Skip to main content

ఉద్యోగమంటే...ఇలా ఉండాలి !

ఈ మధ్య రైల్వే శాఖ అసిస్టెంట్ లోకోపైలట్ (ఏఎల్‌పీ),టెక్నీషియన్; గ్రూప్-డి పోస్టులకు ప్రకటనలు విడుదల చేసింది.
ఇందులో ఏఎల్‌పీ, టెక్నీషియన్ పోస్టులు 26,502. ఇక గ్రూప్-డి పోస్టుల సంఖ్య 62,907. అంటే మొత్తం లక్ష లోపు ఖాళీల తోనే ప్రకటనలు వెలువడ్డాయి. ఇంకా చెప్పాలంటే నిండా 90 వేలు కూడా లేవు. కానీ, వీటికి దరఖాస్తు చేసినవారు ఎంతమందో తెలుసా? అక్షరాలా రెండుకోట్ల ఇరవై ఏడు లక్షలు. అలాగని దరఖాస్తు చేసిన వారంతా నిరుద్యో గులేనని చెప్పలేం. ప్రైవేటు రంగంలో చిరుద్యోగాలు చేస్తున్నవారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఇందులో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే... ప్రభుత్వోద్యోగాలపై యువతకున్న క్రేజును ఈ సంఖ్య చెప్పకనే చెబుతోంది.

స్థానిక ప్రకటనలకు సైతం :
జాతీయస్థాయి నోటిఫికేషన్లకే కాదు. స్థానికంగా విడుదలయ్యే నోటిఫికేషన్లకూ ఇదే స్థాయి స్పందన వస్తోంది. ఈ మధ్య తెలంగాణలో వెలువడిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ వంటి నోటిఫికేషన్లకు పది లక్షల వరకు దరఖాస్తులొచ్చాయి. తెలంగాణలో వీఆర్‌వో, గ్రూప్-4 పోస్టుల నోటి ఫికేషన్లకు దాదాపు 10 లక్షల చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గతేడా ది 1055 పంచాయతీ సెక్రటరీ పోస్ట్‌లకు నిర్వహించిన తొలి దశ స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరైన వారి సంఖ్య 3,67,341.
  • వీఆర్‌ఓ దగ్గర మొదలుపెడితే గ్రూప్-1, 2, 3, 4... బ్యాంకులు, రైల్వేలు, రక్షణ దళాల నుంచి అత్యున్నత సర్వీసు లుగా పేర్కొనే సివిల్ సర్వీసెస్ వరకూ ఏ నోటిఫికేషన్ వెలువడినా.. లక్షల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. చాలా క్లిష్టంగా భావించే, ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగే సివిల్ సర్వీసెస్‌కు సైతం ఏటా దాదాపు 5 లక్షల మంది వరకూ హాజరవుతున్నారు. కానీ సివిల్స్ పోస్ట్‌ల సంఖ్య వెయి్యలోపే ఉంటోంది. పెపైచ్చు గత నాలుగేళ్లుగా సివిల్ సర్వీసెస్ పోస్టుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలను చూస్తే.. ప్యూన్, సబ్ స్టాఫ్ వంటి ఉద్యోగాలకు పదో తరగతి నుంచి పీహెచ్‌డీ స్కాలర్స్ వరకు దరఖాస్తు చేస్తున్నారు. దీన్నిచూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.

అర్హతలు చూస్తే విస్తుపోవాల్సిందే !
పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీ కనీస అర్హతగా పేర్కొన్న పోస్టులకు... బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఒకటీ రెండూ కాదు. దాదాపు ప్రతి నోటిఫికేషన్‌లోనూ ఇలాంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారి సంఖ్య సగటున 30 శాతానికిపైగా ఉంటోంది. ఉదాహరణకు గతేడాది రాజస్థాన్‌లో 18 ప్యూన్ పోస్ట్‌ల ఉద్యోగాలకు 299 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇదే తీరు ఇతర నియామక పరీక్షల్లోనూ కనిపిస్తోంది.

