Skip to main content

విదేశీ భాషలతో సువర్ణావకాశాలు...

‘ఇంటర్మీడియెట్ పూర్తయింది. ఇంజనీరింగ్, మెడిసిన్ లక్ష్యం చేజారింది’.. అయినా కంగారు వద్దు. ఆసక్తి ఉంటే.. విదేశీ భాషలతో విలువైన కెరీర్‌ను అందుకోవచ్చు. బ్యాచిలర్, పీజీ కోర్సులు పూర్తిచేయడం ద్వారా కార్పొరేట్ కొలువులూ సొంతం చేసుకోవచ్చు.
టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌‌, కమ్యూనికేషన్ .. నేటి ప్రపంచీకరణ యుగాన్ని నడిపిస్తున్నాయి. ఈ మూడింటిలో కీలకమైన కమ్యూనికేషన్‌కు లాంగ్వేజ్ (భాష) ముఖ్యం. అనుసంధాన భాషగా ఇంగ్లిష్ ఉన్నప్పటికీ.. బ్రిక్స్, జీ20, ఆసియాన్ తదితర అంతర్జాతీయ కూటముల కార్యకలాపాలు విస్తరిస్తుండటంతో విదేశీ భాషలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా, జపాన్, భారత్, ఐరోపా, కొరియాల పాత్ర విస్తృతం కావడంతో పాటు ప్రపంచ వాణిజ్య విస్తరణ కారణంగా ఆయా భాషల్లో నైపుణ్యమున్న వారికి జాబ్ మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతోంది.

డిమాండ్ ఎందుకు?
  1. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో నియామకాలకు ఇంగ్లిష్‌తోపాటు ఏదైనా విదేశీ భాష వచ్చి ఉండటం అదనపు అర్హతగా మారుతోంది. తమ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు చేరువచేయడంలో ఫారెన్ లాంగ్వేజ్ ప్రయోజనకారి అవుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. విదేశీ వాణిజ్య భాగస్వామి తన సొంత భాషలో (సంస్థ/క్లయింట్) రాసి పంపిన పత్రాలను వెంటనే అర్థం చేసుకోవడం అనేది పోటీ ప్రపంచంలో ఇతరుల కంటే ఒక అడుగు ముందుంచుతుందని కంపెనీలు నమ్ముతున్నాయి. అందుకే తమ ఉద్యోగులకు విదేశీ భాషలు తెలిసుండాలని కోరుకుంటున్నాయి. దాంతో అరబిక్, ఫ్రెంచ్, జర్మన్ , స్పానిష్, చైనీస్, రష్యన్ తదితర భాషా నిపుణులకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.
  2. కంపెనీలు ఆయా మార్కెట్లను బట్టి స్థానిక భాషలోనే కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తుండటం కూడా విదేశీభాషా నిపుణులకు డిమాండ్ పెరగడానికి మరో కారణంగా చెప్పొచ్చు. ఉదాహరణకు ఓ చైనా కంపెనీ.. జర్మనీలో తన ఉత్పత్తులను అమ్మాలనుకుంటే.. అక్కడి స్థానిక భాషైన జర్మన్‌లోనే మార్కెటింగ్, ప్రమోషన్, అడ్వర్‌టైజింగ్ వంటివి నిర్వహించాలని భావిస్తోంది. అలాగే జర్మనీ కంపెనీ.. చైనాలో తన ఉత్పత్తులు అమ్మాలనుకున్నా.. స్థానిక చైనా భాషలోనే ప్రచారం చేస్తుంది.
  3. విదేశీ భాష వచ్చి ఉంటే... సదరు సిబ్బందిని కంపెనీ వ్యాపార కార్యకలాపాల కోసం ఒక దేశం నుంచి మరో దేశానికి బదిలీ చేయడం తేలిక. అందుకే అభ్యర్థులకు విదేశీ భాషను అనువాదం చేయడం వంటి నైపుణ్యాలేకాకుండా.. విదేశీ భాషలో క్లయింట్‌తో సంభాషించే స్కిల్స్ ఉండాలని కంపెనీలు కోరుతున్నాయి. ఒకే జాబ్ కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకుంటే... వారిలో విదేశీ భాష వచ్చిన అభ్యర్థిని నియమించుకునే అవకాశాలే ఎక్కువ.
  4. విభిన్న రంగాల్లోని కంపెనీలు.. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగులకు విదేశీ భాషా నైపుణ్యాలు ఉండాలని కోరుకుంటున్నాయి. మొత్తం ఖాళీల్లో మూడింట ఒక వంతు మార్కెటింగ్, సేల్స్‌లో ఉంటే... ఆ తర్వాత ఐటీ, టెక్నాలజీ, ఫైనాన్స్, బీపీఓ, కేపీవో, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఖాళీల సంఖ్య ఎక్కువగా ఉంది. దాంతో విదేశీ భాషలు వచ్చిన వారికి మంచి డిమాండ్ ఏర్పడింది.
  5. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో కార్పొరేట్ సంస్థలు అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండటం.. ఇతర దేశాల్లోనూ శాఖలు ఏర్పాటుచేస్తుండటం తెలిసిందే. ఇదే ఇప్పుడు విదేశీ భాషల్లో నైపుణ్యం పొందిన వారికి సువర్ణావకాశంగా మారింది. ఇతర దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు.. ఆ దేశంలో అధికారిక భాషలో రూపొందించే డాక్యుమెంట్లను తమ దేశ భాషలోకి అనువదించి నివేదికలు రాయగలిగే నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. ఐటీ కంపెనీలు సైతం తాము నియామకాలు చేపట్టే సమయంలో ఇంగ్లిష్‌తోపాటు మరో ఫారెన్ లాంగ్వేజ్ నైపుణ్యమున్న వారికి ప్రాధాన్యమిస్తున్నాయి.
ఎనిమిది విదేశీ భాషలకు డిమాండ్ ...
ప్రముఖ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ సర్వీసెస్ సంస్థ టీఆర్‌ఐడీ ఇండియా.. విడుదల చేసిన నివేదిక ప్రకారం 2017-18లో ప్రధానంగా ఎనిమిది విదేశీ భాషలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. అవి..
1. మాండరిన్ (చైనా అధికార భాష)
2. అరబిక్
3. స్పానిష్
4. జర్మన్
5. పోర్చుగీస్
6. రష్యన్
7. ఫ్రెంచ్
8. జపనీస్

