Skip to main content

వస్త్ర రంగం... కొలువుల తరంగం !

ఆకట్టుకునేలా తమ వస్త్రాలుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా యువతరం.. నిరంతరం కొత్తదనం వైపు మొగ్గు చూపుతోంది! ఫలితంగా.. వస్త్ర రంగం భారీ స్థాయిలో విస్తరిస్తున్న వైనం! దాంతో దేశ టెక్స్‌టైల్‌ రంగం కొలువుల తరంగంగా మారుతోంది.

టెక్స్‌టైల్‌ టెక్నాలజీ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు మొదలు.. సంప్రదాయ చేతి వృత్తిగా భావిస్తున్న చేనేతల వరకు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. తాజాగా.. ప్రభుత్వ వర్గాలు పేర్కొన్న ప్రకారం– 2022 నాటికి వస్త్ర రంగంలో అందుబాటులోకి రానున్న కొలువుల సంఖ్య 17 మిలియన్లు. ఈ నేపథ్యంలో.. టెక్స్‌టైల్‌ రంగంలో ఉపాధికి మార్గాలు.. జాబ్‌ ప్రొఫైల్స్‌.. వేతనాలు.. అందుబాటులో ఉన్న కోర్సులపై ప్రత్యేక కథనం...
అధికారిక గణాంకాల ప్రకారం–టెక్స్‌టైల్, గార్మెంట్‌ రంగంలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉంది. జీడీపీలో చెప్పుకోదగ్గ వాటాతోపాట లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం ఇది. టెక్నాలజీ ప్రవేశంతో ప్రస్తుతం వస్త్ర రంగంలో నిపుణుల కొరత నెలకొంది. విస్తరిస్తున్న ఈ రంగంలో 2022నాటికి సుమారు 17 మిలియన్ల మంది అవసరమవుతారని అంచనా. కాబట్టి సంబంధిత నైపుణ్యాలు సొంతం చేసుకుంటే కొలువు ఖాయం.

ప్రొఫెషనల్‌ టు ట్రెడిషనల్‌ :
వస్త్ర రంగంలో.. టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న వారితోపాటు సంబం«ధిత నైపుణ్యాలున్న చేనేతల వరకు.. ప్రతి ఒక్కరికీ అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం టెక్స్‌టైల్, గార్మెంట్‌ పరిశ్రమలు టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. హ్యాండ్‌లూమ్‌ బదులు పవర్‌లూమ్‌ విధానాన్ని అవలంభిస్తున్నాయి. దీంతో చేనేతలకు పని నైపుణ్యం ఉన్నప్పటికీ.. పవర్‌లూమ్‌పై అవగాహన లేకపోవడంతో అవకాశాలు పొందలేకపోతున్నారు.

అండగా.. ఎన్‌ఎస్‌డీసీ
సంప్రదాయ చేనేతలకు ఆధునిక నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు.. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) అండగా నిలుస్తోంది. టెక్స్‌టైల్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ పేరుతో ప్రత్యేక కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు నెలకొల్పింది. రెండు నెలల నుంచి ఆరు నెలల వ్యవధిలో ఉండే ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే టెక్స్‌టైల్‌ పరిశ్రమల్లో పవర్‌లూమ్‌ వీవర్స్‌గా నెలకు రూ.పదివేల నుంచి రూ.12వేల వేతనంతో ఉపాధి పొందే అవకాశముంది. ఇటీవల కాలంలో ఈ రంగంలోని పరిశ్రమలు సైతం ప్రభుత్వ విభాగాలతో అవగాహన ఒప్పందాల ద్వారా నిరుద్యోగులకు శిక్షణనిస్తున్నాయి. 2020 నాటికి సమర్థ్‌ స్కీమ్‌ పేరిట 9 లక్షల మందికి.. మరో లక్ష మందికి సంప్రదాయ విభాగాల్లో వ్యవస్థీకృత టెక్స్‌టైల్‌ రంగంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా మొత్తం పది లక్షల మందికి శిక్షణనిచ్చేలా టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది.

టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు..
ప్రస్తుతం గార్మెంట్‌ రంగంలో విస్తరిస్తున్న ఆధునిక టెక్నాలజీ వినియోగం కారణంగా టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. ముఖ్యంగా ప్రీ ప్రొడక్షన్‌ (రా మెటీరియల్‌ సేకరణ, కెమికల్‌ ప్రాసెసింగ్, డిజైన్‌ తదితర) విభాగాల్లో.. టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ వంటి కోర్సులు పూర్తి చేసుకున్న వారి కోసం కంపెనీలు.. క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాయి. వస్త్ర రంగంలో 40 శాతం మేరకు టెక్నికల్‌ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు ఉండటం గమనార్హం. ఆయా టెక్నికల్‌ నిపుణులకు సంస్థను బట్టి నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు వేతనం లభిస్తోంది.

