Skip to main content

ఎస్‌ఎస్‌సీ-2020 ఉద్యోగ నోటిఫికేషన్ల సమగ్ర సమాచారం

చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలని కలలు కనే అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. ప్రతీ సంవత్సరంలాగే 2020లో కూడా కొలువుల భర్తీకి సన్నాహకాలు చేస్తోంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. త్వరలో మరికొన్ని ప్రక టనలు జారీ చేయనుంది. తాజాగా ఎస్‌ఎస్‌సీ-2020 క్యాలెండర్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఆయా నోటిఫికేషన్ల వివరాలు, భర్తీ చేయనున్న ఉద్యోగాలు, అర్హతలు, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ఎంపిక తదితర అంశాలపై సమగ్ర కథనం...
ఎస్‌ఎస్‌సీ-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్) :
గ్రూప్-బీ, గ్రూప్- సీ పోస్టులు :
కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించడం చాలామంది యువత కల. కేంద్రంలో గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టులు ప్రధానమైనవి. వీటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్)’ పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. గ్రూప్-బీ పోస్టుల్లో రెండు గెజిటెడ్ ఆఫీసర్(అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్) పోస్టులుంటాయి. అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మినిస్టరీ, విదేశాంగ శాఖ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్, పోస్టల్ డిపార్ట్‌మెంట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్,ఎన్‌ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లలో గ్రూప్-బీ,సీ పోస్టులుంటాయి. వీటిలో ఫీల్డ్ జాబ్, డెస్క్ జాబ్ రెండు రకాలుంటాయి. ఫీల్డ్ జాబ్‌లో భాగంగా వివిధ కంపెనీలు, పరిశ్రమలు, కర్మాగారాలు సందర్శించి వారి నుంచి సమాచారం సేకరించడం, ప్రభుత్వ అనుమతులు, నిబంధనల ప్రకారం నడుపుతున్నారా లేదా, ట్యాక్సులు సక్రమంగా కడుతున్నారా లేదా వంటి విషయాలను పరిశీలించాలి. ఫీల్డ్ ఉద్యోగులు సేకరించిన సమాచారం ఆధారంగా డెస్క్ ఉద్యోగుల విధులుంటాయి.
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు 10+2లో మ్యాథమెటిక్స్‌లో 60శాతం మార్కులు వచ్చుండాలి(లేదా) గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివుండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 15, 2020
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 15, 2020
పరీక్ష తేదీ: దరఖాస్తుల ప్రారంభానికి ముందే వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు.

ఎంపిక :
ఎంపిక ప్రక్రియ నాలుగంచెల్లో జరుగుతుంది. టైర్-1,2 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. టైర్-3 డిస్క్రిప్టివ్ పరీక్ష. టైర్-4 కంప్యూటర్ స్కిల్ టెస్ట్. గతంలో ఉన్న ఇంటర్వ్యూ విధానం తీసేసి.. ఆ స్థానంలో టైర్-3, 4లను ప్రవేశ పెట్టారు. ప్రతి విభాగంలో నిర్దేశిత మార్కులు సాధిస్తేనే.. తర్వాతి పరీక్షలకు అర్హత లభిస్తుంది. ఆన్‌లైన్ పరీక్షలో రుణాత్మక మార్కులు (1/4 వంతు) ఉన్నాయి.

పరీక్ష విధానం :
  • టైర్-1: ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం నాలుగు విభాగాల్లో 100 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
  • టైర్-2: టైర్-1లో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకున్న పోస్టులకు అతీతంగా పేపర్-1, పేపర్-2 పరీక్షలు రాయాలి.
  • పేపర్-1లో మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష సమయం 2 గంటలు.
  • పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 200 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులకు జరిగే ఈ పరీక్ష సమయం 2 గంటలు.
  • జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు పేపర్-3 రాయాలి. స్టాటిస్టిక్స్ విభాగం నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష సమయం రెండు గంటలు.
  • గ్రూప్-బీ గెజిటెడ్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు పేపర్-4 రాయాలి. ఎకనామిక్స్, ఫైనాన్స్ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష సమయం రెండు గంటలు.
  • టైర్-3: ఇంగ్లిష్ లేదా హిందీ మాద్యమాల్లో ఏదైనా ఒకటి ఎంచుకొని పెన్, పేపర్ విధానంలో డిస్క్రిప్టివ్ పరీక్ష రాయాలి. ఎస్సే, లెటర్, అప్లికేషన్ రైటింగ్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. 100 మార్కులకు జరిగే ఈ పరీక్ష ను 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి.
  • టైర్-4: కంప్యూటర్ స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో అభ్యర్థుల టైపింగ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు.

