Skip to main content

తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలెన్నో...

నేటి జాబ్ మార్కెట్‌లో ఉద్యోగావకాశాలకు కొదవలేదు. ప్రొఫెషనల్ కోర్సులతో పాటు బీఏ/బీకామ్/బీఎస్సీ తదితర బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారికి సైతం కెరీర్ అవకాశాలు పుష్కలం. ఐటీ, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, సేల్స్/మార్కెటింగ్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, ఫ్యాషన్‌తోపాటు మరెన్నో రంగాలు గ్రాడ్యుయేట్లకు ఆహ్వానం పలుకుతున్నాయి. గతంలో కంటే జాబ్ మార్కెట్ ఇప్పుడు వీరికి సానుకూలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. యువ ప్రతిభావంతులను నియమించుకునేందుకు టాప్ కాలేజీలకు కంపెనీలు క్యూ కడుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా విభాగాల్లో సిటీ యువతకు అందుబాటులో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలపై ఫోకస్...

ఐటీ కొలువులు: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న కెరీర్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఒకటి. ఐటీపై ఆసక్తి ఉండి సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో అడుగుపెట్టాలంటే.. టెక్నాలజీలో ప్రాథమిక అంశాలపై అవగాహనతోపాటు ఆసక్తి ఉండాలి. సృజనాత్మకంగా ఆలోచించగలిగే నేర్పు, ఎప్పటికప్పుడు సాంకేతిక అంశాలతో అప్‌డేట్ అయ్యే నైపుణ్యాలు తప్పనిసరి.

ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్: అంకెలు, ఆడిట్లు, అకౌంట్లు, పన్నుల చుట్టూ తిరిగే రంగం ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్. కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన వారు పలు కార్పొరేట్ కంపెనీల్లోని ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. డిగ్రీ పూర్తిచేసిన యువత ముందు ఉన్న మరో అద్భుత అవకాశం బ్యాంక్ కొలువులు. ప్రొబేషనరీ ఆఫీసర్లు, క్లరికల్ ఉద్యోగాల కోసం ఏటా వేలాది జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపి బ్యాంకులో ఉద్యోగం సాధించొచ్చు.

సేల్స్ అండ్ మార్కెటింగ్: కంపెనీ ఏదైనా మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలవాలంటే.. దాని ఉత్పత్తుల సేల్స్‌తోపాటు మార్కెటింగ్ తప్పనిసరి. కాబట్టి కంపెనీలు అధిక వేతనాలు చెల్లించి మార్కెటింగ్ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చురుకైన, ఉత్సాహవంతులైన యువతకు మార్కెటింగ్‌లో విస్తృత అవకాశాలున్నాయి. సేల్స్ విభాగంలో పనిచేయాలంటే గ్రాడ్యుయేషన్ అర్హత తప్పనిసరి కానప్పటికీ అధిక సంఖ్యలో కంపెనీలు బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సును పూర్తి చేసిన వారిని నియమించుకుంటున్నాయి.

ఏవియేషన్: భారత్‌లో ఏవియేషన్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2020 నాటికల్లా ప్రపంచంలోనే మనదేశం మూడో స్థానంలో నిలవనుందని, 2030 నాటికి మొదటి స్థానాన్ని సొంతం చేసుకోనుందని ఫిక్కీ-కేపీఎంజీ అంచనా. ఈ నేపథ్యంలో ఏవియేషన్‌లో గ్రౌండ్ లెవల్ జాబ్స్ నుంచి ఏరోప్లేన్ సర్వీసెస్ వరకు పెలైట్, గ్రౌండ్ డ్యూటీ, కేబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) తదితర విభాగాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

ఆతిథ్య, పర్యాటక రంగాలు: దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండడంతో దేశంలో ఆతిథ్య, పర్యాటక రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టుల నిర్మాణం కారణంగా ఈ రంగాల్లో మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారికి మంచి అవకాశాలుంటాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా ఎంబీఏ(హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్) /ఎంఎస్సీ(హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్) తదితర కోర్సులనభ్యసించొచ్చు. ఈ రంగంలో ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి.

ఫ్యాషన్ టెక్నాలజీ: ప్రపంచీకరణ ప్రభావంతో ఫ్యాషన్, డిజైనింగ్ రంగాల విస్తృతి పెరుగుతోంది. కొత్త పుంతలు తొక్కుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా ఫ్యాషన్ నిపుణులకు డిమాండ్ అధికమవుతోంది. ప్రతిభ, సృజనాత్మక నైపుణ్యాలుండి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంటే.. ఎవరైనా ఈ రంగంలో ప్రవేశించవచ్చు. ‘ఫ్యాషన్’లో బ్యాచిలర్‌‌స డిగ్రీ కోర్సులు పూర్తిచేసిన వారు వస్త్ర, తోలు ఉత్పత్తులు, ఆభరణాల తయారీ పరిశ్రమల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా, ఇలస్ట్రేటర్లుగా ఎన్నో అవకాశాలను అందుకోవచ్చు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)తోపాటు పలు ప్రైవేటు విద్యాసంస్థలు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నాయి.

