Skip to main content

ఉద్యోగాన్వేషణలో ఉపయోగపడే ముఖ్యమైన టిప్స్...

చదువుల పట్టా చేతిలో ఉంది. ఉద్యోగం సంపాదించాలి. ఓవైపు కొలువుల కోత నడుస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో కోరుకున్న జాబ్ దక్కించుకోవడం అంత తేలిక కాదు. ఆల్ రౌండ్ ప్రతిభ ప్రదర్శిస్తే తప్ప.. ఆఫర్ లెటర్ అందే అవకాశం కనిపించడంలేదు. కాబట్టి అభ్యర్థులు రెజ్యూమె దగ్గర నుంచి ఇంటర్వ్యూ పూర్తయ్యే వరకూ.. అడుగడుగునా అప్రమత్తంగా ఉంటేనే ఉద్యోగం లభించే వీలుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులు.. కృషి, పట్టుదల, ప్రణాళికతో ముందుకుసాగితే.. కోరుకున్న కొలువును సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో... ఉద్యోగాన్వేషణలో ఉపయోగపడే టిప్స్...
వైఫల్యాలు సహజం :
ఉద్యోగం పరంగా ఏ రంగం వైపు వెళ్లాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయం తీసుకోండి. ఎంచుకునే రంగంలో అందుబాటులో ఉన్న విభిన్న అవకాశాల గురించి అధ్యయనం చేయండి. దీనివల్ల మనకు ఎలాంటి కొలువు సరిపోతుందో తెలుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో వైఫల్యాలు సహజమేనని అంగీకరించాలి. ఒకట్రెండు అవకాశాలు చేజారినా.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. తొలుత మన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడంలేదనే ఆలోచన వదిలేయాలి. ఎక్కడ వైఫల్యం ఎదురవుతోంది.. మన లోపాలేంటో గుర్తించే ప్రయత్నం చేయాలి. ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం.. వాటిని సరిదిద్దుకోవడం ఎలాగో తెలుసుకోవాలి.మెరుగుపరచుకోవాల్సిన అంశాలను ఒక కాగితంపై రాసుకొని..తదుపరి ఇంటర్వ్యూలో అవే పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి.

చదువుకు తగ్గ కొలువు :
ఉన్నతస్థాయి విద్యార్హతలు ఉన్నాయి కదా..! అని పెద్ద పెద్ద ఉద్యోగాలకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మొదట మన చదువుకు తగ్గ చిన్నస్థాయి ఉద్యోగమైనాసరే.. దానికే విలువ ఇవ్వండి. అనుభవం, నైపుణ్యం వచ్చే కొద్దీ పెద్ద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామంది విషయంలో చదివిన చదువుకు దరఖాస్తు చేసే కొలువుకు పొంతన ఉండదు. ఒకవేళ ప్రయత్నాలు ఫలించి అవకాశం దక్కించుకున్నా.. భవిష్యత్‌లో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు చదువుకు తగ్గ ఉద్యోగం ప్రయత్నం చేయడం మేలన్నది నిపుణుల సలహా! మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అభ్యర్థులైతే.. దానికి సంబంధించిన రంగంలో ఉద్యోగాన్వేషణ కొనసాగించడం మంచిది. సంబంధిత సబ్జెక్టుపై తగిన పట్టు లేదనిపిస్తే.. నిపుణులను సంప్రదించడం లేదా మూక్స్ ద్వారానో అవసరమైన పరిజ్ఞానం పెంచుకోవాలి.

