Skip to main content

టిక్.. టిక్.. టిక్..వాచ్ డిజైనర్.. విలువైన కెరీర్‌కు చక్కటి ‘టైమ్’

టైమ్.. ఎంతో విలువైంది. పోటీ ప్రపంచంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం ప్రధానం. అలాంటి టైమ్‌ను సూచించే గడియారాలు.. నేడు విలువైన కెరీర్‌ను అందించడంలో.. లక్షల జీతం సొంతం చేసుకోవడంలో.. మెరుగైన ఉపకరణాలుగా మారుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో లేటెస్ట్ ట్రెండ్స్ రాజ్యమేలుతున్న నేటి పరిస్థితుల్లో సమయాన్ని సూచించే గడియారాలు కూడా కొత్త ఆకృతులతో ఆకర్షిస్తున్నాయి. ఇలా ఆకర్షించే విధంగా వాచ్‌ల డిజైన్‌ను రూపొందించడం వెనుక ఎంతో శ్రమ. మరెంతో సృజనాత్మకత ఉంది. వంద రూపాయల మొదలు.. లక్షల రూపాయల వరకు ఆయా స్థాయిల వినియోగదారుల కొనుగోలు శక్తిని దృష్టిలో పెట్టుకుని రూపొందించడం ఒక ప్రత్యేక కళ. ఆ కళను అందించించడంతోపాటు కలర్‌ఫుల్ కెరీర్‌కు.. సోపానంగా నిలుస్తున్న వాచ్ డిజైనర్ కెరీర్‌పై ఫోకస్.

గడియారం.. వాచ్.. అంటే 12 అంకెలు.. రెండు ముళ్లతో సమయాన్ని సూచించే సాధనం. వాల్ క్లాక్ అయినా రిస్ట్ వాచ్ అయినా గడియారం ఉద్దేశం అదే. కానీ ఆధునిక ప్రపంచంలో, అత్యాధునిక అభిరుచులకు అనుగుణంగా గడియారాలను డిజైన్ చేయడం అంత సులువేమీ కాదు. అందుకే నేడు వాచ్ డిజైనర్ విధి ఎంతో క్రియాశీలకమైంది. ఒక నిర్దిష్ట ఆకృతిలో వాచ్‌ను డిజైన్ చేయాలంటే.. దానికోసం చేయాల్సిన కసరత్తు కూడా ప్రత్యేకం. ప్రస్తుత వినియోగదారుల అభిరుచి, ట్రెండ్‌ను పరిశీలించడం- విశ్లేషించడం; వీటికి అనుగుణంగా ముందుగా పలు రకాల ఆకృతులను రూపొందించడం, అన్నిటిలోకి అత్యున్నత ఆకృతి ఏంటని ఆలోచించడం, కొత్త వాచ్ డిజైన్ వెనుక ఉద్దేశాన్ని గుర్తించడం ఇలా ఎన్నో ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. వీటన్నిటి కలయికతోనే ఆకర్షణీయమైన ఆకృతికి ఆస్కారం.

‘టైమ్’.. టు ‘టీం’ వర్క్:
వాస్తవానికి సృజనాత్మకతకు పెద్దపీట వేసే డిజైన్ కోణంలో పరిగణిస్తే.. వాచ్ డిజైన్‌లో ఇది మరింత ఆవశ్యకం. లక్షల మంది వినియోగదారులను ఆకర్షించేలా డిజైన్ చేసే విషయంలో టీం వర్క్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ క్రమంలో ఉత్పత్తి ఉద్దేశాన్ని వివరించడం, ఆలోచనను తెలపడం, సహచరులతో పరస్పర అభిప్రాయ సేకరణ, ఆలోచనను పంచుకోవడం, గ్రూప్ ప్రజెంటేషన్, ఇంటరాక్షన్ కోసం టీం వర్క్ తప్పనిసరి. తద్వారా కాన్సెప్ట్‌లను కుదించడం, టెక్నికల్ డ్రాయింగ్స్‌కు రూపమివ్వడం, వాటి మాతృకలను పరిశీలించి.. చివరికి ప్రస్తుత అవసరానికి అనువైన ఆకృతికి రూపమివ్వడం సాధ్యమవుతుంది.

