Skip to main content

ఉపాధి గమ్యానికి నైపుణ్యాల నావ!

నడుస్తున్న కాలంలో సింహభాగం ‘నైపుణ్యం’పైనే చర్చ జరుగుతోంది. చేతిలో డిగ్రీ, పీజీ పట్టాలు ఎన్నున్నా.. ‘నైపుణ్యాలు’ గుండుసున్నా కావడంతో అధిక శాతం యువతకు అవకాశాలు ఎండమావిగా మిగులుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నైపుణ్యాభివృద్ధిపైనే దేశ సత్వర అభివృద్ధి, పోటీతత్వం, సామాజిక స్థిరత్వం ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పోటీని తట్టుకుని నిలవాలంటే.. కంపెనీలు/సంస్థలు ప్రమాణాలకు అనుగుణంగా వస్తు, సేవలను అందించాల్సి ఉంది. ఈ తరుణంలో సుశిక్షితులైన, నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ ఏర్పడింది. అందుకే విద్యావంతులైన యువతలో మార్కెట్‌కు సరిపడా స్కిల్స్ పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్కిల్ డెవలప్‌మెంట్’కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, నైపుణ్యాల అభివృద్ధి సంస్థల ఏర్పాటు, కేటాయింపులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో వివిధ అంశాల్లో నైపుణ్యాలను అందించే విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. వివరాలు...

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్:
జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేశారు. ఇది ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో వివిధ కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎన్‌ఎస్‌డీసీ సహకారంతో హైదరాబాద్‌లో నడుస్తున్న కేంద్రాల్లో 21 అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. 30 రోజుల నుంచి 75 రోజుల వరకు శిక్షణ ఇస్తారు. కోర్సును బట్టి ఫీజు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంటుంది. రిజర్వేషన్‌లను బట్టి ఫీజు రాయితీ లభిస్తుంది. కోర్సులు: ఆటోమొబైల్/ఆటో కాంపొనెంట్; ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్; టెక్స్‌టైల్స్ అండ్ గార్మెంట్స్; లెదర్, లెదర్ గూడ్స్; కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్; జెమ్ అండ్ జ్యువెలరీ; బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్; ఫుడ్ ప్రాసెసింగ్; హ్యాండ్‌లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్; బిల్డింగ్ హార్డ్‌వేర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్: www.nsdcindia.org

ఎంఎస్‌ఎంఈ:
City Plus కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఈ) ఆధ్వర్యంలోని అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో పారిశ్రామిక ప్రాంతమైన బాలానగర్‌లో ఉంది. ఇది పారిశ్రామిక ప్రేరణ ప్రచార కార్యక్రమాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్- స్కిల్ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎంఎస్‌ఎంఈ యువతకు ఉపాధి కల్పించే వివిధ కోర్సులు అందిస్తోంది.
కోర్సులు: కంప్యూటర్ హార్డ్‌వేర్, మెయింటెనెన్స్-నెట్‌వర్కింగ్; గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్; హౌస్ వైరింగ్; ఎలక్ట్రిక్ గాడ్జెట్ రిపైరింగ్; ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాల్లో శిక్షణ అందిస్తోంది. వీటికి సంబంధించి సంస్థ ఎప్పటికప్పుడు ప్రకటనలు విడుదల చేస్తుంది.
వెబ్‌సైట్: msmehyd.ap.nic.in/

ఎన్‌ఐఓఎస్:
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్- ఎన్‌ఐఓఎస్(గతంలో నేషనల్ ఓపెన్ స్కూల్‌గా పిలిచేవారు).. 1989లో ఏర్పడిన స్వయంప్రతిపత్తిగల సంస్థ. ఇది సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిలో జనరల్, అకడమిక్ కోర్సులతో పాటు వివిధ వృత్తివిద్యా కోర్సులు అందిస్తోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ రీజియన్ కేంద్రం దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంది.
కోర్సులు: హౌస్ వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయిన్స్ రిపైరింగ్; కేటరింగ్ మేనేజ్‌మెంట్; ఎయిర్ కండీషనింగ్; బ్యూటీ కల్చర్; ఫుడ్ ప్రాసెసింగ్; ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వంటి అంశాల్లో శిక్షణ కోర్సులున్నాయి.
వెబ్‌సైట్: www.nios.ac.in

అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్:
నగరంలోని విద్యానగర్‌లో ఉన్న అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఏటీఐ).. నైపుణ్యాలున్న మానవ వనరులను అందించేందుకు వివిధ దీర్ఘకాలిక, స్వల్పకాలిక కోర్సులను అందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో నిపుణుడైన ఇన్‌స్ట్రక్టర్‌గా చేరేందుకు ఏడాది కాల వ్యవధిగల క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ (సీఐటీఎస్) కోర్సు అందుబాటులో ఉంది.
ఇందులోని విభాగాలు: ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, మెషినిస్టు, మెకానిక్ మోటార్ వెహికల్, వెల్డర్. వీటితో పాటు అడ్వాన్స్డ్ వొకేషనల్ ట్రైనింగ్ స్కీమ్, వొకేషనల్ ట్రైనింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు, టెక్నికల్ అసిస్టెంట్ స్కీమ్, స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ స్కీమ్‌ల కింద స్వల్పకాలిక కోర్సులున్నాయి.
వెబ్‌సైట్: atihyderabad.ap.nic.in/

ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ:
యూసఫ్‌గూడలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎన్ ఐ-ఎంఎస్‌ఎంఈ) ప్రధానంగా రెండు రకాల కోర్సులను అందిస్తోంది. అవి.. ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు. ఉదా.. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లిష్ అండ్ ప్రొమోషన్ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్; ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ త్రూ మైక్రో ఫైనాన్స్. ఇవి సాధారణంగా 8-12 వారాల వ్యవధిగల కోర్సులు. రెండోది ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు.
వెబ్‌సైట్: www.nimsme.org

విద్యార్హతల కంటే నైపుణ్యాలే కీలకం
తరగతి గదిలో నేర్చుకునేది విజ్ఞానం. ప్రాక్టికల్‌గా నేర్చుకునేది నైపుణ్యం. డిగ్రీలు విద్యార్హతలకు మాత్రమే ఉపయోగపడతాయి. కెరీర్‌లో రాణించాలంటే సంబంధిత అంశానికి అవసరమైన నైపుణ్యాలను సముపార్జించుకోవాలి. ఇంజనీరింగ్ విషయానికొస్తే విద్యార్థులు మొదటి సెమిస్టర్ నుంచే ప్రాజెక్టు వర్క్ మొదలుపెడితే నైపుణ్యాల సాధన దిశగా అడుగుపడినట్లే! ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరి జ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలి. ఐటీ, కమ్యూనికేషన్ విభాగాల్లో వేలాదిగా మంచి అవకాశాలున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో నెలకొన్న పోటీని ఎదుర్కొనేందుకు విద్యార్థులు నైపుణ్యాలకు పదునుపెట్టుకోవడమనేది దైనందిన చర్యగా మారాలి. కమ్యూనికేషన్, లీడర్‌షిప్ స్కిల్స్ వంటి వాటిని క్యాంపస్ నుంచి బయటకు రాకముందే పుణికిపుచ్చుకోవాలి. ఒకవేళ స్కిల్స్ లేకుండా బయటికొస్తే అందుబాటులో ఉన్న శిక్షణ సంస్థల్లో చేరి, శ్రద్ధతో నైపుణ్యాలను ఒంటబట్టించుకోవాలి.
డాక్టర్ యు.చంద్రశేఖర్, డెరైక్టర్,
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా
Published date : 18 Sep 2014 03:44PM

Photo Stories