Skip to main content

NEET UG 2022 Cutoff: నీట్‌ నిరాశ పరిచినా.. మరెన్నో మార్గాలు!!

neet ug 2022 career opportunities
neet ug 2022 career opportunities

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌.. సంక్షిప్తంగా నీట్‌! జాతీయ స్థాయిలో.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు.. ఆయుష్‌ వంటి వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఈ నెల 17న నిర్వహించిన నీట్‌కు.. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు! నీట్‌ కొంత క్లిష్టంగాఉందని.. కటాఫ్‌ తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేసమయంలో ఒకవేళ నీట్‌ ఫలితం నిరాశకు గురి చేస్తే..ప్రత్యామ్నాయ అవకాశాలు ఏంటి? అనే సందేహం విద్యార్థుల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో.. నీట్‌–యూజీ–2022 విశ్లేషణతో పాటు, కటాఫ్‌ అంచనా, నీట్‌ అర్హతగా లభించే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌తోపాటు అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయ కోర్సులపై ప్రత్యేక కథనం.. .

  • నీట్‌ క్లిష్టంగా ఉందంటున్న విద్యార్థులు
  • కటాఫ్‌ మార్కులు  తగ్గే అవకాశం
  • జాతీయ స్థాయిలో 18 లక్షలకు పైగా హాజరు
  • తెలుగు రాష్ట్రాల నుంచి 1.2 లక్షల మంది హాజరు

 

  • 18,72,329: నీట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య
  • 95 శాతం: నీట్‌కు హాజరైన విద్యార్థుల శాతం.
  • తెలుగు రాష్ట్రాల నుంచి 1.2 లక్షల మంది హాజరైనట్లు అంచనా. 
  • ఈ గణాంకాలను చూస్తే.. నీట్‌కు ఏటేటా పోటీ పెరుగుతోందని చెప్పొచ్చు.
  • గత ఏడాది 15.44 లక్షల మంది నీట్‌కు హాజరు కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 18లక్షలు దాటింది. ఇంతటి తీవ్ర పోటీలో విజయావకాశాలపై సందేహాలు తలెత్తడం సహజం.

కొన్ని క్లిష్టం.. కొన్ని సులభం

  • నీట్‌ యూజీ పరీక్ష రాసిన విద్యార్థులకు ఈసారి భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లలో 180 ప్రశ్నలు–720 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. కొన్ని విభాగాల నుంచి ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఊహించని రీతిలో ప్రశ్నలు ఎదురైనట్లు చెబుతున్నారు. ముఖ్యంగా బయాలజీ విభాగంలో ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకున్నాయి. 
  • గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది.. మ్యాచింగ్‌ టైప్‌ ప్రశ్నలు, స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలు, అసెంప్షన్‌ అండ్‌ రీజనింగ్‌ ప్రశ్నలు అడిగారు. దీంతో..ఆబ్జెక్టివ్‌ విధానంలోని ప్రశ్నలకు సన్నద్ధమైన విద్యార్థులు కొంత ఇబ్బందికి గురైనట్లు సబ్జెక్ట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఈసారి ఫిజిక్స్‌ నుంచి ప్రశ్నలు కొంత సులభంగా అడగగా.. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీల నుంచి క్లిష్టమైన ప్రశ్నలు అడిగారు.

చ‌ద‌వండి: Exams Preparation: మన పరీక్షలు ఎంత ‘నీట్‌’?

సుదీర్ఘమైన ప్రశ్నలు

  • ఈసారి నీట్‌లో ప్రశ్నల నిడివి సుదీర్ఘంగా ఉంది. అంటే.. ప్రశ్నలను ఎక్కువ వాక్యాల రూపంలో ఇచ్చారు. దీంతో ఆ ప్రశ్నను చదివి అర్థం చేసుకోవడానికి.. సరైన సమాధానాన్ని గుర్తించడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. ముఖ్యంగా బయాలజీలో ఇలాంటి ప్రశ్నలు పది నుంచి పదిహేను వరకూ ఉన్నాయి. దాంతో సమయాభావ పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఈసారి నీట్‌ యూజీలో తార్కిక విశ్లేషణతో సమాధానాలు ఇచ్చే విధంగా ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఫిజిక్స్, బయాలజీ విభాగాల్లో ఈ తరహా ప్రశ్నలు కనిపించాయి.

