Skip to main content

ఫార్మసీలో ఉన్నత విద్యకు మార్గం.. నైపర్-జేఈఈ

ప్రపంచ వ్యాప్తంగా దినదిన ప్రవర్థమానమవుతున్న రంగాల్లో టాప్-10లో నిలుస్తోంది ఫార్మాస్యుటికల్ రంగం. రిటైల్ మెడికల్ అవుట్‌లెట్‌లో ఫార్మసిస్ట్ నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో డ్రగ్ డిస్కవరీ ప్రొఫెషనల్స్ వరకూ.. ఫార్మసీ నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతున్న రంగం ఫార్మాస్యుటికల్స్. ఇంతటి అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగంలో అకడమిక్‌గా ఉన్నత విద్యను అభ్యసిస్తే సమున్నత అవకాశాలు సొంతమవడం ఖాయం. మన దేశంలో ఫార్మసీలో ఉన్నత విద్యకు ప్రతిష్టాత్మక సంస్థ.. ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ - నైపర్’. నైపర్ క్యాంపస్‌ల్లో పీజీ స్థాయి నుంచి అందుబాటులో ఉండే కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఈ పరీక్షలో రాణించేందుకు అనువైన వ్యూహాలపై విశ్లేషణ..
4 విభాగాలు.. 16 ప్రోగ్రామ్‌లు
దేశ వ్యాప్తంగా ఉన్న నైపర్స్‌లో మొత్తం నాలుగు విభాగాల్లో 16 పీజీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి..
  • ఎంఎస్-ఫార్మసీ: మెడిసినల్ కెమిస్ట్రీ; నేచురల్ ప్రొడక్ట్స్; ట్రెడిషనల్ మెడిసిన్; ఫార్మాస్యుటికల్ అనాలిసిస్; ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ; రెగ్యులేటరీ టాక్సికాలజీ; ఫార్మాస్యుటిక్స్; బయో టెక్నాలజీ; ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్; మెడికల్ డివెజైస్.
  • ఎం.ఫార్మసీ: ఫార్మాస్యుటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్స్); ఫార్మసీ ప్రాక్టీస్; క్లినికల్ రీసెర్చ్.
  • ఎంటెక్ ఫార్మసీ: ఫార్మాస్యుటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్ట్రీ); ఫార్మాస్యుటికల్ టెక్నాలజీ (బయో టెక్నాలజీ)
  • ఎంబీఏ (ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్).
మొత్తం సీట్ల వివరాలు
నైపర్ సీట్లు
మొహాలీ 199
అహ్మదాబాద్ 38
గువహటి 40
హైదరాబాద్ 114
హాజీపూర్ 46
కోల్‌కత 52
రాయ్‌బరేలి 43
మొత్తం 562

2 గంటలు 200 మార్కులు
నైపర్ క్యాంపస్‌లలో అందుబాటులో ఉన్న కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నైపర్ జేఈఈ రెండు గంటల వ్యవధిలో 200 మార్కులకు ఉంటుంది. మొత్తం ప్రశ్నలు 200. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే పరీక్షలో మెరుగైన ర్యాంకు పొందాలంటే.. అభ్యర్థులు బీఫార్మసీ స్థాయిలోని అకడమిక్స్‌పై పూర్తి స్థాయి అవగాహన ఉండాలి.