మీడియా/జర్నలిజం/పబ్లిషింగ్: జర్నలిజం.. ఒక ఉత్సాహవంతమైన, సాహసోపేతమైన కెరీర్. ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వృత్తి. సామాజిక స్పృహ, భాషా ప్రావీణ్యం, కష్టపడి పనిచేసేతత్వం ఉన్నవారికి ఇది సరైన కెరీర్. దేశంలో కొత్త పత్రికలు, టీవీ చానళ్లు, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ వెలుస్తున్న నేపథ్యంలో జర్నలిజంలో అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిప్లొమా, పీజీ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ తదితర కోర్సులను అందిస్తున్నాయి.

ఈవెంట్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్: బర్త్‌డే పార్టీ, ఎడ్యుకేషన్ ఈవెంట్స్, ఇండస్ట్రియల్ మీటింగ్స్, మ్యారేజ్ ఫంక్షన్స్.. ఇలా కార్యక్రమమేదైనా నేటి కార్పొరేట్ యుగానికి అనుగుణంగా డిజైన్ చేయడానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్/పబ్లిక్ రిలేషన్స్ సంస్థలు తప్పనిసరి అవుతున్నాయి. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్‌వర్కింగ్ స్కిల్స్ ఉన్న ఉత్సాహవంతులైన, చురుకైన అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్‌మెంట్/పబ్లిక్ రిలేషన్స్ కెరీర్ నూరుశాతం సరిపోతుంది. కష్టపడి పనిచేసే తత్వం, గంటల కొద్దీ పనిచేసే ఓపిక, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నవారు ఈ కెరీర్‌లో సులభంగా రాణిస్తారు. దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్లు సర్టిఫికెట్ నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

సర్కారీ కొలువులు: ఉద్యోగ భద్రతతోపాటు మెరుగైన భవిష్యత్తుకు వేదికలు... ప్రభుత్వ కొలువులు. కింది స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు మొదలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు బ్యాచిలర్‌‌స డిగ్రీ అర్హతతో పోటీ పడొచ్చు. వందల సంఖ్యల్లో ఖాళీలకు లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయంటే సర్కారీ కొలువులకు ఉన్న ఆదరణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు అనేకం. క్రమబద్ధమైన, స్థిరమైన జీవనం కోరుకునేవారు ఈ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్.. విభాగమేదైనా ప్రభుత్వ కొలువులకు యువత పోటీపడొచ్చు. పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు అందుకు తగ్గట్టుగా శ్రమిస్తే కోరుకున్న కొలువు ఖాయం అవుతుంది.

ప్రభుత్వ రంగ సంస్థలు: కార్పొరేట్ కంపెనీలకు ఏ మాత్రం తీసిపోకుండా పోటీపడుతూ అధిక వేతనాలు చెల్లించే కంపెనీలు.. ప్రభుత్వ రంగ సంస్థలు. వీటిలో మహారత్న, నవరత్న, మినీరత్న అనే కేటగిరీలున్నాయి. మినీరత్నలో మళ్లీ రెండు కేటగిరీలున్నాయి. మొత్తంగా దేశంలో 7 మహారత్న, 17 నవరత్న, 71 మినీరత్న కంపెనీలున్నాయి. వీటిలో శాశ్వత ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్థులకు అత్యుత్తమ జీత భత్యాలు, పదోన్నతులు, ఇతర సౌకర్యాలు లభిస్తున్నాయి. ఇవి కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేని స్థిరత్వం ఉండే ఉద్యోగాలు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభ ప్రభావం ఉండని కొలువులు.

ఆసక్తికే ప్రాధాన్యం!
‘‘బ్యాచిలర్‌‌స డిగ్రీ స్థాయిలో అభ్యసించిన కోర్సులకు సంబంధించిన అభ్యర్థులు తమ ఆసక్తి, అభిరుచికి తగిన కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలి. డబ్బు ముఖ్యమైనదే అయినప్పటికీ కెరీర్ ఎంపికలో వేతనాలకు అవసరానికి మించిన ప్రాధాన్యత ఇవ్వొద్దు. ఏదైనా ఒక రంగంలో అడుగుపెట్టే ముందు తమ అభిరుచులు, సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. ఆ రంగంలో పోటీ, సవాళ్లను ఏమేరకు తట్టుకోగలరో తెలుసుకోవాలి. ఒక వేళ వేతనం ఆశించినంతగా లభించకపోతే నిరుత్సాహపడొద్దు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. భవిష్యత్తులో మీకు నచ్చిన రంగంలోనే ఎక్కువ సంపాదన పొందే అవకాశం లేకపోలేదు. కాబట్టి కెరీర్ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.’’
డా.అడపా రామారావు, డీన్, కౌన్సెలింగ్ అండ్ కెరీర్ గెడైన్స్, జీఆర్‌ఐఈటీ
Published date : 09 Sep 2014 11:44AM

Photo Stories