Skip to main content

పదిలమైన కెరీర్‌కు...పారామెడికల్ కోర్సులు

వైద్యో నారాయణ హరీ అంటారు. నేటి టెక్నాలజీ యుగంలో వైద్య రంగం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఆ క్రమంలో రోగికి చికిత్సను అందించడంలో వైద్యులకు అనుబంధంగా పనిచేసే టెక్నీషియన్స్ అవసరం ఏర్పడింది.
కానీ డిమాండ్‌కు తగ్గట్లు టెక్నీషియన్స్ అందుబాటులో లేరు. ఇంటర్ బైపీసీ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తన అనుబంధ కళాశాలల్లో డిగ్రీ స్థాయిలో వివిధ పారామెడికల్ కోర్సులను నిర్వహిస్తోంది. ఈ ఏడాది నుంచి ఈ కోర్సులకు ఏపీ ఎంసెట్‌లో ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పలు పారామెడికల్ కోర్సుల గురించి తెలుసుకుందాం...

బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ :
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అలాంటి నేత్రాలకు ఏదైనా సమస్య వస్తే... చికిత్స అందించేందుకు దోహదపడేదే.. బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ. ఈ కోర్సును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్‌హెల్త్ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది. కోర్సు వ్యవధి మూడేళ్లు. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ఆప్టోమెట్రిస్ట్‌గా ఉద్యోగావకాశాలు పొందొచ్చు. అనుభవం సంపాదించుకున్న తర్వాత ఆప్టోమెట్రీ టెక్నీషియన్స్‌గా స్థిరపడొచ్చు.

బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ :
మానవ శరీరంలో రోగ నిర్ధారణలో ఇమేజింగ్ టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఎక్స్‌రే టెక్నీషియన్స్‌గా, ఎంఆర్‌ఐ, సిటీ స్కానర్స్‌గా ఆసుపత్రుల్లో ఉద్యోగాలు సంపాదించవచ్చు. సొంతంగా ల్యాబ్‌లు నడుపుకోవచ్చు. డయాగ్నస్టిక్ సెంటర్స్‌లో స్థిరపడొచ్చు. ఈ కోర్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందిస్తోంది. కోర్సు వ్యవధి మూడేళ్లు. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

బీఎస్సీ ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ :
రోగికి శస్త్ర చికిత్స సమయంలో మత్తుమందు ఎంతో అవసరం. ఇందుకు ప్రత్యేక నిపుణుల అవసరం ఉంటుంది. రోగికి ఎంత మోతాదులో మత్తు మందు ఇవ్వాలో వీరే నిర్ణయిస్తారు. ఓ సర్వే ప్రకారం ప్రతి లక్ష మందికి ఒక మత్తు మందు నిపుణుడు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. కాబట్టి ఈ నిపుణులకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు.
  • ఆపరేషన్ టెక్నాలజీ.. శస్త్ర చికిత్స సమయంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. శస్త్ర చికిత్సకు అవసరమయ్యే సరంజామాను వీరే నిర్ణయించాల్సి ఉంటుంది. రోగిని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకురావడం దగ్గర నుంచి తీసుకెళ్లే వరకూ వీరిదే కీలక పాత్ర. ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఆసుపత్రుల్లో ఓటీ టెక్నీషియన్స్‌గా, వైద్యులకు సహాయకులుగా ఉద్యోగావకాశాలు పొందొచ్చు. అనుభవం సంపాదించుకున్న తర్వాత అనస్థీషియా టెక్నీషియన్స్‌గా స్థిరపడొచ్చు. ఈ కోర్సును ఎన్టీఆర్ యూనివర్సిటీ అందిస్తోంది. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది. కోర్సు వ్యవధి మూడేళ్లు.

బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వెస్కాలర్ టెక్నాలజీ :
మానవ శరీరంలో గుండె ఎంతో ప్రధానమైంది. గుండె సంబంధిత వ్యాధులు, రక్తనాళాల పనితీరు గురించి ఈ కోర్సులో బోధిస్తారు. ఓపెన్ హార్ట్ సర్జరీ, పేస్ మేకర్, స్టంట్స్ అమరిక వంటి వాటిల్లో ఈ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఆసుపత్రుల్లో ఓటీ అసిస్టెంట్స్‌గా ఉద్యోగం సంపాదించవచ్చు. తగిన అనుభవంతో కార్డియాలజీ టెక్నీషియన్స్‌గా, క్యాత్‌లాబ్ విభాగంలో ఉద్యోగులుగా స్థిరపడే అవకాశాలు మెండు. ఈ కోర్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందిస్తోంది. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు వ్యవధి మూడేళ్లు.

