Skip to main content

కేంద్ర కొలువులకు సరైన మార్గం...!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే ప్రభుత్వసంస్థ. కేంద్ర ప్రభుత్వంలోని గ్రూపు-బి, సి, డి, ఎంటీఎస్, కేంద్ర సాయుధ బలగాలు తదితర ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తుంటుంది. ఎస్‌ఎస్‌సీ.. ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు, సీబీఐ, ఈడీ అధికారులు వంటి కీలక పోస్టులను సైతం భర్తీ చేస్తుంది. ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్లకు వచ్చే దరఖాస్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. 2019 సంవత్సరానికి ఉద్యోగాల క్యాలెండర్‌ను ఎస్‌ఎస్‌సీ ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలో ఆకర్షణీయమైన వేతనాలతో ఊరించే ఆయా కొలువులు.. అర్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం...
డిగ్రీతో.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ :
ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్లలో ముఖ్యమైనది.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) ఎగ్జామినేషన్. ఎస్‌ఎస్‌సీ ఏటా సీజీఎల్‌కు ప్రకటన విడుదల చేస్తుంది. గత మూడేళ్లుగా ఈ నోటిఫికేషన్ల ద్వారా పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోంది. 2017 నోటిఫికేషన్‌కు సంబంధించి నాలుగు దశల్లో పరీక్షలు ముగిసిన అనంతరం ఫలితాలు కోర్టు పరిధిలోకి వెళ్లాయి. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షల ప్రశ్నపత్రం లీకైందనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికే కోర్టు మొగ్గు చూపే ఆస్కారముందంటున్నారు. అలానే గతేడాది 2018 సీజీఎల్ ఉద్యోగ ప్రకటన వచ్చినా... ఆన్‌లైన్ పరీక్షలకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. కొత్త క్యాలెండర్ ప్రకారం-2019 నోటిఫికేషన్ తేదీలు కూడా ప్రకటించారు. కాబట్టి ఒకవేళ మొత్తంగా 2017 నోటిఫికేషన్ రద్దయితే.. మూడు ఉద్యోగ ప్రకటనలు అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.

భర్తీచేసే ఉద్యోగాలు :
సీజీఎల్ ద్వారా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు; వివిధ మంత్రిత్వ శాఖల్లో అసిస్టెంట్లు, ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులను; అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, డివిజినల్ అకౌంటెంట్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్, ఆడిటర్స్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ తదితర కీలక పోస్టుల ఖాళీలను భర్తీచేస్తారు.

ఎంపిక ప్రక్రియ :
సీజీఎల్ నోటిఫికేషన్లో వివిధ రకాలు కొలువులు ఉంటాయి. ఆయా ఉద్యోగాన్ని బట్టి మూడు/నాలుగు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటగా టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో కమిషన్ నిర్ణయించిన నిర్దేశిత మార్కులు సాధించిన వారికి టైర్-2కు అర్హత లభిస్తుంది. ఇందులోనూ నిర్దేశించిన మార్కులు పొందితే టైర్-3 (డిస్క్రిప్టివ్ పరీక్ష)కు హాజరవ్వాలి. కొన్ని పోస్టులకు తుదిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/స్కిల్‌టెస్ట్/డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. పరీక్ష విధానంలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది.