అర్హత: బీఫార్మసీ/బయోటెక్నాలజీ/సంబంధిత స్పెషలైజేషన్. కనీసం 60 శాతం మార్కులు (లేదా) 6.75 సీజీపీఏతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు (లేదా) 6.25 సీజీపీఏతో ఉత్తీర్ణత. పీహెచ్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు (లేదా) 5.75 సీజీపీఏతో ఉత్తీర్ణత. వీటితోపాటు జీప్యాట్/గేట్/నెట్ స్కోర్లు తప్పనిసరి. ఎంబీబీఎస్, బీవీఎస్‌సీ, బీఏఎంఎస్ అభ్యర్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో www.niperhyd.ac.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రిపరేషన్ ఇలా
నైపర్-జేఈఈలో రాణించేందుకు అభ్యర్థులు ప్రధానంగా కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యుటికల్ అనాలిసిస్ విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. మొత్తం 200 ప్రశ్నల్లో 70 శాతం మేర ప్రశ్నలు ఈ విభాగాల నుంచే వచ్చే అవకాశముంది. కొన్ని ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించినవి ఉంటున్నాయి. కోర్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బీఫార్మసీలో పొందిన నైపుణ్యం, జీప్యాట్‌కు పొందిన సన్నద్ధతతో రాణించేందుకు వీలుంది. కెమిస్ట్రీకి సంబంధించి స్టీరియో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కాంపౌండ్స్ వాటి రసాయన సంశ్లేషణ గురించి పూర్తి స్థాయిలో అవగాహన అవసరం. అదేవిధంగా ఐసోమర్స్, నేమ్డ్ రియాక్షన్స్ కూడా ఈ విభాగంలో కీలకమైనవి. ఫార్మకాలజీలో రిసెప్టర్స్ వాటి రకాలు, మెకానిజమ్ ఆఫ్ యాక్షన్, ఔషధాల వర్గీకరణ, క్లినికల్ ట్రయల్స్‌పై అవగాహన, ప్రీ-క్లినికల్ ట్రయల్స్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. డ్రగ్ డిస్కవరీకి సంబంధించి ముఖ్యంగా వాటి ప్రాముఖ్యతలు దాంతోపాటు రియాక్షన్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విభాగాల్లో అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఎంజైమ్‌లు, వాటి విధులు, ఎంజైమ్ చర్యా విధానం, బ్లాటింగ్ టెక్నిక్స్, ఎలక్ట్రోఫోరెసిస్, జీనీ క్లోనింగ్, ప్రొటీన్స్, ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ, ఆర్‌డీఎన్‌ఏ టెక్నాలజీలపై విభిన్న కోణాల్లో అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎంబీఏ.. జీడీ, పీఐ కూడా
నైపర్-జేఈఈ ద్వారా నైపర్-హైదరాబాద్, మొహాలీలలో ప్రవేశం కల్పించే ఎంబీఏ ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్ ఔత్సాహికులకు రాత పరీక్షతోపాటు మలి దశలో గ్రూప్ డిస్కషన్ (జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ(పీఐ) ఉంటాయి. నైపర్-జేఈఈకి 85 శాతం వెయిటేజీ; గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ రెండింటికీ కలిపి 15 శాతం వెయిటేజీ ఇస్తారు.

ఉన్నత విద్య.. ఆర్థిక ప్రోత్సాహం
నైపర్-జేఈఈ ద్వారా విద్యార్థులకు ఫార్మసీలో ఉన్నత విద్యతోపాటు ప్రతి సెమిస్టర్‌లో వారు చూపిన ప్రతిభ ఆధారంగా నెలకు రూ. 8 వేల స్కాలర్‌షిప్ కూడా లభిస్తుంది. జీప్యాట్ స్కోర్ ఉన్నప్పటికీ.. నైపర్-జేఈఈ నిర్వహించడానికి ప్రధాన కారణం విద్యార్థుల్లోని నిజమైన ఆసక్తిని గుర్తించి మెరుగైన విద్యార్థులను ఎంపిక చేయాలనుకోవడమే. ఫార్మసీ కెరీర్స్ విషయానికొస్తే ప్రస్తుతం అన్ని విభాగాల్లోనూ కెరీర్ అవకాశాలు పుష్కలం. అందువల్ల మార్కెట్ డిమాండ్, క్రేజ్ కోణంలో ఈ కోర్సులను పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. నైపర్ క్యాంపస్‌లలో కోర్సులు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డీఎస్‌టీ తదితర ప్రభుత్వ విభాగాలతో పాటు ప్రముఖ ప్రైవేట్ ఫార్మాస్యుటికల్ పరిశ్రమల్లో సగటున అయిదు లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం లభిస్తోంది.
- ప్రొఫెసర్ యు.ఎస్.ఎన్.మూర్తి, డీన్, నైపర్-హైదరాబాద్

నైపర్ ఫర్ ఎక్సలెన్స్
నైపర్‌లో ఫార్మసీ విద్యను అభ్యసించడం వల్ల ఈ రంగంలో అద్భుత నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాల విషయంలో ఇతరులకంటే రెండింతలు ముందుండే అవకాశం లభిస్తుంది. నైపర్-జేఈఈ ఔత్సాహికులు బీఫార్మసీ స్థాయిలో కోర్ సబ్జెక్ట్‌లలో బేసిక్ నైపుణ్యాలు సొంతం చేసుకునేలా ప్రిపరేషన్ సాగిస్తే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. జీప్యాట్ ప్రిపరేషన్ కూడా కలిసొచ్చే అంశం.
- బి.సురేశ్ కుమార్, ఎంఎస్(ఫార్మసీ), నైపర్-హైదరాబాద్.
Published date : 23 Apr 2016 06:29PM

Photo Stories