Skip to main content

యూజీసీ నెట్‌తో.. ప్రఖ్యాత రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో పరిశోధనలకు పిలుపు

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ).. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌.. సంక్షిప్తంగా యూజీసీ నెట్‌! ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష.

పరిశోధనలు, అకడమిక్‌ కెరీర్, ఆర్థిక ప్రోత్సాహం పొందేందుకు చక్కటి మార్గం.. యూజీసీ నెట్‌! ఇందులో ప్రతిభ చూపి.. మెరిట్‌ జాబితాలో నిలిస్తే.. ప్రముఖ యూనివర్సిటీలు, ప్రఖ్యాత రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు సొంతం చేసుకోవచ్చు! తాజాగా.. యూజీసీ–నెట్‌ జూన్‌–2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. యూజీసీ నెట్‌తో ప్రయోజనాలు, భవిష్యత్తు అవకాశాలు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి సలహాలు, తదితర అంశాలపై విశ్లేషణ...

పీజీ స్థాయిలో సంప్రదాయ, టెక్నికల్, ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకొని.. పరిశోధనల దిశగా అడుగులు వేయాలనుకునే వారికి సరైన మార్గం.. యూజీసీ నెట్‌. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ), యూజీసీ సంయుక్తంగా ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జూన్‌–2021 సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

రెండు సెషన్లకు సంయుక్తంగా..
ఎన్‌టీఏ యూజీసీ నెట్‌లో ఈసారి కొన్ని మార్పులు ప్రకటించారు. డిసెంబర్‌–2020 సెషన్, జూన్‌–2021 సెషన్‌లు రెండింటినీ కలిపి సంయుక్తంగా నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. కరోనా కారణంగా.. డిసెంబర్‌–2020 సెషన్‌ వాయిదా పడింది. అలాగే జూన్‌–2021 సెషన్‌ నిర్వహణలో జాప్యం జరిగింది. దాంతో ఈ రెండు సెషన్లను కలిపేసి ఉమ్మడిగా నిర్వహించనున్నారు. అంటే.. డిసెంబర్‌–2020 సెషన్‌ అభ్యర్థులు కూడా జూన్‌–2021 సెషన్‌కు హాజరు కావొచ్చు.

81 సబ్జెక్ట్‌లలో పరీక్ష..
యూజీసీ నెట్‌ మొత్తం 81 సబ్జెక్ట్‌ విభాగాల్లో జరగనుంది. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డ్యూటీస్, ఇండియన్‌ కల్చర్‌ తదితర ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్, లింగ్విస్టిక్‌ సబ్జెక్ట్‌లతోపాటు కంప్యూటర్‌ సైన్స్, క్రిమినాలజీ, మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్‌ సబ్జెక్ట్‌లు కూడా ఉన్నాయి. పీజీ స్థాయిలో చదివిన స్పెషలైజేషన్‌కు అనుగుణంగా ఆయా పేపర్లకు హాజరయ్యే అర్హత లభిస్తుంది.

అర్హతలు..
అర్హత: సంబంధిత పీజీ(పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది.

పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి: జేఆర్‌ఎఫ్‌ అభ్యర్థులకు అక్టోబర్‌ 1, 2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. ఓబీసీ–ఎన్‌సీఎల్, ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.

రెండు కేటగిరీల్లో యూజీసీ నెట్‌..
యూజీసీ–నెట్‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. అవి.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. ఉదాహరణకు.. పరిశోధన అభ్యర్థులు.. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీ మాత్రమే కోరుకుంటే.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌..

  • యూజీసీ–నెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానం (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు.
  • మొత్తం మూడు వందల మార్కులకు జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు.. పేపర్‌1, పేపర్‌ 2 ఉంటాయి.
  • పేపర్‌–1కు అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.
  • పేపర్‌–1లో టీచింగ్‌/రీసెర్చ్‌ అప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు–100 మార్కులు ఉంటాయి. అంటే.. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
  • పేపర్‌–2.. అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్‌ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష.
  • పేపర్‌–2లో సంబంధిత సబ్జెక్ట్‌ పేపర్‌ నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి.
  • పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు.

కనీస అర్హత మార్కులు..
యూజీసీ నెట్‌లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 35శాతం మార్కు లు సాధించాలి.
కేవలం ఆరు శాతం మందిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే నెట్‌ జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులకు పరిశోధనలపై ఆసక్తితోపాటు సంబంధిత సబ్జెక్ట్‌పై గట్టి పట్టుండాలి.

పేపర్‌1: ఆసక్తి, అవగాహన..
పేపర్‌–1లో అభ్యర్థుల్లోని టీచింగ్, రీసెర్చ్‌ ఆసక్తులను, అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రధానంగా టీచింగ్, రీసెర్చ్‌ అప్టిట్యూడ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌–గవర్నెన్స్, పాలిటీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పేపర్‌ 2: సబ్జెక్ట్‌ ప్రశ్నలు..
పేపర్‌–2లో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్‌ సిలబస్‌ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్‌ నుంచి పీజీ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలను అప్లికేషన్‌ ఓరియెంటేషన్, ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో చదవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్‌ థింకింగ్, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా క్రిటికల్‌ థింకింగ్, అనలిటికల్‌ అప్రోచ్‌ అలవరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ప్రశ్నలు ఏవిధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.

యూజీసీ నెట్‌ 2021– ముఖ్య సమాచారం..

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్‌ 5, 2021
  • ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్‌ 6, 2021
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల సవరణ అవకాశం: సెప్టెంబర్‌ 7 – సెప్టెంబర్‌ 12
  • పరీక్ష తేదీలు: అక్టోబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 11 వరకు
  • ప్రతి రోజు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష (మొదటి షిప్ట్‌ ఉదయం 9–12 గంటలు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3–6 గంటలు) నిర్వహిస్తారు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in
Published date : 24 Aug 2021 03:39PM

Photo Stories