పరీక్ష విధానం :
  • పరీక్షలన్నీ ఆన్‌లైన్లో జరుగుతాయి. టైర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ సెక్షన్లు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 50 మార్కులు కేటాయించారు.
  • పోస్టులనుబట్టి టైర్-2లో నాలుగు పేపర్ల వరకు ఉంటాయి. పేపర్-1, పేపర్-2లు ఉమ్మడిగా అందరూ రాయాల్సి ఉంటుంది. పేపర్-3 స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌పై నిర్వహిస్తారు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకుంటే.. వారు పేపర్-3 రాయాలి. అలానే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే.. పేపర్-4(ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్)కు హాజరుకావాల్సి ఉంటుంది.
  • పేపర్ 1, 2లు వరుసగా.. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్‌పై ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ నుంచి 100 ప్రశ్నలకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. ఇంగ్లిష్‌లో 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. పేపర్ 1, 2లకు వేర్వేరుగా రెండు గంటల సమయం అందుబాటులో ఉంటుంది.
  • టైర్-1, 2 లలో కలిపి సాధించిన మార్కుల ఆధారంగా తదుపరి టెస్టులకు అర్హత లభిస్తుంది. టైర్-3ను ‘పెన్ అండ్ పేపర్’ విధానంలో రాయాలి. హిందీ/ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయవచ్చు. ఇందులో లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ మొదలైనవి ఉంటాయి. ఈ టెస్టుకు గంట సమయం కేటాయిస్తారు.
ముఖ్య సమాచారం :
సీజీఎల్‌ఈ-2018:
టైర్-1 పరీక్ష తేదీ: 2019, జూన్ 4 నుంచి జూన్ 19 వరకు.
టైర్-2 పరీక్ష తేదీ: 2019, సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు.
టైర్-3 తేదీ: 2019, డిసెంబర్ 29.

సీజీఎల్‌ఈ - 2019:
నోటిఫికేషన్ తేదీ:
2019, అక్టోబర్ 31.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2019, నవంబర్ 28.
  • పరీక్షల తేదీలను తర్వాత వెల్లడిస్తారు.
వెబ్‌సైట్: https://ssc.nic.in/

ఢిల్లీ పోలీసు, కేంద్ర బలగాలు:
కేంద్రంలోని కీలక పోలీసు కొలువులను భర్తీ చేయడంలో ఎస్‌ఎస్‌సీది ముఖ్యపాత్ర. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఢిల్లీ పోలీస్‌శాఖలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఏటా నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటుంది.

భర్తీచేసే పోస్టులు :
సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ సీఏపీఎఫ్(సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్)(గ్రూప్-బి నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్ పోస్టులు); సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీఎఫ్, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు; అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగాలు; సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ (గ్రూప్-సి పోస్టులు).

పరీక్ష విధానం :
  • ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
  • పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జీకే అండ్ జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి పీఈటీ/పీఎస్‌టీ(ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్-2కు అనుమతి లభిస్తుంది.
  • పేపర్ 2 పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్‌పైనే 200 ప్రశ్నలతో 200 మార్కులకు జరుగుతుంది.
  • పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
  • పీఈటీ/పీఎస్‌టీ (ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్): అన్ని పోస్టులకు ఈ పరీక్షలు తప్పనిసరి.


2018 నోటిఫికేషన్ తేదీలు :
  • నోటిఫికేషన్ విడుదలై.. దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.
పేపర్ 1 పరీక్ష తేదీలు: 2019, మార్చి 12 నుంచి మార్చి 16 వరకు.
పేపర్ 2 పరీక్ష తేదీలు: 2019, సెప్టెంబర్ 27.
2019 నోటిఫికేషన్ వివరాలు..
నోటిఫికేషన్ తేదీ:
2019, సెప్టెంబర్ 17.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2019, అక్టోబర్ 15.
పేపర్ 1 పరీక్ష తేదీలు: 2019, డిసెంబర్ 11 నుంచి 13 వరకు.

ఇంటర్‌తో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ :
ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ విడుదలచేసే నోటిఫికేషన్లలో ప్రధానమైంది.. కంబైన్‌‌డ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్(సీహెచ్‌ఎస్‌ఎల్). ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా పోటీ అధికంగా ఉంటుంది. 2018, 2019 సంవత్సరాలకు సంబంధించిన రెండు నోటిఫికేషన్లకు ఎస్‌ఎస్‌సీ తేదీలు ప్రకటించింది. ఈరెండు నోటిఫికేషన్లు ఈ ఏడాదిలోనే రానున్నాయి. రూ.5,200-రూ.20,200ల వేతనశ్రేణితో ప్రారంభమయ్యే ఈ పోస్టులకు కూడా మంచి జీతభత్యాలు అందుతాయి. సుమారు రూ.35వేల వరకు పొందే అవకాశముంది. 18-27 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

భర్తీచేసే కొలువులు :
సీహెచ్‌ఎస్‌ఎల్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, డేటాఎంట్రీ ఆపరేటర్, కోర్టు క్లర్క్ తదితర పోస్టులను భర్తీని ఎస్‌ఎస్‌సీ చేపడుతుంది.