తెలుగు రాష్ట్రాల్లో కోర్సులు :
తెలుగు రాష్ట్రాల్లో హెచ్‌సీయూ, ఇఫ్లూ, ఉస్మానియా వంటి ప్రముఖ యూనివర్సిటీలతోపాటు జర్మన్ గొయెత్ వంటి ఇన్‌స్టిట్యూట్‌లు ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులను అందిస్తున్నాయి. డిగ్రీ స్థాయిలో సంబంధిత భాషా సాహిత్యం, ఫొనెటిక్స్, క్లాసికాలజీ, ట్రాన్స్లేషన్, దేశ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తారు. సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా తదితర కోర్సుల సిలబస్‌లో నిర్ణీత లాంగ్వేజ్, ఇంగ్లిష్‌లపైనే ఎక్కువ దృష్టిసారిస్తారు. ఆయా దేశాల పరిస్థితులపై అవగాహన కలిగేలా మరికొన్ని సబ్జెక్టులు బోధిస్తారు.

కెరీర్ అవకాశాలు...
ఫారెన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు కెరీర్ అవకాశాలు విస్తృతం. ట్రాన్స్లేటర్స్, ఇంటర్‌ప్రిటేటర్స్, డీకోడర్స్, టెక్నికల్ రైటర్స్, కంటెంట్ రైటర్స్, టూర్ ఆపరేటర్స్, ఫ్యాకల్టీ వంటి ఉపాధి మార్గాలు అందుకోవచ్చు. వివిధ ఐటీ కంపెనీలు, మీడియా, పార్లమెంట్, బోధన, పరిశ్రమలు, కార్పొరేట్ హౌసెస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, పబ్లిషింగ్ హౌస్‌లు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ రాయబార కార్యాలయాల్లో అవకాశాలు ఉంటాయి.