డిజైన్‌ నిపుణులు.. హాట్‌ కేక్స్‌
టెక్స్‌టైల్‌ రంగంలో ప్రస్తుతం డిజైన్‌ నిపుణులకు బాగా డిమాండ్‌ నెలకొంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను డిజైన్‌ చేయడం కంపెనీలకు చాలా అవసరం. ఎందుకంటే.. మార్కెట్లో మనుగడ సాగించేందుకు వస్త్రాల నాణ్యతతోపాటు డిజైన్‌ అత్యంత ప్రధానం. దాంతో ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో.. డిజైన్‌ స్పెషలైజేషన్‌ చేసిన అభ్యర్థులకు సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. నిఫ్ట్, ఎన్‌ఐడీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో.. టాప్‌ కంపెనీలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహిస్తూ డిజైన్‌ ఇంజనీర్స్‌కు కొలువులు అందిస్తున్నాయి.. నైపుణ్యాలుంటే ప్రారంభంలోనే రూ.పది లక్షల వరకు వార్షిక వేతనం అందించేందుకు సైతం సంస్థలు వెనుకాడటం లేదు.

ఆటోమేషన్‌ ఉద్యోగాలు.. ఇవే
ఆటోమేషన్‌.. టెక్స్‌టైల్‌ రంగంలోనూ ప్రవేశించింది. ఫలితంగా 3డి గార్మెంట్‌ డిజైన్‌ ఇంజనీర్స్, రోబోటిక్‌ హ్యాండ్లింగ్‌ డివైజ్‌ ఎక్స్‌పర్ట్స్, ఆటోమేటిక్‌ ఫోల్డింగ్‌ మెషీన్స్‌–ఆపరేటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ వంటి ఉద్యోగాలు లభించనున్నాయి. పలు ఆటోమేషన్‌ ఉద్యోగాలు...

  • ఆటోమేటిక్‌ స్యూయింగ్‌ బోట్స్‌: ముందుగానే నిర్దేశించిన ప్రోగ్రామింగ్‌ ఆధారంగా కుట్టు పని చేసే రోబోల వినియోగాన్ని పలు పరిశ్రమలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి.
  • ఐటీ ప్రాసెస్‌ ఇంజనీర్‌: టెక్స్‌టైల్‌ డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్‌ విభాగాలను ఐటీ ఆధారిత టూల్స్‌ వినియోగంతో అనుసంధానం చేయడం వీరి విధులు.
  • పీఎల్‌సీ మెయింటనెన్స్‌ స్పెషలిస్ట్‌: సంప్రదాయ కుట్టు మెషీన్లను, పీఎల్‌సీ(ప్రోగ్రామబుల్‌ లాజిక్‌ కంట్రోలర్‌) ఆధారంగా అప్పటికే నిర్దేశించిన ప్రోగ్రామ్‌ ద్వారా పని చేసేలా చూస్తారు.
  • అపరెల్‌ డేటా అనలిస్ట్‌/సైంటిస్ట్‌: ప్లాంట్‌ కార్యకలాపాలను ఆటంకం లేకుండా నిర్వహించేందుకు ఉత్పత్తి ప్రక్రియలోని పలు విభాగాలకు సంబంధించిన డేటాను వినియోగించడం, విశ్లేషించడం.. దాని ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించడం. అదే విధంగా వినియోగదారుల అభిరుచిని గుర్తిస్తూ దానికి అనుగుణంగా కొత్త డిజైన్ల ఆవశ్యకతను విశ్లేషించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
  • ఈ–టెక్స్‌టైల్‌ స్పెషలిస్ట్స్‌: స్మార్ట్‌ టెక్స్‌టైల్స్‌ విధానాన్ని అనుసరించడంలో భాగంగా ఫ్యాబ్రిక్‌ స్పిన్నింగ్‌లో సెన్సార్స్‌ను అమర్చగలిగే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ స్పెషలైజ్డ్‌ ఐఓటీ ఆధారిత ఉద్యోగాలు మన దేశంలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఈ కొలువులు సొంతం చేసుకున్న వారికి ప్రారంభంలోనే రూ.15 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుందని అంచనా.
ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్‌..
  • మర్కండైజర్‌: మార్కెటింగ్‌ తరహా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
  • ప్రొక్యూర్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌: ఒక సంస్థలో ఉత్పత్తి చేసే గార్మెంట్స్‌కు సంబంధించిన ముడి పదార్థాలను సేకరించడం ప్రధాన విధులు.
  • సప్లై చైన్‌ మేనేజర్స్‌/ఎగ్జిక్యూటివ్స్‌: ఉత్పత్తి చేసిన వాటిని రిటైల్‌ ఔట్‌లెట్స్‌కు చేరే విధంగా డిస్ట్రిబ్యూటర్స్, లాజిస్టిక్‌ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
  • కెమికల్‌ ప్రాసెస్‌ ఇంజనీర్స్‌: గార్మెంట్‌ తయారీ క్రమంలో.. రసాయనాల వినియోగం, కలర్స్‌ మిక్సింగ్‌ వంటి అంశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
    • ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు ఎంట్రీ లెవల్‌లో సంస్థను బట్టి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. రెండు, మూడేళ్ల అనుభవంతో రూ.పది లక్షల వరకు వేతనం పొందే అవకాశముంది.