రెజ్యూమె ఇలా..
అభ్యర్థులు రెజ్యూమె సిద్ధం చేస్తున్న సమయంలో కొన్ని ముఖ్య విషయాలను గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థిగా చూపిన ప్రతిభాపాటవాలు, సాధించిన విజయాలు, నైపుణ్యాల వివరాలు రెజ్యూమెలో ప్రముఖంగా పేర్కొనాలి. ఫ్రెషర్స్‌కు ఉద్యోగానుభవం ఉండదు. కాబట్టి చేరాలనుకుంటున్న కొలువుపై తమకున్న ఆసక్తిని, విద్యార్హతలను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అలాగే ఇంటర్వ్యూ సమయంలో రెజ్యూమెలో పేర్కొన్న అంశాలను మాత్రమే చెప్పాలి. అందుకోసం ఇంటర్య్వూకు వెళ్లేముందు రెజ్యూమెలో పేర్కొన్న అంశాలను ఒకటికి రెండుసార్లు చూసుకొని వెళ్లాలి. అదేవిధంగా ఇంటర్వ్యూలో రెజ్యూమెలోని అంశాలపైనే ప్రశ్నలు అడగాలనే నియమం ఏమీలేదు. జనరల్ ప్రశ్నలు కూడా ఎదురయ్యే అవకాశముంది. అదే విధంగా గ్రూప్ డిస్కషన్‌లో సమాజంలోని ఏదైనా ఒక సమస్యను ఇచ్చి చర్చించమంటారు. ఉదాహరణకు యువతపై సోషల్ మీడియా ప్రభావం వంటివి. కాబట్టి తాజా పరిణామాలు, కరెంట్ అఫైర్స్‌పై నిత్యం అవగాహన పెంచుకోవాలి.

ఆన్‌లైన్ వేదికలు :
ప్రస్తుతం ఉద్యోగాలు, ఖాళీల సమాచారమంతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటోంది. ఆయా కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లో విస్తృత సమాచారం లభిస్తోంది. కాబట్టి సదరు జాబ్ పోర్టల్స్‌లో, కంపెనీల కెరీర్ కాలమ్స్‌లో రెజ్యూమెను అప్‌లోడ్ చేస్తుండాలి. ఫలితంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్, మెయిల్స్, మెసేజ్‌ల రూపంలో ఖాళీల వివరాలు తెలుస్తాయి. ముఖ్యంగా లింక్డ్‌ఇన్, ఇండీడ్, మోన్‌స్టర్ వంటి జాబ్ పోర్టల్స్‌తోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలోనూ రెజ్యూమెను పెట్టొచ్చు.

వేతనం తక్కువైనా..
నచ్చిన కంపెనీలో మెచ్చిన కొలువు వస్తేనే చేస్తా.. లేకుంటే లేదు అనే పంతంతో చాలామంది ఖాళీగా ఉంటారు. చదువుకు, ఉద్యోగానికి మధ్య.. ఒక్క ఏడాది గ్యాప్ వచ్చినా.. ఎందుకు ఖాళీగా ఉన్నావనే ప్రశ్న ఎదురవుతుంది. అక్కడ మన ప్రతిభపై సందేహం తలెత్తే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తొలి ఉద్యోగం విషయంలో భేషజాలకు పోకుండా ఏదో ఒక కంపెనీలో చేరి అనుభవం గడించే ప్రయత్నంచేయాలి. అలాగే జీతం విషయంలోనూ మొండి పట్టుదలతో వ్యవహరించొద్దు. మొదట తక్కువ వేతనం లభించినా.. పని నేర్చుకొని.. భవిష్యత్‌లో వేరే కంపెనీల్లో ఎక్కువ ప్యాకేజీలు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది.

నైపుణ్యాలు ముఖ్యం :
ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ఏ ఇంటర్య్వూకు వెళ్లినా.. మన విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం గురించి తప్పనిసరిగా అడుగుతారు. ప్రతి సంస్థ తమకు నైపుణ్యం కలిగిన అభ్యర్థులు కావాలని కోరుకుంటుంది. అందుకే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కొంత ప్రతిభ కనబర్చిన అభ్యర్థులు కూడా ఉద్యోగాలు పొందుతారు. మరికొంత మంది తమకు ప్రతిభ ఉన్నా.. ప్రదర్శన లోపం కారణంగా అవకాశం సంపాదించుకోలేరు. కాబట్టి అభ్యర్థులు నైపుణ్యాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి. ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తున్న వారు.. తాము చదివిన విభాగానికి సంబంధించిన కోర్ సబ్జెక్టులపై తాజా సమాచారంతో నిత్యం అవగాహన పెంచుకుంటుండాలి. అదే సమయంలో ఇంటర్వ్యూలో రాణించేలా.. సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లిష్‌లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి.
Published date : 19 Dec 2019 12:55PM

Photo Stories