ప్రధాన ఉపాధి వేదికలు
  • హాస్పిటాలిటీ రంగం
  • టూరిజం రంగం
  • ఫార్మాస్యూటికల్ సంస్థలు
  • వివిధ దేశాల రాయబార కార్యాలయాలు
  • ఐటీ-బీపీవో సంస్థలు
  • ఎగుమతి-దిగుమతి సంస్థలు

వేతనాలు ఆకర్షణీయం :
  • ఐటీ కంపెనీలు మొదలు సేవల రంగ సంస్థలు, బ్యాంకింగ్, ఈ-కామర్స్, టూరిజం వంటి సంస్థల్లో కెరీర్ అవకాశాలు ప్రస్తుతం పుష్కలమని చెప్పొచ్చు.
  • గతేడాది జేఎన్‌యూలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్గొన్న అమెజాన్, డెలాయిట్ తదితర సంస్థలు ఫ్రెంచ్, జపనీస్ లాంగ్వేజ్ గ్రాడ్యుయేట్లను రూ.8 లక్షల వార్షిక వేతనంతో నియమించుకున్నాయి.
  • ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తే.. సంబంధిత భాషలో పూర్తిస్థాయి బ్యాచిలర్ డిగ్రీ కోర్సు పూర్తిచేసుకున్న వారికి నెలకు రూ.40వేల వరకు వేతనం లభిస్తోంది. ముఖ్యంగా స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్ లాంగ్వేజ్ సర్టిఫైడ్ అభ్యర్థులకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది.
  • ఫారెన్ లాంగ్వేజెస్‌లో పీజీ, పీహెచ్‌డీ చేసిన వారికి ప్రముఖ స్కూల్స్, ఇన్‌‌‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో ట్రైనర్స్‌గానూ అవకాశాలు లభిస్తాయి. సదరు లాంగ్వేజ్‌కు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి నెలకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు వేతనం అందుతుంది.

స్వయం ఉపాధి :
 ఫారెన్ లాంగ్వేజెస్‌లో నైపుణ్యాలు పొందిన అభ్యర్థులు ఫ్రీలాన్సింగ్ విధానంలోనూ ఆదాయం పొందొచ్చు. వీరికి ప్రధానంగా ఫార్మాస్యుటికల్ సంస్థలు, టూరిజం సంస్థల్లో అనువాదకులుగా (రిటెన్ అండ్ స్పోకెన్) అవకాశాలు లభిస్తాయి. రిటెన్, ట్రాన్స్లేషన్ పరంగా పద పరిమితి ఆధారంగా ఒక పదానికి రెండు నుంచి మూడు రూపాయలు లభిస్తాయి. స్పోకెన్ ట్రాన్స్లేషన్ పరంగా పని గంటల ఆధారంగా కొన్ని ప్రముఖ టూరిజం సంస్థలు గంటకు రూ.వెయ్యి వరకు అందిస్తున్నాయి.
 
 భాష-  కోర్సు అందిస్తున్న సంస్థలు :
 స్పానిష్ :
 20 దేశాల్లో అధికార భాష.. స్పానిష్. ఈయూ, యూఎన్‌ఓ వంటి సంస్థల్లోనూ ఇది అధికారిక భాష. స్పానిష్ లిపి, శైలి.. దాదాపు ఇంగ్లిష్‌ను పోలి ఉంటుంది. అర్జెంటీనా, కొలంబియా తదితర దేశాలతో మన దేశానికి చెందిన సంస్థలు వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు చేసుకుని సంయుక్త కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీంతో సదరు సంస్థల్లో స్పానిష్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్ ఉంటోంది.
 కోర్సు అందిస్తున్న ప్రముఖ సంస్థలు..
 1.  స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చరల్ స్టడీస్, జేఎన్‌యూ.
 2.  ఐ.పి.కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ యూనివర్సిటీ. 
 3.  ఇఫ్లూ - హైదరాబాద్.
 4.  జవహర్‌లాల్ నెహ్రూ అకాడమీ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్.
 
 జపనీస్ :
 ప్రస్తుతం దేశంలో జపాన్‌కు చెందిన దాదాపు 250 సంస్థలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీలకు ఇంటర్‌ప్రిటేటర్స్, ట్రాన్స్లేటర్స్ అవసరం ఏర్పడుతోంది. జపాన్ ఇండియా కోఆపరేటివ్ ఏజెన్సీ (జైకా) ద్వారా జపాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు, భారత్‌లో జపాన్‌కు చెందిన కంపెనీలు జాయింట్ వెంచర్ విధానంలో పనులు చేపడుతుండటం కూడా జపనీస్ లాంగ్వేజ్ నిపుణులకు డిమాండ్ పెరగడానికి మరో కారణం. పలు సంస్థల అంచనాల ప్రకారం 2018 చివరి నాటికి జపనీస్ భాషలో నైపుణ్యాలున్న వారి అవసరం దాదాపు 50 వేల వరకు ఉంటుంది.
 కోర్సు అందిస్తున్న ప్రముఖ సంస్థలు..
 1.  జేఎన్‌యూ- న్యూఢిల్లీ 
 2. ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెరీర్ స్టడీస్ వైఎంసీఏ 
 3. ఢిల్లీ యూనివర్సిటీ
 4.  ఇఫ్లూ -హైదరాబాద్.
 