 
ప్రశ్నల్లో సందిగ్ధత

నీట్‌ 2022లో ప్రతి సబ్జెక్ట్‌లోనూ సందిగ్ధత కలిగించే ప్రశ్నలు కొన్ని కనిపించాయి. బయాలజీలో 4 ప్రశ్నలు, కెమిస్ట్రీలో రెండు ప్రశ్నలు, ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చే విషయంలో విద్యార్థులు సందిగ్ధతకు గురయ్యారు. ఇచ్చిన ఆప్షన్లలో సరైన సమాధానం లేకపోవడం, రెండు మూడు సమాధానాలు ఉండటం ఈ పరిస్థితికి కారణమని నిపుణులు అంటున్నారు. దీంతో విద్యార్థులకు సమయం వృధా అవడమే కాకుండా.. మిగతా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విషయంపైనా ఇది ప్రతికూల ప్రభావం చూపింది.

కటాఫ్‌ తగ్గుతుందా

నీట్‌ 2022 పరీక్ష శైలిని విశ్లేషించిన నిపుణుల అభిప్రాయం ప్రకారం–గత ఏడాదితో పోల్చితే ఈసారి కటాఫ్‌ తగ్గే అవకాశం ఉంది. ప్రశ్న పత్రంలో బయాలజీ, కెమిస్ట్రీ విభాగాలు క్లిష్టంగా ఉండడం, ప్రశ్నల శైలిలో మార్పులే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. గత ఏడాది ఓపెన్‌ కేటగిరీలో 138గా కటాఫ్‌ను పేర్కొనగా.. ఈ ఏడాది అది గరిష్టంగా 128–132గా ఉండొచ్చని అంటున్నారు. అదే విధంగా.. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గత ఏడాది కటాఫ్‌ 108గా పేర్కొనగా.. ఈ సంవత్సరం గరిష్టంగా వంద ఉంటుందని అంచనా.

చ‌ద‌వండి: Cut-off RANKS

450 స్కోర్‌తో సీటు?

ఈ ఏడాది 450 మార్కులు సాధిస్తే రాష్ట్ర స్థాయిలోని స్థానిక కోటాలో సీటు పొందే అవకాశం లభిస్తుందని అంటున్నారు. గత ఏడాది ఇది 480గా నమోదైంది. అదే విధంగా ఆల్‌ ఇండియా కోటాలో జనరల్‌ కేటగిరీలో 520–530లతో సీటు లభిస్తుందని   అంచనా. అంతేకాకుండా 720 మార్కులకు నిర్వహించిన పరీక్షలో 700 నుంచి 705 మధ్యలోనే గరిష్ట స్కోర్‌కు ఆస్కారం ఉందని చెబుతున్నారు.

నో టెన్షన్‌.. మెనీ ఆప్షన్స్‌

నీట్‌ పరీక్ష ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. భవిష్యత్‌ అవకాశాల గురించి ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు. కారణం.. ఇప్పుడు బైపీసీ అభ్యర్థులకు అనేక ప్రత్యామ్నాయ ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులో ఉండటమే. ముఖ్యంగా ఆయుష్‌(ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నేచురోపతి), వెటర్నరీ, అగ్రికల్చర్‌ తదితర కోర్సుల ద్వారా చక్కటి కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆయుష్‌ కోర్సుల సీట్లను కూడా నీట్‌ స్కోర్, మెరిట్‌తోనే భర్తీ చేస్తున్నారు.

బీహెచ్‌ఎంఎస్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీహెచ్‌ఎంస్‌). ఇటీవల కార్పొరేట్‌ రూపు సంతరించుకుంటున్న వైద్య విభాగం ఇది. కారణం.. రోగులకు ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడమే. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కెరీర్‌ పరంగా అవకాశాలకు కొదవ లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ల పరిధిలో పలు కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్‌ కోర్సు అందుబాటులో ఉంది.