ఏ విభాగం నుంచి ఎన్ని మార్కులు..?
టైర్-1, 2 పరీక్షల్లో పేపర్-3, 4 మినహా మొత్తం 600 మార్కులకు సీజీఎల్ పరీక్ష జరుగుతుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 250 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌ల నుంచి 250 మార్కులు ఉంటాయి. కాబట్టి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ల నుంచి అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ.

ఎస్‌ఎస్‌సీ-జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ :
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రాజెక్టులు, పరిశోధన విభాగాలు, రక్షణ రంగ సంస్థల్లో జరిగే ఇంజనీరింగ్ పనుల పర్యవేక్షణ, అమలుకు అవసరమయ్యే సిబ్బందిని జూనియర్ ఇంజనీర్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని దాదాపు 21 విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ ఇంజనీర్‌గా నియమితులైన వారు గ్రూప్-బీ(నాన్-గెజిటెడ్) విభాగంలో కేంద్ర కొలువు సొంతం చేసుకోవచ్చు. వీరు కేంద్ర జలసంఘం, సీపీడబ్ల్యూడీ, మిలిటరీ, ఇంజనీరింగ్ సర్వీస్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, కేంద్ర జల, విద్యుత్ రీసెర్చ్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది.
అర్హత: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
వయసు: పోస్టులను బట్టి 18-32 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 4, 2020
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 3, 2020.

ఎంపిక విధానం :
  • జేఈ పరీక్ష రెండు విభాగాలు(పేపర్-1, 2)గా ఉంటుంది.
  • పేపర్-1: కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-50 మార్కులు, జనరల్ ఇంజనీరింగ్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర విభాగాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి)-100 మార్కులు. మొత్తం 200 ప్రశ్నలు-200 మార్కులకుంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. నెగిటివ్ మార్కింగ్(0.25) విధానం ఉంది. పేపర్-1లో అర్హత సాధించిన వారే పేపర్-2 రాయడానికి అర్హులు.
  • పేపర్-2: పేపర్-2లోనూ మూడు విభాగాలుంటాయి. అభ్యర్థి ఏ విభాగం(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్) నుంచి డిప్లొమా లేదా ఇంజనీరింగ్ పూర్తిచేశారో ఆ విభాగంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పేపర్-2లో ప్రతి ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం రాయాలి. మొత్తం 300 మార్కులకు జరిగే ఈ విభాగంలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు.

ఎస్‌ఎస్‌సీ-కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) ఎగ్జామ్ :
ఇంటర్మీడియట్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవడానికి చక్కటి మార్గం.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవల్(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్) పరీక్ష. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని డేటాఎంట్రీ ఆపరేటర్, లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ), పోస్టల్ అసిస్టెంట్స్, కోర్ట్ క్లర్క్ తదితర పోస్టులు భర్తీ చేస్తారు.
అర్హత: ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హత ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 30, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2020
పరీక్షతేదీ: దరఖాస్తులు ప్రారంభానికి ముందే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఎంపిక విధానం :
ఈ పరీక్ష మొత్తం మూడంచెల్లో జరుగుతుంది. టైర్-1(కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామ్), టైర్-2 (డిస్క్రిప్టివ్-పేపర్ అండ్ పెన్ విధానం), టైర్-3 (స్కిల్/టైపింగ్ టెస్ట్ట్) ఉంటాయి. ప్రస్తుతం టైర్-1 పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.

టైర్-1 నోటిఫికేషన్ వివరాలు..
దరఖాస్తులు ప్రారంభం:
డిసెంబర్ 3, 2019
దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 10, 2020
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: రూ.100
వయసు: 2020, జనవరి 1 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంటుంది.
అర్హత: ఇంటర్మీడియట్.
పరీక్ష తేదీలు: 2020, మార్చి 16 నుంచి 27 వరకు జరుగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, వరంగల్, కాకినాడ, కరీంనగర్, నెల్లూరు, విజయనగరం, చీరాల.