బీఎస్సీ పెర్‌ఫ్యూషన్ టెక్నాలజీ :
గుండెకు సంబంధించిన వ్యాధులను అరికట్టడం, చికిత్స విధానం వంటివి ఈ కోర్సులో భాగం. గుండె, ఊపిరితిత్తుల పర్యవేక్షణ, చికిత్సలో ఈ నిపుణుల పాత్ర కీలకం. ఈ కోర్సును పూర్తిచేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సర్జన్ అసిస్టెంట్‌లు, ఓటీ టెక్నీషియన్స్‌గా స్థిరపడొచ్చు. ఈ కోర్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందిస్తోంది. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు వ్యవధి మూడేళ్లు.

బీఎస్సీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ :
రక్తాన్ని శుద్ధి చేయడం కిడ్నీల విధి. వీటి పనితీరులో ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆ వ్యక్తికి డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. మన దేశంలో చాలామంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. వీరికి అవసరమైన డయాలసిస్ చికిత్సను నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. దీంతో ఈ నిపుణులకు ఎంతో డిమాండ్. ఈ కోర్సును పూర్తిచేసిన వారు డయాలసిస్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందే వీలుంది. సొంతంగా ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కోర్సు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందిస్తోంది. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు వ్యవధి మూడేళ్లు.

బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ :
నరాలకు సంబంధించిన చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడంతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించే కోర్సు ఇది. ఈ కోర్సులో భాగంగా నరాలు, కండరాల పనితీరు గురించి బోధిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ఆసుపత్రుల్లో న్యూరోసర్జన్స్, న్యూరోఫిజీషియన్లు, న్యూరాలజిస్ట్‌లకు అసిస్టెంట్‌లుగా సేవలు అందించొచ్చు. సొంతంగా క్లినికల్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కోర్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందిస్తోంది. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సు వ్యవధి మూడేళ్లు.

బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్‌టీ) :
ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే అందుకు గల కారణాలను తెలిపేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు. వ్యాధి నిర్థారణ పరీక్షల్లో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లుగా స్థిరపడొచ్చు. ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు అపారం. ఈ కోర్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందిస్తోంది. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు వ్యవధి మూడేళ్లు.

బీఎస్సీ నర్సింగ్ :
రోగికి సేవ విషయంలో నర్సింగ్ ప్రధానమైంది. అందుకే వైద్య రంగంలో ఈ వృత్తి ద్వారా అందించే సేవను ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. నర్సింగ్ నైపుణ్యాలను ఈ కోర్సు ద్వారా అందిస్తారు. థియరీతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అందిస్తారు. రోగికి అందించాల్సిన ప్రథమ చికిత్స నుంచి వైద్యానికి సంబంధించిన అన్ని విషయాలను నేర్పిస్తారు. ఈ కోర్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అందిస్తోంది. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ :
వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరగడం ద్వారాకాని, వృద్ధాప్యం వల్ల కాని శరీర భాగాల్లో ముఖ్యంగా జాయింట్స్‌లో బెణకడం, విరగడం వంటి సమస్యలు ఏర్పడినప్పుడు వాటికి ఫిజియోథెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. ముఖ్యంగా ఈ కోర్సులో భాగంగా మానవ శరీరంలో వివిధ భాగాలు, వాటి అమరిక గురించి అవగాహన కల్పిస్తారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. ఏపీ ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సు వ్యవధి నాలుగున్నరేళ్లు.
  • పై కోర్సులతోపాటు ఇంటర్‌లో ఏ గ్రూప్ పాసైన వారికైనా.. మూడేళ్ల వ్యవధి గల జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ (జీఎన్‌ఎం), పదిహేడు పారామెడికల్ డిప్లొమా కోర్సులు.. పారామెడికల్ బోర్డు ఆధ్వర్యంలో వివిధ విద్యాసంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సులు చదివిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలమని చెప్పొచ్చు.
Published date : 04 May 2019 09:10PM

Photo Stories