Skip to main content

స్వేచ్ఛకు, సంపాదనకు.. ఫ్రీలాన్సింగ్

‘ఒత్తిడి’ ఊసే లేని, ‘బాసిజానికి’ తావే లేని.. తనదైన స్వేచ్ఛా ప్రపంచంలో స్వతంత్రంగా పనిచేస్తూ, చేతి నిండా సంపాదిస్తూ.. ‘మేధస్సు’ పునాదిపై ‘ఆధునిక సాంకేతికత’ ఆసరాతో చక్కని కెరీర్ నిర్మాణానికి వీలు కల్పిస్తోంది ఫ్రీలాన్సింగ్. <br/> ఇంటి దగ్గరే ఉండి, ఇష్టమొచ్చినప్పుడు పనిచేసుకుని, ఆదాయాన్ని గడించే ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు ఇప్పుడు అందరినీ, ముఖ్యంగా యువత దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వృత్తి, వ్యక్తిగత జీవితాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేందుకు కూడా వీలుకల్పించే ఫ్రీలాన్సింగ్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించాలనుకునే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫోకస్..

విరాజ్ ఆనంద్.. హైదరాబాద్‌కు చెందిన ఫ్రీలాన్స్ ఉద్యోగి. గతంలో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేసేవాడు. వెబ్ టెక్నాలజీపై మంచి పట్టుండటంతో రెండేళ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలి, ఫ్రీలాన్సర్‌గా పని చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్నెట్ సాయంతో క్లయింట్లకు చేరువయ్యాడు. సొంతంగా వెబ్ పోర్టల్స్‌ని రూపొందిస్తూ గతంలో తనకొచ్చే జీతం కంటే మూడింతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు.

మహతీ రామచంద్రన్.. ఎంబీఏ చదివి హెచ్‌ఆర్‌గా వివిధ సంస్థల్లో పన్నెండేళ్లపాటు పనిచేసింది. భర్త వ్యాపారంలో బిజీగా ఉండటంతో పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే ఉంటోంది. పిల్లలు స్కూల్‌కి వెళ్లాక ఖాళీగా ఉండటం బోర్‌గా అనిపించడంతో ఫ్రీలాన్సర్‌గా మారింది. తన అనుభవంతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలనుకుంటున్న వారికి సలహాలు, సూచనలు అందిస్తూ ‘ఫ్రీలాన్సర్’గా విజయపథంలో పయనిస్తోంది.

పాశ్చాత్య దేశాల్లో పాపులర్
అమెరికా, ఇంగ్లండ్ తదితర పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్న ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు మన దేశంలో గత రెండేళ్ల నుంచి బాగా పాపులర్ అవుతున్నాయి. యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం 53 మిలియన్ల ఫ్రీలాన్స్ ఉద్యోగాలతో యూఎస్ మొదటి స్థానంలో ఉండగా 15 మిలియన్లతో ఇండియా రెండో స్థానంలో ఉంది. మన దేశంలో ఏడాదికి దాదాపు 10-15 లక్షల మంది ఫ్రీలాన్సర్లుగా మారుతున్నారని అంచనా. ఫ్రీలాన్సర్స్, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్, టెంపరరీ వర్కర్స్ ఇలా రకరకాల పేర్లతో పనిచేస్తూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఫ్రీలాన్సర్‌గా మారుతున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, 20-30 ఏళ్ల మధ్య ఉన్న యువతే. మహిళలు కుటుంబ బాధ్యతల వల్ల ఎక్కువ సమయం ఆఫీసులో కూర్చుని పనిచేయడం కంటే ఫ్రీలాన్సర్‌గా పనిచేయడం వైపే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు సంస్థలు కూడా అవకాశం కల్పిస్తున్నాయి.

సంపాదన చూస్తే షాకింగ్
రోజువారీ ఉద్యోగ విధుల్లో రెగ్యులర్ ఉద్యోగులకు సాధారణంగా ఎదురయ్యే సమస్యలు ఫ్రీలాన్సింగ్‌కు ఉండవు. ఒత్తిడి, బాసిజం, ఆఫీస్ రాజకీయాలు.. వంటి వాటి ఊసే లేని ‘సొంత స్వేచ్ఛా కార్యాలయం’లో టాలెంట్‌తో ఆర్జించే అవకాశం ఫ్రీలాన్సర్లకు ఉంటుంది. నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన ఫ్రీలాన్సర్లు ప్రస్తుతం బాగానే సంపాదిస్తున్నారు. ఫ్రీలాన్సర్‌గా మారాలనుకుంటున్న ప్రొఫెషనల్స్, సంస్థలకు మధ్య వారధిగా పనిచేస్తున్న ‘ఫ్లెక్సింగ్ ఇట్’ సంస్థ అంచనా ప్రకారం అనుభవం, ప్రతిభతో ఫ్రీలాన్సర్లు భారీగానే సంపాదిస్తున్నారు.