ఎంపిక విధానం :
  • మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధిస్తే టైర్-2కు అర్హత లభిస్తుంది. టైర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో 100 మార్కులకు జరుగుతుంది. టైర్-3లో టైపింగ్/స్కిల్ టెస్ట్ పరీక్ష ఉంటుంది. టైపింగ్/స్కిల్ టెస్ట్ అర్హత పరీక్ష మాత్రమే. టైర్-1, 2ల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక జరుగుతుంది.
  • టైర్-1 (ఆన్‌లైన్) ఎగ్జామ్‌లో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, టైర్-2 ఎగ్జామ్‌లో డిస్క్రిప్టివ్ టైప్ (విశ్లేషణాత్మక సమాధాన) ప్రశ్నలు ఇస్తారు.
  • టైర్-1 పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్‌‌జ), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్), జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు ఇస్తారు. పరీక్షకు గంట సమయం ఉంటుంది. తప్పు సమాధానానికి నాలుగోవంతు మార్కులు (0.50) కోత విధిస్తారు.
  • టైర్-2: పరీక్ష వ్యవధి ఒక గంట. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 200-250 పదాల్లో ఎస్సే, 150-200 పదాల్లో లెటర్/అప్లికేషన్ రాయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణతకు కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. సమాధానాలను ఇంగ్లిష్/హిందీలో మాత్రమే రాయాలి. టైర్-2 మార్కులను కూడా మెరిట్ లిస్ట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు.
  • టైర్-3: ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులను మెరిట్ లిస్ట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. డీఈవో పోస్టులకు అభ్యర్థుల డేటా ఎంట్రీ స్పీడ్‌ను పరీక్షిస్తారు. ఇందులో ప్రతి అభ్యర్థి 2000-2200 ో్టక్స్/్రకీ-డిప్రెషన్స్ గల ఇంగ్లిష్ కంటెంట్‌ను 15 నిమిషాల్లో కంప్యూటర్‌లో ఎంటర్ చేయాలి. పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్, ఎల్‌డీసీ, కోర్టు క్లర్క్ పోస్టులకు అభ్యర్థి టైపింగ్ స్పీడ్‌ను పరీక్షిస్తారు. స్కిల్ టెస్ట్ మీడియం ‘ఇంగ్లిష్’ అని పేర్కొన్న అభ్యర్థుల టైపింగ్ స్పీడ్ ‘నిమిషానికి 35 పదాలు’; హిందీ అభ్యర్థుల టైపింగ్ స్పీడ్ ‘నిమిషానికి 30 పదాలు’ ఉండాలి. ఇచ్చిన అంశాన్ని 10 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌పై ఎంత కచ్చితంగా టైపింగ్ చేశారనే దాన్నిబట్టి టైపింగ్ స్పీడ్‌ను పరీక్షిస్తారు.
ముఖ్య సమాచారం :
సీహెచ్‌ఎస్‌ఎల్-2018:
నోటిఫికేషన్ తేదీ:
2019, మార్చి 5.
దరఖాస్తుల స్వీకరణ: 2019, ఏప్రిల్ 5.
టైర్ 1 పరీక్ష తేదీలు: 2019, జూలై 1-జూలై 26 వరకు.
టైర్ 2 పరీక్ష తేదీ: 2019, సెప్టెంబర్ 29.