బ్లూకాలర్‌ జాబ్స్‌ :
హెల్పర్, –ఫ్యాబ్రిక్‌ కట్టర్, –ప్యాకర్, –ప్రెస్సర్, –ఫినిషర్, –స్యూయింగ్‌ మెషీన్‌ ఆపరేటర్‌... ఈ రంగంలో ఈ కొలువులను కింది స్థాయి ఉద్యోగాలుగా పేర్కొంటారు. వీరికి నెలకు రూ.పది వేల నుంచి రూ.12వేల వరకు వేతనం లభిస్తోంది. ఈ విధులకు సంబంధించిన నైపుణ్యాలు పొందేందుకు ఎన్‌ఎస్‌డీసీ, ఎంఎస్‌ఎంఈ వంటి సంస్థలు స్వల్పకాలిక శిక్షణ అందిస్తున్నాయి.

టెక్స్‌టైల్‌ కోర్సులను అందిస్తున్న పలు ఇన్‌స్టిట్యూట్‌లు..
1. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ –ముంబై
2. ఐఐటీ–ఢిల్లీ
3. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ
4. ఎన్‌ఐటీ–జలంధర్‌
5. యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై
6. యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఉస్మానియా యూనివర్సిటీ
7. యూపీ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ – కాన్పూర్‌
8. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జ్యూట్‌ టెక్నాలజీ – కోల్‌కత

టెక్స్‌టైల్‌ రంగం.. ముఖ్యాంశాలు

  • వస్త్ర రంగంలో ప్రస్తుతం 45 మిలియన్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి.
  • ఎన్‌ఎస్‌డీసీ, ఎంఎస్‌ఎంఈ అందించే శిక్షణ పూర్తి చేసుకుంటే బ్లూ కాలర్‌ జాబ్స్‌.
  • బీటెక్‌లో టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, అపరెల్‌ డిజైనింగ్‌ వంటి కోర్సులు చదివితేæ... ఎంట్రీ లెవల్‌లో రూ.6లక్షల నుంచి రూ. 8 లక్షల వార్షిక వేతనం.
  • డిజైన్‌ నిపుణుల కోసం నిఫ్ట్, ఎన్‌ఐడీ వంటి ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్‌.
  • 2022 నాటికి కొత్తగా 17 మిలియన్ల మందికి ఉపాధి.
  • ఐఓటీ, ఆటోమేషన్‌ ప్రవేశంతో ప్రాసెస్‌ ఇంజనీర్, ఈ–టెక్స్‌టైల్‌ ఇంజనీర్స్, 3డి డిజైన్‌ ఇంజనీర్స్‌ వంటి కొత్త ఉద్యోగాలు.
విస్తృత అవకాశాలు...
ప్రస్తుతం టెక్స్‌టైల్‌ రంగంలో అవకాశాలు విస్తృతమని చెప్పొచ్చు. ఈ కొలువులను సొంతం చేసుకోవాలనుకుంటే.. వ్యక్తిగత ఆసక్తి ముఖ్యం. లేటెస్ట్‌ లైఫ్‌ స్టయిల్స్‌ను నిరంతరం గమనించే నైపుణ్యం ఉండాలి. ఐటీ నైపుణ్యాలు కూడా సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. సంబం«ధిత కోర్సులు పూర్తి చేసిన వారికి నూటికి నూరు శాతం క్యాంపస్‌లోనే కొలువులు లభిస్తున్నాయి.
– ప్రొఫెసర్‌ మట్టెగుంట రామ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఎన్‌ఐడీ–విజయవాడ.
Published date : 22 Feb 2019 06:53PM

Photo Stories