విదేశీ విద్యకు వెళ్లాలా.. వద్దా.. మీమాంసలో భారతీయ విద్యార్థులు..!
కరోనా కారణంగా విదేశీ విద్య ఆశలపై సందిగ్ధత నెలకొంది! చాలామంది విద్యార్థులు ముందుకెళ్లడమా.. వాయిదా వేయడమా.. అనే డైలమాలో ఉన్నారు. మరోవైపు విదేశీ యూనివర్సిటీలు మాత్రం.. వినూత్న విధానాలను అనుసరిస్తూ విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దరఖాస్తు నుంచి అడ్మిషన్ ఆఫర్ వరకూ.. అంతా ఆన్‌లైన్ మార్గాన్ని అనుసరిస్తున్నాయి. అంతేకాకుండా ప్రవేశం ఖరారైన విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్, హైబ్రిడ్ విధానంలో బోధన అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్‌పై కరోనా ప్రభావం.. విదేశీ వర్సిటీలు అనుసరిస్తున్న విధానాలు.. విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం..
విదేశాల్లో చదువుల కోసం వెళ్లాలంటే.. దరఖాస్తు నుంచి అడ్మిషన్ పొందే వరకూ.. ఎంతో సుదీర్ఘ ప్రక్రియ.. ఎన్నో వ్యయ ప్రయాసలు! ఇప్పుడు కరోనా పరిణామాలతో ఈ మొత్తం ప్రక్రియను కొంత సరళంగా మార్చేలా విదేశీ వర్సిటీలు ఆన్‌లైన్ బాట పడుతున్నాయి. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూనే.. తగిన జాగ్రత్తలు పాటిస్తూ అడుగులు వేయాలి అంటున్నారు నిపుణులు.
అంతా ఆన్‌లైన్..
ప్రస్తుతం దాదాపు అన్ని దేశాలకు చెందిన యూనివర్సిటీలు.. అప్లికేషన్ నుంచి అడ్మిషన్ వరకూ.. అంతా ఆన్‌లైన్ విధానం అనుసరిస్తున్నాయి. వాస్తవానికి ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం గతంలోనే ఉంది. కాని తాజాగా అడ్మిషన్ లెటర్లు సైతం ఆన్‌లైన్‌లో ఇవ్వడం, వాటికి ఆన్‌లైన్‌లోనే ఆమోదం తెలిపే అవకాశం కల్పించడం విద్యార్థులకు మేలు చేసే అంశమే. ప్రొవిజనల్ అడ్మిషన్ పేరుతో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.
రిమోట్ లెర్నింగ్..
కరోనా కారణంగా పలు దేశాలు ప్రయాణాలపై నిషేధం విధించాయి. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి, కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉన్న వారికి మాత్రమే తమ దేశంలో ప్రవేశించేందుకు అనుమతిస్తున్నాయి. దాంతో యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ తదితర దేశాల్లోని యూనివర్సిటీలు.. ప్రొవిజనల్ అడ్మిషన్ ఖరారు చేసి.. ఆన్‌లైన్ తరగతుల ద్వారా బోధన సాగిస్తున్నాయి. ఇలాంటి అవకాశం పొందిన విద్యార్థులు తాము వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లు రుజువు చూపించాలని కోరుతున్నాయి. పరిస్థితులు మెరుగై వీసా మంజూరైన తర్వాత సదరు క్యాంపస్‌లో ప్రత్యక్ష తరగతులకు హాజరవ్వచ్చని పేర్కొంటున్నాయి.
హైబ్రీడ్ మోడల్..
ప్రస్తుతం విదేశీ విద్య బోధన పరంగా ఆయా వర్సిటీలు అనుసరిస్తున్న మరో వినూత్న విధానం.. హైబ్రీడ్ మోడల్! అంటే.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సమ్మిళితంగా ఉండే విద్యా బోధన. గత ఏడాది ప్రవేశం పొంది ప్రత్యక్ష తరగతులకు హాజరై, సెలవుల్లో స్వదేశాలకు వెళ్లి.. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ సదరు యూనివర్సిటీకి రాలేని విద్యార్థులకు ఆన్‌లైన్ విధానంలో బోధిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశం ఖరారు చేసుకున్న వారికి కూడా ఈ హైబ్రీడ్ మోడల్‌ను కొనసాగించాలని భావిస్తున్నాయి. ప్రవేశం ఖరారు చేసుకున్న విద్యారులకు తమ ఇన్‌స్టిట్యూట్‌లో అడుగు పెట్టేందుకు అనుమతి లభించే వరకు ఆన్‌లైన్ విధానంలో.. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లో తరగతులు బోధించనున్నాయి.
డిజిటల్ సదుపాయాలు..
ఆన్‌లైన్ బోధన దృష్ట్యా విదేశీ యూనివర్సిటీలు.. విద్యార్థుల కోసం డిజిటల్ సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. సిలబస్ అంశాలు, సంబంధిత పుస్తకాల అధ్యయనం కోసం డిజిటల్ లైబ్రరీ సదుపాయాన్ని, వర్చువల్ లేబొరేటరీస్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అంతేకాకుండా తమ ఇన్‌స్టిట్యూట్‌ల ఫ్యాకల్టీతో విద్యార్థులు ఇంటరాక్ట్ అయ్యేందుకు వీలుగా ప్రత్యేకంగా ఆన్‌లైన్ గ్రూప్స్‌ను ఏర్పాటుచేస్తున్నాయి. విద్యార్థులు లైవ్ లెక్చర్స్, ప్రీ–రికార్డెడ్ లెక్చర్స్ వినే సదుపాయాన్ని సైతం కల్పిస్తున్నాయి. టైమ్ జోన్స్ పరంగా వ్యత్యాసం ఉండే దేశాల విద్యార్థులకు ఇది కొంత కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. వీలైనంత వరకు ఆన్‌లైన్ లైవ్ లెక్చర్‌్ొకు హాజరుకావాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకా చదవండి : part 2: కరోనా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని.. పలు యూనివర్సిటీల రాయితీలు, మినహాయింపులు..