmb.res.in
జేఎన్‌సీఏఎస్‌ఆర్
సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లలో ప్రపంచస్థాయి పరిశోధన, శిక్షణలను అందించేందుకు 1989లో జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(జేఎన్‌సీఏఎస్‌ఆర్)ను స్థాపించారు. ప్రస్తుతం దాదాపు 300 మంది జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పీహెచ్‌డీ చేస్తున్నవారే కావడం గమనార్హం. పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ, ఎంఎస్ ఇంజనీరింగ్/ఎంఎస్ రీసెర్చ్ కోర్సుల్లో ప్రవేశాలకు గేట్/జెస్ట్/జీప్యాట్/యూజీసీ /సీఎస్‌ఐఆర్–నెట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో క్వాలిఫై అయ్యిండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వేసవి ప్రారంభంలో ఇంటర్వ్యూలు నిర్వహించి.. తుది ఎంపిక చేపడతారు. కొన్ని కోర్సుల్లో జనవరిలోనూ ప్రవేశాలు చేపడతారు. జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పైకోర్సులతోపాటు కెమిస్ట్రీలో మాస్టర్స్ పోగ్రామ్‌ను సైతం ఆఫర్‌చేస్తోంది. కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు, వ్యాలిడ్ జామ్ స్కోర్ కలిగిన అభ్యర్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి కొంత మందిని ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
వెబ్‌సైట్: www.jncasr.ac.in
టీఐఎఫ్‌ఆర్
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్).. టాటా ట్రస్ట్ సహకారంతో 1945లో ఏర్పాటైంది. దీని ప్రధాన క్యాంపస్ ముంబైలో ఉండగా.. పుణె, బెంగళూరు, హైదరాబాద్‌లలో సెంటర్స్ ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్‌సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్‌లలో పరిశోధనలకు టీఐఎఫ్‌ఆర్ పేరుగాంచింది.
కోర్సులు:
నేచురల్ సైన్స్ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ–పీహెచ్‌డీ, ఎంఎస్సీ కోర్సులను టీఐఎఫ్‌ఆర్ అందిస్తోంది. పీహెచ్‌డీ కోర్సు వ్యవధి ఐదేళ్లు, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ–పీహెచ్‌డీ ఆరేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లుగా ఉంది. ఈ కోర్సుల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు చేసుకున్నవారిలో టాప్ ఒకటిన్నర శాతం మందికే టీఐఎఫ్‌ఆర్‌లో ప్రవేశాలు లభిస్తుంటాయి. దీన్ని బట్టి టీఐఎఫ్‌ఆర్‌కు ఉన్న క్రేజ్‌ను అర్థంచేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://www.tifr.res.in
సీఎంఐ
చెన్నై మ్యాథమెటికల్ ఇన్‌స్టిట్యూట్(సీఎంఐ) 1989లో ఏర్పాటైంది. మ్యాథ్స్ బోధన, పరిశోధనలో సీఎంఐకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్‌లో సీఎంఐ పలు కోర్సులను అందిస్తోంది.
కోర్సులు:
బీఎస్సీ(హానర్స్) ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ∙బీఎస్సీ(హానర్స్) ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ∙ఎంఎస్సీ మ్యాథ్స్ ∙ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ∙ఎంఎస్సీ డేటాసైన్స్, ∙పీహెచ్‌డీ (మ్యాథమె టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్).
రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీహెచ్‌డీలో ప్రవేశాలకు జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం ఫెలోషిప్‌కు ఎంపిక తదితరాలు తప్పనిసరి. ప్రస్తుతం సీఎంఐ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
దరఖాస్తు సమాచారం:
దరఖాస్తుకు చివరి తేదీ: 11 ఏప్రిల్ 2020
హాల్ టిక్కెట్లు జారీ: 1 మే 2020
ప్రవేశ పరీక్ష తేదీ: 15 మే 2020
వెబ్‌సైట్: www.cmi.ac.in