పరీక్ష విధానం :
ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్ష సమయం 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.

సంఖ్య

సబ్జెక్ట్

ప్రశ్నలసంఖ్య

మార్కులు

1

జనరల్ ఇంటెలిజెన్స్

25

50

2

జనరల్ అవేర్‌నెస్

25

50

3

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్)

25

50

4

ఇంగ్లిష్ లాంగ్వేజ్

25

50

 

మొత్తం

100

200


టైర్-2 :
పరీక్ష తేదీ:
జూన్ 28, 2020.
ఈ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతుంది. పేపర్‌పై పెన్నుతో రాయాలి. వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఇందులో రెండు రకాల ప్రశ్నలుంటాయి. అడి గిన అంశానికి సంబంధించిన వ్యాసాన్ని 200-250 పదాల్లో రాయాలి. ఉత్తరం లేదా దరఖాస్తును 150-200 పదాల్లో పూర్తి చేయాలి. జవాబులు హిందీ లేదా ఇంగ్లిష్‌లో రాయాలి. ఈ విభాగంలో కనీసం 33 శాతం మార్కులు పొందడం తప్పనిసరి.

టైర్-3 :
దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి స్కిల్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది. డేటాఎంట్రీ పోస్టులకు టైపింగ్ టెస్ట్‌లో భాగంగా కంప్యూటర్‌పై 15 నిమిషాలకు 2000 నుంచి 2200 కీ డిప్రిషన్స్ ఇవ్వాలి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విభాగంలోని పోస్టులకు 15 నిమిషాలకు 3700 నుంచి 4000 కీ డిప్రిషన్స్ ఇవ్వాలి. ఏదైనా సమాచారం ఇచ్చి దాన్ని కంప్యూటర్‌పై టైప్ చేయమంటారు. తప్పులు టైపింగ్ చేస్తే మార్కుల కోత ఉంటుంది. టైపింగ్ టెస్టులో భాగంగా హిందీ లేదా ఇంగ్లిష్ ఎంచుకోవచ్చు. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35, హిందీలో నిమిషానికి 30 పదాల చొప్పున టైప్ చేయాలి.

ఎస్‌ఎస్‌సీ-మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) :
పదోతరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) భర్తీ చేస్తోంది. దీనికోసం మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) పేరుతో ప్రతి ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో రోజువారీ కార్యక్రమాలు సక్రమంగా సాగడానికి సాయపడే గ్రూప్-సీ ఉద్యోగాలు ఈ విభాగం కిందకు వస్తాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్‌లలో అందించడం, ఫైల్స్ భద్రపరచడం, లేఖలను సంబంధిత విభాగాలకు చేరవేయడం, పోస్టల్ వర్క్.. ఇలా పలు రకాల విధులు నిర్వహిస్తూ పైఅధికారులకు సహాయ పడుతుంటారు. అందుకే వీరిని మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని వ్యవహరిస్తారు.
అర్హత: పదోతరగతి
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 2, 2020
దరఖాస్తుకు చివరి తేదీ: జులై 15, 2020
పరీక్ష తేదీలు: 2020, అక్టోబర్ 26 నుంచి నవంబర్ 13 వరకు.

ఎంపిక ప్రక్రియ :
పేపర్-1:
ఎంపిక రెండు (పేపర్-1, 2) దశల్లో ఉంటుంది. మొదటి దశ రాతపరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో ఒక్కో దాని నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష కాల వ్యవధి 90 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్(0.25) ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. పేపర్-1లో నిర్ణీత అర్హత మార్కులు సాధిస్తేనే రెండో దశ(పేపర్-2) డిస్క్రిప్టివ్ పరీక్షకు అర్హులు. పేపర్-2 కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పేపర్-1లో సాధించిన మెరిట్ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
పేపర్-2: అర్హత పరీక్ష అయినప్పటికీ పేపర్-2 ను జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాష(తెలుగు భాష)ల్లో జవాబులు రాయవచ్చు. 50 మార్కులకు జరిగే ఈ పరీక్షకు 30 నిమిషాల సమయం కేటాయించారు. ఎంచుకున్న భాషలో అభ్యర్థుల వ్యక్తీకరణ, రాత నైపుణ్యాలను ఇందులో పరిశీలిస్తారు. ప్రధానంగా ఎస్సే, లెటర్ రైటింగ్‌పై ప్రశ్నలుంటాయి. అక్షర దోషాలు, పద ప్రయోగాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి. వాక్యనిర్మాణం, విరామ చిహ్నాలపై శ్రద్ధ అవసరం. ఇంగ్లిష్‌లో సమాధానాలు రాసే వారు క్యాపిటల్, స్మాల్ లెటర్ల వినియోగంపై అవగాహన కలిగి ఉండాలి.