వృద్ధి బాటలో పరిశ్రమ:
వాచ్ ఇండస్ట్రీ ప్రస్తుతం 8 శాతం వార్షిక వృద్ధితో పురోగమిస్తోంది. దీంతో వాచ్ డిజైనింగ్ సృజనాత్మక కోణంలో అత్యున్నత విభాగంగా నిలుస్తోంది. వాచ్ డిజైనింగ్‌లో విధులు నిర్వర్తించే క్రమంలో సదరు వాచ్ భౌతిక పరిమాణాలను దృష్టిలో పెట్టుకుని డయల్స్, స్ట్రాప్స్, కేస్ వంటి వాటిని రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రధానమైంది, ప్రాథమికమైంది లక్షిత వినియోగదారుల అభిరుచి, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోవడం.

పని వేళలు ఇలా:
వాచ్ డిజైనర్ వృత్తి ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం అయిదు గంటలకు విధులు ముగిసే ఉద్యోగం కాదు. సృజనాత్మకత కీలకమైన డిజైనింగ్ విభాగంలో అనుక్షణం కొత్త ఆలోచనలను పదును పెట్టాల్సిందే. అంటే ఒకరకంగా ఇది 24ఁ7 తరహా ఉద్యోగంగానే భావించాలి. ఆఫీసులో ఉన్నా.. ఇంటి వద్ద ఉన్నా.. కొత్త ఆలోచన రాగానే దానికి పెన్ను, పేపర్‌తో ప్రాథమిక రూపమివ్వడం అనేది ప్రాధాన్యం. దాని ద్వారా భవిష్యత్తులో మంచి డిజైన్ల రూపకల్పనకు ఆస్కారం లభిస్తుంది.ఇక.. డిజైన్ ప్రజెంటేషన్స్; మీటింగ్స్, ఫ్యాక్టరీ విజిట్స్, కొత్త డిజైనర్లకు శిక్షణనివ్వడం, ఇతర డిజైనర్లతో కలిసి పని చేయడం; క్లయింట్లతో చర్చలు వంటివి సాధారణంగా ఒక రోజులో వాచ్ డిజైనర్ విధుల్లో భాగంగా ఉంటాయి.

లక్షల్లో వేతనాలు:
వాచ్ డిజైనర్ ఇండస్ట్రీలో ఎంట్రీ లెవల్ నుంచి డిజైన్ డెరైక్టర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. ప్రారంభంలో రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వార్షిక వేతనం గ్యారంటీ. కొంత అనుభవం లభించాక సీనియర్ డిజైనర్‌గా రూ. 8 లక్షలు అందుకునేందుకు ఎన్నో అవకాశాలు. డిజైన్ మేనేజర్‌గా రూ. 16 లక్షల వార్షిక వేతనం పొందడం కూడా సాధ్యమే.

కావల్సిన నైపుణ్యాలు:
  • సృజనాత్మక సమయస్ఫూర్తి
  • లక్ష్యంపై ఆసక్తి
  • తగిన ఆకృతులు, ప్రమాణాలను గుర్తించే లక్షణం
  • సాంకేతిక పరికరాలపై పరిజ్ఞానం
  • చిన్నపాటి పరిమాణంలోని ఆకృతులను గుర్తించే లక్షణం
  • నిరంతరం నేర్చుకోవాలనే అభిరుచి
  • పరిశీలనాత్మక దృక్పథం
  • వినియోగదారుల అవసరాలను గుర్తించడం
  • సమస్యలను విశ్లేషించి పరిష్కరించే నైపుణ్యం
వాచ్ డిజైన్‌లో అడుగు పెట్టాలంటే:
ఈ రంగంలో కెరీర్ కోరుకునే ఔత్సాహికులకు ముందుగా డిజైన్ ఆప్టిట్యూడ్ ఉండాలి. డిజైన్‌లో డిగ్రీ కచ్చితంగా దోహదం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రొడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, యాక్ససరీ డిజైన్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయడం ఉపకరిస్తుంది. ప్రస్తుతం దేశంలోని ఎందరో వాచ్ డిజైనర్లు ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక డిజైన్‌లో పీజీ చేసి మరీ ఈ రంగంలో అడుగు పెడుతున్నారు.

డిజైన్ కోర్సులు.. ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు:
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్- అహ్మదాబాద్
    వెబ్‌సైట్:
    www.nid.edu
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
    వెబ్‌సైట్:
    www.nift.ac.in
  • క్రియేటివ్ అకాడెమీ-మిలాన్
    వెబ్‌సైట్:
    www.creative-academy.com
Published date : 02 Sep 2014 01:38PM

Photo Stories