Skip to main content

`పది` తర్వాత కామర్స్ గ్రూపుతో ప్రయోజనాలు...

పదో తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలి? ఎందులో చేరితే భవిష్యత్తు బాగుంటుంది?.. ఇలా రకరకాల ప్రశ్నలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురవుతాయి.
పదో తరగతి తర్వాత చేరబోయే కోర్సు విద్యార్థి భవిష్యత్తును శాసిస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో పది తర్వాత ఇంటర్-కామర్స్ గ్రూపుతో ప్రయోజనాలు, ఆపై ఉద్యోగావకాశాల వివరాలు...
ప్రస్తుతం కామర్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి అపార అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయి. పదో తరగతి తర్వాత కామర్స్ కోర్సుల్లో చేరి, ఆపై ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఆర్థిక నిపుణులుగా ఎదగొచ్చు.

ఇంటర్ ఎంఈసీ/సీఈసీ :
  • ఉన్నతవిద్య, ఉపాధి అవకాశాలకు మార్గంచూపే కోర్సు.. ఇంటర్మీడియెట్-ఎంఈసీ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్). భవిష్యత్తులో ఓ సంస్థను ఏర్పాటు చేయాలన్నా, మంచి వ్యాపారవేత్తగా ఎదగాలన్నా కామర్స్ పరిజ్ఞానం ముఖ్యం. ఇంటర్ ఎంఈసీ గ్రూపు ద్వారా ఆర్థిక, వాణిజ్య రంగంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు లభిస్తాయి.
  • ఇంటర్ ఎంఈసీని పూర్తిచేశాక సీఏ/సీఎంఏ/సీఎస్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరొచ్చు. ఇతరులతో పోల్చితే ఎంఈసీ పూర్తిచేసిన వారు కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో రాణించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
  • ఇంటర్ ఎంఈసీ తర్వాత బీకామ్, బీబీఎం తదితర కోర్సుల్లోనూ చేరొచ్చు. వీటి తర్వాత ఎంకామ్, ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరి ఉన్నత కెరీర్‌కు మార్గం వేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు.
  • కామర్స్ ద్వారా కెరీర్‌కు బాటలు వేసుకోవాలనుకునే వారు ఇంటర్‌లో కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ (సీఈసీ)లోనూ చేరొచ్చు.
  • సీఏ, సీఎంఏ, సీఎస్‌లను ముఖ్యమైన కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులుగా చెప్పుకోవచ్చు.

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) :
  • ఇంటర్మీడియెట్ తర్వాత చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు చదవడం ప్రారంభించొచ్చు. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు ఇంటర్ ఎంఈసీతో పాటు సీఏ చదవడానికి ఇష్టపడుతున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మన సీఏలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. సీఏ కోర్సు పూర్తిచేసిన వారు కంపెనీల్లో మేనేజింగ్ డెరైక్టర్, ఫైనాన్స్ కంట్రోలర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మార్కెటింగ్ మేనేజర్, సిస్టమ్ ఇంప్లిమెంటర్, టెక్నో ఫంక్షనిస్ట్ తదితర హోదాలను అందుకోవచ్చు.

కోర్సులో దశలు :
  • ఇంటర్/10+2 తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న నాలుగు నెలలకు సీఏ-తొలిదశ ఫౌండేషన్ పరీక్ష రాయొచ్చు. ఇందులో 50 శాతం మార్కులను డిస్క్రిప్టివ్ విభాగానికి, మరో 50 శాతం మార్కులను మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల విభాగానికి కేటాయించారు.
  • సీఏ ఫౌండేషన్ పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి.
  • ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. అదే విధంగా మొత్తంమీద 50 శాతం మార్కులు పొందాలి.
  • సీఏ ఫౌండేషన్ పూర్తిచేసిన వారు సీఏ ఇంటర్ చదవడానికి అర్హులు. ఇందులో గ్రూప్-1లో నాలుగు పేపర్లు, గ్రూప్-2లో నాలుగు పేపర్లు ఉంటాయి. వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఆర్నెల్ల తేడాతో రాయొచ్చు. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు.
  • సీఏ ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన వారు మూడు సంవత్సరాల పాటు ఆర్టికల్‌షిప్ చేయాల్సి ఉంటుంది. రెండున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేసిన వారు సీఏ ఫైనల్ రాసేందుకు అర్హులు.
  • సీఏ ఫైనల్‌లో 8 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షలు ఏటా మే, నవంబర్‌లో జరుగుతాయి. విద్యార్థులు వీలునుబట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా రాయొచ్చు.
  • గ్రూప్-2లో ఆరో పేపర్ ఎలక్టివ్ పేపర్. ఆరు సబ్జెక్టుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