సెలవులు పెట్టి మరీ..!
కొంతమంది ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు లభించక ఎండమావిలాంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరుగులు పెడు తుంటే... మరికొందరు కార్పొరేట్ కంపెనీల్లో లక్షల్లో వేతనాలిచ్చే కొలువులను సైతం వదులుకొని సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతు న్నారు. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తిచేసుకొని.. అప్పటికే లక్షల పే ప్యాకేజీలతో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు.. తమ ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవుపెట్టో.. అది వీలుకాకపోతే రాజీనామా చేసైనా... ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. వీరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఎంఎన్‌సీ సంస్థల ఉద్యోగులు సైతం ఉండటం గమనార్హం.

ఎందుకింత క్రేజ్?
ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఎందుకింత క్రేజ్? అంటే.. రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. సుస్థిర భవిష్యత్తు, ఒత్తిడి లేని పని వాతావరణం, మెరుగైన జీతాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత.... ఇలా వివిధ కారణాలను అభ్యర్థులు పేర్కొంటున్నారు. సివిల్స్, గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందని ఇటు వచ్చినట్లు చెబుతున్నారు. ఇవి కొంత వరకు వాస్తవమే అయినప్పటికీ.. రూ.లక్షల వేతనాలు వచ్చే కార్పొరేట్ ఉద్యోగాలను వదులుకుని సర్కారీ కొలువువైపు చూడటానికి మరెన్నో అంశాలు దోహదం చేస్తున్నాయి.

ప్రైవేటు నియామక విధానాలు :
  1. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల సంఖ్య పెరగడానికి ప్రైవేటు సంస్థల నియామక విధానాలు కూడా ముఖ్య కారణంగా విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలు తమ నియామక ప్రక్రియను రోజురోజుకూ క్లిష్టతరం చేస్తున్నాయి. అభ్యర్థుల్లోని కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి కోర్ నాలెడ్‌‌జ వరకు.. ఎన్నో నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి. దాంతోపాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విజయం సాధిస్తేనే.. ఉద్యోగంలో స్థిరపడినట్లు అనే భావన నెలకొంది. అలాకాకుండా కేవలం సర్టిఫికెట్‌తో బయటికి వస్తే ఉద్యోగాలు దొరకడం కొంత కష్టంగా మారింది.
  2. ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలల్లో ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు లభించట్లేదు. పర్యవసానంగా అలాంటి కళాశాలల్లో చదివిన అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలవైపు దృష్టిసారిస్తున్నారు. సంబంధిత పరీక్ష సిలబస్‌పై పట్టు సాధించి.. ఓపిగ్గా కృషిచేస్తే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం రాకపోదా..! అనే ఆశతో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అన్ని నియామక పరీక్షల్లోనూ దాదాపు ఒకే సిలబస్ అమలవుతోంది. దీంతో వన్ షాట్ టు బర్డ్స్ తరహాలో ఒక పరీక్ష ప్రిపరేషన్‌తో మిగతా పరీక్షలకు కూడా సన్నద్ధం కావచ్చనేది కూడా మరో ఆలోచనగా కనిపిస్తోంది.
  3. ప్రభుత్వ ఉద్యోగాలకు వెల్లువెత్తుతున్న లక్షల దరఖాస్తుల్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ నేపథ్యాల అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉంటోంది. దీనికి కారణం.. ఈ అర్హతలున్న వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు లభించడం కొంచెం కష్టంగా ఉంటోంది. వీరికి కాల్ సెంటర్లు లేదా బీపీవో వంటి వాటిలో లభించే వేతనాలు తక్కువగా ఉంటున్నాయి. దాంతో ఇలాంటి ఉద్యోగాలకంటే కొంత కాలం కష్టనష్టాల కోర్చి చదివితే.. సుస్థిర భవిష్యత్తును అందించే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుందనే ఉద్దేశంతో ఆర్‌‌ట్స విద్యార్థులు అడుగులు వేస్తున్నారు.