సీహెచ్‌ఎస్‌ఎల్-2019:
నోటిఫికేషన్ తేదీ:
2019, డిసెంబర్ 12.
దరఖాస్తుల స్వీకరణ: 2020, జనవరి 10 వరకు.
  • పరీక్ష తేదీలు తర్వాత వెల్లడిస్తారు.

జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్-2018
ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే ఉద్దేశించిన పరీక్ష ఇది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు సంస్థలు లేదా ప్రాజెక్టుల్లోని వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇటీవల జూనియర్ ఇంజనీర్ 2018 నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 25 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు:
పోస్టులను బట్టి సివిల్/ఎలక్ట్రికల్ (లేదా) మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ/మూడేళ్ల వ్యవధిగల డిప్లొమా/తత్సమాన విద్యార్హత, ఆయా విభాగాల్లో అనుభవం ఉండాలి.

పరీక్ష విధానం :
  • రాత పరీక్షను రెండు దశల్లో పేపర్ 1, పేపర్ 2 నిర్వహిస్తారు. ఇది మొత్తం 500 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటే... పేపర్ 2 డిస్క్రిప్టివ్ పద్ధతిలో జరుగుతుంది. పేపర్1లో ఉత్తీర్ణత సాధిస్తే.. పేపర్ 2 పరీక్షకు అనుమతిస్తారు.
  • పేపర్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష: మొత్తం పరీక్ష 200 మార్కులకు జరుగుతుంది.
    పరీక్ష సమయం: రెండుగంటలు. పరీక్షలో మూడు విభాగాలు.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, సంబంధిత ఇంజనీరింగ్ అంశాలు ఉంటాయి.
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: దీన్ని అన్ని విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాలి. ఇది 50 మార్కులకు ఉంటుంది.
  • జనరల్ అవేర్‌నెస్: దీన్ని కూడా అన్ని విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాలి. ఇది 50 మార్కులకు ఉంటుంది.
  • సివిల్/స్టక్చ్రరల్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-ఏ, ఎలక్ట్రికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-బి, మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పార్ట్-సి విభాగం రాయాలి. ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు.
  • పేపర్-1 పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
  • పేపర్-2 రాతపరీక్ష (డిస్క్రిప్టివ్ పద్ధతి): పేపర్-1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది.
పరీక్ష సమయం: రెండు గంటలు. సివిల్/స్ట్రక్చరల్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-ఏ, ఎలక్ట్రికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-బి, మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పార్ట్-సి రాయాలి.

ప్రిపరేషన్ ప్రణాళిక :
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కోసం బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ తదితర పరీక్షల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అవార్డులు-విజేతలు, క్రీడలు-విజేతలు తదితర అంశాలను చదవాలి. ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆయా బ్రాంచ్‌ల టెక్నికల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • ఎలక్ట్రికల్: సర్క్యూట్లలోని బేసిక్ ప్రిన్సిపుల్స్, బేసిక్ ఫార్ములాలు, వాటి యూనిట్లు తదితర అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్ అంశాలపై అవగాహన అవసరం.
  • సివిల్ ఇంజనీరింగ్: స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, సర్వేయింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రిన్సిపుల్స్, ఫార్ములాలు, యూనిట్లపై అవగాహన అవసరం.
  • మెకానిక్స్: థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఐసీ ఇంజన్, హీట్ ఇంజన్ వంటి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. వీటికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపుల్స్‌ను అధ్యయనం చేయాలి.
  • ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ఒకచోట రాసుకొని రివిజన్ చేస్తుండాలి. మాక్‌టెస్టులు రాయడం లాభిస్తుంది.
ముఖ్యతేదీలు :
దరఖాస్తు ఫీజు:
రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
  • 2018 జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 1వ తేదీన విడుదలైంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2019, ఫిబ్రవరి 25.
పేపర్1 పరీక్ష తేదీలు: 2019, సెప్టెంబర్ 23-27.
పేపర్ 2 పరీక్ష: 2019, డిసెంబర్ 29.
2019 జూనియన్ ఇంజనీర్ నోటిఫికేషన్ తేది: 2019, ఆగస్టు 1.
దరఖాస్తులకు చివరి తేదీ: 2019, ఆగస్టు 28.
  • పరీక్ష తేదీలు తర్వాత వెల్లడిస్తారు.