బీఏఎంఎస్‌

బైసీసీ విద్యార్థులకు మరో మంచి ప్రత్యామ్నాయం..బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీఏఎంఎస్‌). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పెడియాట్రిక్స్, జనరల్‌ మెడిసిన్‌ తదితర సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. వీటిలో నైపుణ్యం ద్వారా సహజ సిద్ధ ప్రక్రియలతో రోగులకు వైద్యం చేయగలిగే పట్టు లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ఏడు కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్య కోణంలో..ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్‌–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు.

యునానీ(బీయూఎంఎస్‌)

బీయూఎంఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ యునానీ మెడికల్‌ సైన్స్‌). పూర్తిగా ప్రకృతి వైద్యంగా దీన్ని పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ఒకటి,తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే అందుబాటులో ఉంది. బీయూఎంస్‌ పూర్తి చేసిన విద్యార్థులకు పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే విధంగా ఎండీ, ఎంఎస్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

చదవండి: NEET-UG 2021: నీట్‌ రాసారా.. ఇది మీ కోసమే!

బీఎన్‌వైఎస్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతిక్‌ మెడికల్‌ సైన్సెస్‌.. బీఎన్‌వైఎస్‌. బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది.

బీవీఎస్‌సీ

బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండరీ.. బీవీఎస్‌సీ. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు తదితర అంశాల్లో నైపుణ్యం కల్పించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేస్తే.. ఫౌల్ట్రీ ఫారాలు, ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శన శాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపకకేంద్రాల్లో కెరీర్‌ ప్రారంభించవచ్చు. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో అందుబాటులో ఉంది.

ఏజీ బీఎస్‌సీ

అగ్రికల్చర్‌ బీఎస్‌సీ... వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ విభాగంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంకుల్లో సైతం రూరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్ల విభాగంలో కొలువులు అందిపుచ్చుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (ఏపీ), ఆచార్య జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ (తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

చదవండి: NEET -SS 2021 : సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో చేరాల‌నుకుంటున్నారా? అయితే ఇది మీ కోస‌మే..

బీఎస్సీ–హార్టికల్చర్‌ సైన్స్‌

ఈ కోర్సు కూడా ఇటీవల కాలంలో బైపీసీ విద్యార్థులకు కెరీర్‌పరంగా మంచి అవకాశాలు కల్పిస్తోంది. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వారికి స్టేట్‌ హార్టికల్చర్‌ మిషన్, నాబార్డ్‌ సహా పలు బ్యాంకుల్లో కెరీర్‌ అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా..ప్రైవేట్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లలో హార్టికల్చర్‌ గ్రాడ్యుయేట్లకు ఇటీవల కాలంలో ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతున్నాయి.

బీఎఫ్‌ఎస్‌సీ

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌.. బీఎఫ్‌ఎస్‌సీ. చేపల పెంపకం,సేకరణకు సంబంధించి ప్రత్యేక పద్ధతులు అనుసరించేందుకు అవసరమయ్యే నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి ఆక్వాకల్చర్‌ సంస్థలు, ఆక్వా రీసెర్చ్‌ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

బీటెక్‌–ఫుడ్‌ టెక్నాలజీ

ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో బైపీసీ విద్యార్థులకు కెరీర్‌ పరంగా బెస్ట్‌గా నిలుస్తున్న మరో కోర్సు.. బీటెక్‌–ఫుడ్‌ టెక్నాలజీ. ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్‌ సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేయడం ద్వారా ఫుడ్‌ ప్రొడక్షన్‌ యూనిట్స్, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థల్లో కొలువుదీరొచ్చు.

చదవండి: NEET 2022 Question Paper with Key : నీట్‌-2022 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' కోసం క్లిక్ చేయండి.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

బీఎస్‌సీ(సీఏబీఎం)

బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ కమర్షియల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌. బైపీసీ విద్యార్థులకు కార్పొరేట్‌ కొలువులకు మార్గం వేసే కోర్సు ఇది. వ్యవసాయ విధానంలో ఆధునిక పద్ధతులు, వాటి ద్వారా లాభదాయకత పెరిగేలా చేయడానికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తుంది. దీన్ని పూర్తి చేసిన వారికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, క్రాప్‌ ప్రొడక్షన్‌ కంపెనీలలో మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

Published date : 27 Jul 2022 07:38PM

Photo Stories