కార్పొరేట్ కొలువులు... ఒత్తిళ్లు
ప్రైవేటు రంగ సంస్థల్లో నిరంతరం పని ఒత్తిడి, టార్గెట్ డెడ్‌లైన్స్ మానసిక ఆందోళనకు గురిచేస్తున్నా యి. దీనికితోడు ఇటీవల కాలంలో సంస్థల పని తీరులో మార్పు రావడం, నిరంతరం నూతన నైపు ణ్యాలు సొంతం చేసుకోవాల్సిన ఆవశ్యకత వంటి అంశాలు కూడా ఎంఎన్‌సీ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం సర్కారీ కొలువులపై దృష్టిసారించేలా చేస్తున్నాయి.

సామాజిక పరిస్థితులు..
ఇప్పటికీ మన దేశంలో శాశ్వత కొలువు అంటే ప్రభుత్వ ఉద్యోగమేననే అభిప్రాయముంది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వైపు ఎక్కువగా మొగ్గుతున్నారు. ఇది కూడా సర్కారీ కొలువుల పట్ల క్రేజ్‌కు కారణమవుతోంది. అందుకే కానిస్టేబుల్, వీఆర్‌వో వంటి పోస్ట్‌లకు సైతం టెక్ గ్రాడ్యుయేట్స్, పీహెచ్‌డీ స్కాలర్స్ దరఖాస్తు చేసుకుంటున్నారు.

విద్యా వ్యవస్థలో లోపాలు :
యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలనే టార్గెట్ చేసుకోవడానికి మరో కారణం.. విద్యా వ్యవస్థలో లోపాలనేది నిపుణుల మాట. మూస ధోరణి సిలబస్‌తో విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన లభించడం లేదు. దీంతో సర్టిఫికెట్లతో బయటికి వచ్చి జాబ్ మార్కెట్లో అడుగుపెట్టాక.. ఉద్యోగాలు ఎక్కడ లభిస్తాయో? ఎలా అన్వేషించాలో? ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో ఎలా నెగ్గుకురావాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొం టున్నారు.

సర్కారీ కొలువులు.. క్రేజ్ కారణాలు
  • సుస్థిర భవిష్యత్తు.
  • ఒడిదుడుకులు, పని ఒత్తిడి లేని వాతావరణం.
  • ఆకర్షణీయమైన వేతనాలు.
  • ప్రస్తుతం క్లరికల్ కేడర్‌లో ప్రారంభంలోనే రూ.25వేల వరకు వేతనం.
  • కేంద్ర ప్రభుత్వ కొలువులైతే ప్రారంభంలో రూ.30 వేల నుంచి రూ.40 వేల వేతనం.
  • పింక్ స్లిప్‌ల టెన్షన్ లేకపోవడం.
  • సమాజంలో ప్రభుత్వ ఉద్యోగి అంటే ఇప్పటికీ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండటం.
  • ప్రైవేటు రంగంలోనూ ఆశించిన విధంగా ఉద్యోగాలు లభించకపోవడం.

అవకాశాలపై అవగాహన పెంచుకోవాలి :
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్న వారిలో టెక్ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉంటున్న మాట వాస్తవమే. ఫలితాలు చూసినా.. వారే ముందంజలో ఉంటున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ, ఇది కొంతవరకే నిజం. విజేతల్లో ఆర్‌‌ట్స, హ్యుమానిటీస్ అభ్యర్థులు కూడా ఎక్కువగానే నిలుస్తున్నారు. ఇక.. సుస్థిర భవిష్యత్తు, సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రమోషన్లు, వేతనాల పెంపు వంటివి కూడా కారణంగా నిలుస్తున్నాయి. అభ్యర్థులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలనే లక్ష్యంగా చేసుకొని శిక్షణ, ప్రిపరేషన్‌కు సమయం వెచ్చించకుండా.. ఇతర అవకాశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. గవర్నమెంట్ రిక్రూట్‌మెంట్స్‌లో సక్సెస్ రేట్.. ఫిఫ్టీ-ఫిఫ్టీగానే ఉంటుంది. దీన్ని కూడా అభ్యర్థులు గమనించాలి.
- వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్‌ట్రీ.
Published date : 20 Aug 2018 05:48PM

Photo Stories