ఎస్‌ఎస్‌సీ-స్టెనోగ్రాఫర్స్ (గ్రేడ్-సీ, డీ):
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రేడ్-సీ, డీ కేటగిరీల్లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తుంది. వీటి భర్తీ కోసం ప్రతిఏటా అఖిల భారత స్థాయిలో రాతపరీక్ష నిర్వహిస్తుంది.
అర్హత: ఇంటర్మీడియట్ (స్టెనోగ్రఫీ సర్టిఫికెట్ ఉండాలి).
వయసు: గ్రేడ్-సీ పోస్టులకు 18-30; గ్రేడ్-డీ పోస్టులకు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 4, 2020
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 3, 2020.
పరీక్ష తేదీలు: 2020, డిసెంబర్ 1 నుంచి 3 వరకు.

ఎంపిక విధానం :
రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), రెండోది స్కిల్ టెస్ట్.
  • మొదటి దశ: జనరల్ ఇంటెలిజన్స్‌అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నేస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ అండ్ కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు-100 మార్కులుంటాయి. మొత్తం 200 మార్కులకు జరిగే ఈ పరీక్ష కాల వ్యవధి 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
  • రెండో దశ: ఇది పూర్తిగా స్కిల్ టెస్ట్. మొదటి దశలో అర్హత సాధించిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ కూడా నిర్ణీత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులకు ఇంగ్లిష్ లేదా హిందీలో 10 నిమిషాల వ్యవధి గల డిక్టేషన్ ఇస్తారు. గ్రేడ్-సీ అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ భాషల్లో నిమిషానికి 100 పదాలు కంప్యూటర్‌పై స్టెనోగ్రఫీ చేయాలి. అలాగే గ్రేడ్-డీ అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ భాషల్లో నిమిషానికి 80 పదాలు స్టెనోగ్రఫీ చేయాలి.

స్టెనోగ్రఫీకి కేటాయించే సమయం :
  • గ్రేడ్-సీ పోస్టులు.. 40 నిమిషాలు (ఇంగ్లిష్); 55 నిమిషాలు (హిందీ).
  • గ్రేడ్-డీ పోస్టులు.. 50 నిమిషాలు (ఇంగ్లిష్); 65 నిమిషాలు (హిందీ).

ఎస్‌ఎస్‌సీ- సబ్‌ఇన్‌స్పెక్టర్, సీఏపీఎఫ్:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీచేసే కేంద్ర కొలువుల్లో.. సబ్ ఇన్‌స్పెక్టర్-ఢిల్లీ, సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్)-ఢిల్ల్లీ ముఖ్యమైనవి. ఈ రెండు విభాగాల పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ప్రతిఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (ఢిల్లీ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు మోటార్ సైకిల్ (లేదా) కార్ డ్రైవింగ్ లెసైన్స్ ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు).
వయసు: 20-25 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 17, 2020.
దరఖాస్తుకు చివరితేదీ: మే 16, 2020.
పరీక్ష తేదీలు: 2020, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు.

పరీక్ష విధానం :
పేపర్-1, పేపర్-2లుగా పరీక్ష విధానం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరిగే పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు పీఈటీ, పీఎస్‌టీ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఇందులో అర్హత సాధించిన వారే పేపర్-2కు అర్హులు. పేపర్-2లో పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌పై 200 ప్రశ్నలకుగాను 200 మార్కులుంటాయి. పేపర్-1, 2ల్లో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in

ఎస్‌ఎస్‌సీ-2020 క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి

ఎస్‌ఎస్‌సీ పరీక్షల సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రివియస్ పేపర్స్, ఆన్‌లైన్ టెస్టులు, గెడైన్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
Published date : 26 Dec 2019 01:19PM

Photo Stories