 జర్మన్ :
 ఈ భాషను నేర్చుకోవడం కొంత కష్టమే. శిక్షణ పరంగా.. లెవల్ ఎ1, ఎ2, బి1, బి2, సి1, సి2 విధానం అమల్లో ఉంది. వీటిలో పొందిన నైపుణ్యం ఆధారంగా ట్రాన్స్‌లేటర్లు, ఇంటర్‌ప్రిటేటర్స్, డాక్యుమెంట్ రైటర్స్ వంటి అవకాశాలు ఖాయం. విదేశీ విద్య కోణంలోనూ.. జర్మనీలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్‌లో బేసిక్ నైపుణ్యాలు తప్పనిసరి. 
  కోర్సు అందిస్తున్న ప్రముఖ సంస్థలు..
 1.  ఇఫ్లూ, హైదరాబాద్ 
 2. గొయెత్ జర్మన్ 
 3. ఇన్‌లింగ్వా
 
 ఫ్రెంచ్ :
 ప్రపంచంలో దాదాపు 40 దేశాల్లో అధికార భాషగా పరిగణిస్తున్న లాంగ్వేజ్.. ఫ్రెంచ్. ఇంగ్లిష్‌లో వినియోగంలో ఉన్న 50 శాతం పదాలకు ఫ్రెంచ్ భాషే మూలం. కాబట్టి ఈ భాషను నేర్చుకోవడంలో పెద్దగా ఇబ్బంది ఉండదు.
 కోర్సు అందిస్తున్న ప్రముఖ సంస్థలు..
 1.  మిరండా హౌస్, ఢిల్లీ యూనివర్సిటీ.
 2.  జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.
 3.  ఇఫ్లూ- హైదరాబాద్.
 
చైనీస్ :
అంతర్జాతీయంగా 20 శాతం మందికిపైగా ప్రజలు మాట్లాడుతున్న భాష చైనీస్. ఈ భాషా నైపుణ్యాలతో ఎలక్ట్రానిక్స్, టూరిజం రంగంలో కెరీర్ అవకాశాలు ఖాయం.
 కోర్సు అందిస్తున్న ప్రముఖ సంస్థలు..
 1. జేఎన్‌యూ 
 2. ఢిల్లీ యూనివర్సిటీ 
 3. ఇండియా-చైనా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
 
 
అరబిక్ :
దాదాపు 22 దేశాల్లో అధికార భాషగా ఉన్న అరబిక్‌లో నైపుణ్యం ద్వారా  హాస్పిటాలిటీ, టూరిజం, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో అరబ్ దేశాలకు చెందిన సంస్థల్లో కెరీర్ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
 కోర్సు అందిస్తున్న ప్రముఖ సంస్థలు..
 1. జామియా మిలియా యూనివర్సిటీ
 2. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ
 3. ఉస్మానియా యూనివర్సిటీ
 4. ఇఫ్లూ-హైదరాబాద్
 
రష్యన్ :
ప్రపంచంలో దాదాపు 160 మిలియన్ల జనాభా మాట్లాడే భాష.. రష్యన్. దీన్ని నేర్చుకోవడం కొంత కష్టమని చెప్పొచ్చు. నేర్చుకుంటే ముఖ్యంగా ట్రాన్స్‌లేషన్, వివిధ దేశాల్లోని రష్యన్‌ఎంబసీల్లో కెరీర్ ఖాయం.
కోర్సు అందిస్తున్న ప్రముఖ సంస్థలు..
 1. మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 
 2. యూనివర్సిటీ ఆఫ్ ముంబై
 3. ఇఫ్లూ-హైదరాబాద్   
 4. జేఎన్‌యూ-ఢిల్లీ.
Published date : 12 Jul 2018 02:55PM

Photo Stories