Skip to main content

ఊరించే కొత్త ఉద్యోగాలు...!

ఆటోమేషన్, ఐఓటీ, రోబోటిక్స్.. దూసుకొస్తున్న సరికొత్త టెక్నాలజీ! ఫలితంగా.. 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు సంభవిస్తాయని.. సంప్రదాయ కొలువుల స్థానంలో సరికొత్త ఉద్యోగాలు స్వాగతం పలుకుతాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.
 అంతర్జాతీయంగా కంపెనీల తయారీ విధానాల్లో రానున్న మార్పులు.. కనుమరుగుకానున్న కొలువులు.. కొత్తగా ఊరించే ఉద్యోగాలు.. రీస్కిల్లింగ్ తదితర అంశాలపై ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ‘డబ్ల్యూఈఎఫ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్-2018’ నివేదిక ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో... ఆటోమేషన్ ప్రభావం, సరికొత్త కొలువులు, పెంచుకోవాల్సిన నైపుణ్యాల గురించి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదికపై విశ్లేషణ....

ఆటోమేషన్, ఐఓటీ, రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్... నేటి నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాందిపలికాయి. అన్నిరంగాల్లో వాయువేగంతో విస్తరిస్తున్న ఈ టెక్నాలజీ ప్రభావం ఏంటి?! ఈ లేటెస్ట్ టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే పలు సర్వేలు అంచనావేశాయి. మరి భవిష్యత్తు ఉద్యోగాల మాటేమిటి; ప్రతికూల ప్రభావంతో కనుమరుగు కానున్న కొలువులు ఏవి.. కొత్తగా తెరపైకి వచ్చే ఉద్యోగాలు ఏంటి?.. ఇలా ఎన్నో సందేహాలు! ఈ ప్రశ్నలకు సమాధానంగా మారుతున్న టెక్నాలజీ.. తాజా జాబ్ మార్కెట్ ట్రెండ్స్.. లేటెస్ట్ స్కిల్స్‌పై ప్రపంచ ఆర్థిక సంస్థ(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్-2018ను తాజాగా విడుదల చేసింది. అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తోపాటు పలు దేశాల్లోని సంస్థలను సంప్రదించింది. 2018 నుంచి 2022 మధ్య కాలంలో టాప్-10 రంగాల్లో..కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు చూపుతున్న ఆసక్తి.. అందుబాటులోకి రానున్న కొత్త ఉద్యోగాలు.. కనుమరుగుకానున్న కొలువులపై ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

50 శాతం ఆటోమేషన్:
తాము సంప్రదించిన సంస్థల్లో 50 శాతం కంపెనీలు ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపాయని నివేదిక పేర్కొంది. దీనివల్ల కొన్ని ఉద్యోగాల్లో కోత పడుతుందని సంస్థలు స్పష్టం చేసినట్లు తెలిపింది. మరో 38 శాతం సంస్థలు కూడా ఇదే బాటలో పయనించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు 25శాతానికిపైగా సంస్థలు ఆటోమేషన్ ఫలితంగా తమ కంపెనీల్లో కొత్త ఉద్యోగాల కల్పనకు ఆవకాశమున్నట్లు పేర్కొనట్లు నివేదిక తేటతెల్లం చేసింది.

యంత్రాలతో పనులు..
2022 నాటికి కంపెనీల కార్యకలాపాల నిర్వహణలో.. ఇప్పటితో పోల్చితే మానవ ప్రమేయం తగ్గి, మెషీన్ల వినియోగం మరింత పెరుగుతుందని నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్పంచుకున్న 12రంగాల్లోని సంస్థలు.. ప్రస్తుతం 71శాతం కార్యకలాపాలు మానవ ప్రమేయంతోనే జరుగుతున్నాయి. 29శాతం పనులు మాత్రం యంత్రాల ఆధారంగా నిర్వహిస్తున్నాయి. 2022 నాటికి ఈ పరిస్థితిలో భారీగా మార్పు కనిపించనుంది. అప్పటికి మానవ ప్రమేయం 58 శాతానికి పరిమితమై.. మెషీన్ల వినియోగం 42శాతానికి పెరగనుంది.