పదో తరగతితో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు...
పదోతరగతి అర్హతతో పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ విడుదల చేసే నోటిఫికేషన్.. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ (ఎంటీఎస్). దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే పరీక్ష ఇది. 18-25 ఏళ్ల మధ్య ఉండే వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ల ఆధారంగా వివిధ వర్గాల వారికి వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్టు, రాత పరీక్ష ఆధారంగా.
వేతనం: రూ.5,200-రూ.20,200+గ్రేడ్ పే రూ.1800గా ఉంటుంది.
పరీక్ష విధానం:
  • రెండు రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్-1: ఆబ్జెక్టివ్ ఆన్‌లైన్ టెస్టు
    పేపర్-2: డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే అర్హత పరీక్ష.
  • పేపర్-1లో సాధించిన మార్కుల ఆధారంగానే పేపర్-2కు అర్హత లభిస్తుంది. పేపర్-1ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ సెక్షన్లు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.
  • పేపర్-1లో ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ ఉండే అవకాశముంది. ఆబ్జెక్టివ్ పేపర్‌కు రుణాత్మక మార్కుల విధానం అమల్లో ఉంది.
  • పేపర్-1లో చూపిన ప్రతిభ ఆధారంగా పేపర్-2కు అర్హత లభిస్తుంది. పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే పేపర్ 2లో అభ్యర్థుల ప్రాథమిక భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో షార్ట్ ఎస్సే రైటింగ్, లెటర్-రైటింగ్ ఉంటాయి. 30 నిమిషాల వ్యవధిలో ఈ పరీక్షను పూర్తిచేయాలి. ఈ పరీక్షకు 50 మార్కులు కేటాయించారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కులను తుది ఎంపికలో పరిగణించరు.
ముఖ్య సమాచారం :
నోటిఫికేషన్ తేదీ: 2019, ఏప్రిల్ 22.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2019, మే 22
పేపర్ 1 పరీక్ష తేదీలు: 2019, ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు
పేపర్ 2 పరీక్ష తేదీ: 2019, నవంబర్ 17.

స్టెనోగ్రాఫర్ :
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -సి,డి పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇంటర్ అర్హతతో స్టెనోగ్రఫీ వచ్చినవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం లభిస్తుంది. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా.. ఎస్‌ఎస్‌సీ మొదట రాత పరీక్షను, ఆ తర్వాత స్కిల్ టెస్టును నిర్వహిస్తుంది. మొదటి దశ రాత పరీక్ష(ఆబ్జెక్టివ్)లో మూడు భాగాలు.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ ఉంటాయి. ఈ దశ దాటిన వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇందులోనూ నిర్ణీత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులకు 10 నిమిషాల వ్యవధిలో ఒక డిక్టేషన్ ఇస్తారు. దీన్ని గ్రేడ్ సి కేటగిరీ అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ భాషల్లో నిమిషానికి 100 పదాలను కంప్యూటర్‌పై స్టెనోగ్రఫీ చేయాలి. అలాగే గ్రేడ్ డి అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ భాషల్లో నిమిషానికి 80 పదాలను స్టెనోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.

నోటిఫికేషన్ వివరాలు..
2019 నోటిఫికేషన్ విడుదల తేదీ:
2019, సెప్టెంబర్ 17.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2019, అక్టోబర్ 15.
  • పరీక్ష తేదీలు తర్వాత వెల్లడిస్తారు.
Published date : 20 Feb 2019 12:40PM

Photo Stories