సీఎంఏ :
  • సీఎంఏలో మూడుదశలు (ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్) ఉంటాయి. ఫౌండేషన్ కోర్సులో మొత్తం 8 సబ్జెక్టులను నాలుగు పేపర్లుగా విభజించారు. ప్రతి పేపర్ 100 మార్కులకు (ఆబ్జెక్టివ్+డిస్క్రిప్టివ్) ఉంటుంది. ఏటా జూన్, డిసెంబర్‌లో పరీక్షలు జరుగుతాయి.
  • ఫౌండేషన్ కోర్సును పూర్తిచేసిన వారు సీఎంఏ ఇంటర్ (సీఎంఏ-ఎగ్జిక్యూటివ్) పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందులో రెండు గ్రూపులుంటాయి. మొదటి గ్రూప్‌లో నాలుగు పేపర్లు, రెండో గ్రూప్‌లో నాలుగు పేపర్లు ఉంటాయి. వీలునుబట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఆర్నెల్ల తేడాతో రాయొచ్చు.
  • సీఎంఏ ఇంటర్ పూర్తిచేసిన వారు సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే ఆర్నెల్ల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి.
  • సీఎంఏ ఫైనల్‌లో రెండు గ్రూపులు (గ్రూప్-3, గ్రూప్-4) ఉంటాయి. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులను ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపును ఆర్నెల్ల వ్యత్యాసంతో రాయొచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌లో సీఎంఏ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి.
  • సీఎంఏ పూర్తిచేసిన వారికి విద్యాసంస్థల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ తదితర అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో చీఫ్ ఇంటర్నల్ ఆడిటర్, కాస్ట్ కంట్రోలర్, చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్షియల్ కంట్రోలర్ తదితర కీలక పదవులను అందిపుచ్చుకోవచ్చు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐటీసీ, సిప్లా, జెన్‌ప్యాక్ట్ తదితర సంస్థల్లో ఉన్నత అవకాశాలు లభించాయి.

కంపెనీ సెక్రటరీ (సీఎస్) కోర్సు :
  • సీఎస్ కోర్సులో ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఉంటాయి. సీఎస్ ఫౌండేషన్ పరీక్ష ఏటా జూన్, డిసెంబర్‌లో జరుగుతుంది. ఈ పరీక్షలో 200 ప్రశ్నలకు మొత్తం 400 మార్కులు కేటాయించారు. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించాలంటే 50 శాతం మార్కులు పొందాలి.
  • సీఎస్ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించినవారు నేరుగా ఎగ్జిక్యూటివ్ (రెండు మాడ్యూల్స్‌గా ఎనిమిది పేపర్లు) రాయొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించాలంటే ఒక్కో మాడ్యూల్‌లోని ప్రతి పేపర్లో 40 శాతం మార్కులు, మొత్తంమీద 50 శాతం మార్కులు పొందాలి.
  • సీఎస్ కోర్సును పూర్తిచేయాలంటే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా.. తప్పనిసరిగా అప్రెంటీస్ పేరుతో ఉండే ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. దీని గరిష్ట వ్యవధి మూడేళ్లు. అయితే విద్యార్థులు కోర్సులో ఏ దశలో చేరారనే దానికి అనుగుణంగా ఈ వ్యవధిలో మార్పులు ఉంటాయి.
  • ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాసిన ఏడాది తర్వాత ప్రొఫెషనల్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో మూడు మాడ్యూల్స్ (9 పేపర్లు) ఉంటాయి. 50 శాతం సగటు మార్కులు సాధిస్తే మాడ్యూల్/ప్రొఫెషనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటిస్తారు.
  • సిలబస్‌లో మార్పులు: 2018, మార్చి 1న ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (మాడ్యూల్ 1-4 పేపర్లు, మాడ్యూల్ 2-4 పేపర్లు)కు కొత్త సిలబస్ అమల్లోకి వచ్చింది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు..
ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంతో పాటు ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోనూ కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఈ ధోరణికి అనుగుణంగా నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది. కామర్స్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. పదో తరగతి తర్వాత ఇంటర్ ఎంఈసీ/సీఈసీలో చేరి, ఆపై కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవచ్చు. కామర్స్ కోర్సులు పూర్తిచేసిన వారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆకర్షణీయ వేతన ప్యాకేజీలతో కొలువులు సొంతమవుతున్నాయి.
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్.
Published date : 04 May 2019 09:09PM

Photo Stories