ఆటోమేషన్ జాబ్స్..
నివేదిక ప్రకారం-మెషీన్లు, ఆటోమేషన్ ప్రభావమున్నా.. కొత్త ఉద్యోగాల సంఖ్య పెరగనుంది. అన్ని రంగాల్లోనూ 2022 నాటికి కొత్త టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాల సంఖ్య 11 శాతం వృద్ధి చెంది 27 శాతానికి చేరుకోనుంది. ఇదే సమయంలో కొన్ని సంప్రదాయ ఉద్యోగాల్లో పది శాతం తగ్గుదల నమోదు కానుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే చేసిన కంపెనీల్లో ప్రస్తుతం మొత్తం 15 మిలియన్ల మంది ఉద్యోగులు ఉండగా.. ఆటోమేషన్ ప్రభావంతో 0.98 మిలియన్ల ఉద్యోగాల్లో కోత పడ నుంది. 1.74మిలియన్ల కొత్త కొలువులు లభించనున్నాయి. ఇవన్నీ కూడా ఆటోమేషన్ ఆధారిత ఉద్యోగాలు కావడం గమనార్హం.

రీ-స్కిల్లింగ్ తప్పనిసరి :
కొత్త ఉద్యోగాలు అందిపుచ్చుకోవాలంటే.. రీ-స్కిల్లింగ్ తప్పనిసరని నివేదిక స్పష్టం చేసింది. సర్వే చేసిన కంపెనీల్లో 35 శాతం సంస్థలు రీ-స్కిల్లింగ్ అత్యవసరమని అభిప్రాయపడ్డాయి. ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో రీ-స్కిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్ పరంగా కంపెనీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. అలాగే కొత్త రిక్రూట్‌మెంట్స్ పరంగా నూతన సాంకేతిక నైపుణ్యాలున్న వారిని నియమించుకునేందుకే ఇష్టపడుతున్నాయి. ఇలాంటి నియామకాల సంఖ్య 2022 నాటికి రెట్టింపు కానుంది.

‘హ్యూమన్ స్కిల్స్’ ఆవశ్యకత :
నేటి ఆటోమేషన్, ఐఓటీ, రోబోటిక్ యుగంలోనూ.. విధి నిర్వహణ పరంగా ఉద్యోగుల్లో హ్యూమన్ స్కిల్స్ ఆవశ్యకత కొనసాగనుందని సంస్థలు స్పష్టం చేశాయి. క్రియేటివిటీ, చొరవ, క్రిటికల్ థింకింగ్, సహనం, నెగోషియేషన్ స్కిల్స్ అవసరం మరింత పెరుగుతుందని తెలిపాయి. అదే విధంగా ఫ్లెక్సిబిలిటీ, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, నాయకత్వం, సామాజిక ప్రభావం, సేవా దృక్పథం నైపుణ్యాలకు డిమాండ్ మరింత పెరగనుంది.

2022 నాటికి అవసరమయ్యే కొత్త స్కిల్స్...
  • అనలిటికల్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్
  • యాక్టివ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్
  • క్రియేటివిటీ, ఒరిజినాలిటీ, ఇనీషియేటివ్
  • టెక్నాలజీ డిజైన్ అండ్ ప్రోగ్రామింగ్
  • క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్
  • కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్
  • లీడర్‌షిప్ అండ్ సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్
  • ఎమోషనల్ ఇంటెలిజెన్స్
  • రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఐడియేషన్
  • సిస్టమ్స్ అనాలిసిస్ అండ్ ఎవాల్యుయేషన్
నైపుణ్యాలు.. నియామకాలు
కొత్త టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్న వారికి శాశ్వత నియామకాలు ఆఫర్ చేస్తామని భారత్‌లోని 78 శాతం సంస్థలు పేర్కొనడం విశేషం. ఇదే సమయంలో ఇప్పటికే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తామని 70 శాతం సంస్థలు తెలిపాయి. 62శాతం సంస్థలు కొత్త నైపుణ్యాలున్న వారికి తాత్కాలిక విధానంలో నియమిస్తామని పేర్కొన్నాయి. సంస్థలు తమ కార్యకలాపాల్లో కొత్త నైపుణ్యాలను ప్రవేశ పెట్టేందుకు ఔట్‌సోర్సింగ్, ఫ్రీలాన్సింగ్ విధానాలవైపు మొగ్గు చూపడం ఆసక్తికరం. 56శాతం సంస్థలు ఫ్రీలాన్సర్స్‌ను నియమించుకుంటామని, 67శాతం సంస్థలు కొత్త టెక్నాలజీలు అందించేందుకు ఔట్ సోర్సింగ్ విధానంపై ఆధారపడతామని పేర్కొన్నాయి.

కనుమరుగుకానున్న కొలువులు...
  • డేటా ఎంట్రీ క్లర్క్స్
  • అకౌంటింగ్, బుక్ కీపింగ్, పే రోల్ క్లర్క్స్
  • అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీస్
  • అసెంబ్లీ అండ్ ఫ్యాక్టరీ వర్కర్స్
  • క్లయింట్ ఇన్ఫర్మేషన్ అండ్ కస్టమర్ సర్వీస్ వర్కర్స్
  • బిజినెస్ సర్వీసెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్స్
  • అకౌంటెంట్స్ అండ్ ఆడిటర్స్
  • మెటీరియల్ రీ-కోడింగ్ అండ్ స్టాక్ కీపింగ్ క్లర్క్స్
  • జనరల్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్స్
  • పోస్టల్ సర్వీస్ క్లర్క్స్
  • మెషీన్స్ అండ్ మెషినరీ రిపెయిరర్స్
  • టెలి మార్కెటర్స్
  • ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇన్‌స్టాలర్స్ అండ్ రిపెయిరర్స్
  • బ్యాంక్ టెల్లార్స్ అండ్ రిలేటెడ్ క్లర్క్స్
  • కార్, వ్యాన్, మోటార్ సైకిల్ డ్రైవర్స్
  • సేల్స్ అండ్ పర్చేజింగ్ ఏజెంట్స్ అండ్ బ్రోకర్స్
  • డోర్ టు డోర్ సేల్స్ వర్కర్స్, న్యూస్ అండ్ స్ట్రీట్ వెండార్స్
  • స్టాటిస్టికల్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ క్లర్క్స్
ఈ జాబ్ రోల్స్‌కే డిమాండ్...
డబ్ల్యూఈఎఫ్ ఫ్యూచర్ జాబ్ రిపోర్ట్-2018 ప్రకారం.. 2022 నాటికి ప్రాధాన్యం సంతరించుకోనున్న జాబ్ రోల్స్‌ను నిర్దిష్టంగా పేర్కొంది. అవి..
  • డేటా అనాలిసిస్ అండ్ సైంటిస్ట్స్
  • సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్ డెవలపర్స్
  • ఈ-కామర్స్ అండ్ సోషల్ మీడియా స్పెషలిస్ట్స్
  • ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్ట్స్
  • బిగ్ డేటా స్పెషలిస్ట్స్
  • ప్రాసెస్ ఆటోమేషన్ స్పెషలిస్ట్స్
  • ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్స్
  • యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ హ్యూమన్-మెషీన్ డిజైనర్స్
  • రోబోటిక్ ఇంజనీర్స్
  • బ్లాక్ చైన్ స్పెషలిస్ట్

మూడు, నాలుగేళ్ల నుంచేకొత్త టెక్నాలజీల దిశగా..

 సంస్థలు గత మూడు, నాలుగేళ్ల నుంచే కొత్త టెక్నాలజీల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వాటి ద్వారా తమ సేవలను భారీ స్థాయిలో విస్తరిస్తున్నాయి. డబ్ల్యూఈఎఫ్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. రానున్న రోజుల్లో మరిన్ని సాంకేతిక అంశాలు సంస్థల కార్యకలాపాల్లో రానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు అందుకు అవసరమైన నైపుణ్యాలను సొంతం చేసుకోవడానికి ఇప్పటి నుంచే కృషి చేయాలి.
 -బాబు మునగాల,సీఈఓ,  జెబీ బ్లాక్ చైన్ సొల్యూషన్స్
 
 అకడమిక్ స్థాయిలోనే మార్పులు :
 ప్రస్తుతం అంతటా వినిపిస్తున్న ఆటోమేషన్, రోబోటిక్స్ టెక్నాలజీల నేపథ్యంలో యువత కొత్త ఉద్యోగాలు, సాంకేతికతలకు అనుగుణంగా జాబ్ మార్కెట్‌లో అడుగుపెట్టాలంటే.. అకడమిక్‌గా కరిక్యులంలో మార్పులు చేయాల్సిన అవసరముంది. అదే సమయంలో విద్యార్థులు సొంత అన్వేషణ ద్వారా నూతన నైపుణ్యాలు పొందేందుకు శిక్షణ తీసుకోవాలి.  
- ఆకాశ్ సేథి,ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, క్వెస్ట్ అలియన్స్
Published date : 12 Oct 2018 05:06PM

Photo Stories