విభాగాల వారీగా వేతనం
డేటా అనాలసిస్ విభాగంలో గంటకు రూ.400-800లు, కార్పొరేట్ ట్రైనింగ్ విభాగంలో 4-5 గంటల సెషన్‌కు రూ.20 వేలు, ప్రోగ్రామింగ్ అండ్ వెబ్‌సైట్ డి జైనింగ్ విభాగంలో రోజుకు రూ.15-20 వేలు, ఈ-ట్యూటరింగ్‌లో చిన్న తరగతులకు గంటకు రూ.150-200, ప్రొఫెషనల్ కోర్సులకు గంటకు రూ.600-800, ఫొటోగ్రఫీలో రోజుకు రూ.3-5 వేల వరకు చెల్లిస్తారు.

ప్రాజెక్ట్ పొందాలంటే..?
ఫ్రీలాన్సర్‌గా మారి ప్రాజెక్ట్‌లు సొంతం చే సుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. వివిధ ఫ్రీలాన్సింగ్ అవకాశాలను కల్పిస్తున్న వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ ప్రొఫైల్‌కు సరిపడే ప్రాజెక్టులను పొందొచ్చు.

జాగ్రత్తలు
ఫ్రీలాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి రాణించడమంటే అనుకున్నంత సులభమేమీ కాకపోయినా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే విజయం సాధించడం కూడా కష్టం కాదు.

స్పష్టత ముఖ్యం
తొలుత ఫ్రీలాన్సర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకున్నప్పుడు దాని ద్వారా మీరేం ఆశిస్తున్నారు? మీ లక్ష్యం ఏమిటి? ఈ వృత్తికి ఎలా న్యాయం చేయగలుగుతారు? దీనికోసం ఎంత సమయం కేటాయించగలరు? ఎలాంటి క్లయింట్లతో పనిచేయాలనుకుంటున్నారు? మీకు నైపుణ్యమున్న విభాగంపై మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉంది? తదితర అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. అన్నీ బాగున్నాయనుకుంటే అప్పుడే ఫ్రీలాన్సింగ్‌లోకి అడుగుపెట్టాలి.

స్వీయ విశ్లేషణ
అవకాశాల కోసం ప్రయత్నించే ముందు ఒకసారి మీ అర్హతలు, నైపుణ్యాలపై స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ప్రధాన నైపుణ్యంతోపాటు ఇతర స్కిల్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మెరుగుపరచుకోవాలి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నాలెడ్జ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

పది మందికి తెలిసేలా..
మీ గురించి, నైపుణ్యాల గురించి పది మందికి తెలిసేలా ఒక పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడం ముఖ్యం. దీనికోసం ఎక్కువ శ్రమ పడకుండా మీ నైపుణ్యాలతోపాటు మీ పనితనాన్ని తెలియజేసేలా ఫ్రీలాన్స్ వర్కింగ్ వెబ్‌సైట్లలో, ఫేస్‌బుక్ లేదా బ్లాగ్‌లలో మీ ప్రొఫైల్ వీలయినంత ఎక్కువ మందికి చేరువయ్యేలా అప్‌లోడ్ చేయాలి. మీ ప్రొఫైల్ ఇతరుల కంటే భిన్నంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటే అవకాశాలు సులభంగా వస్తాయి.

క్లయింట్ ఎంపికలో జాగ్రత్త
మీ ప్రొఫైల్ నచ్చి మీతో కలిసి పనిచేయాలనుకుంటున్న క్లయింట్లు మిమ్మల్ని సంప్రదించినప్పుడు వారితో చర్చల సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీపై వారికి నమ్మకం కలిగేలా చేస్తూనే.. పని, విధి విధానాలు, నిబంధనలు, పారితోషికం, డిపాజిట్స్ అండ్ పేమెంట్ టైమ్‌లైన్స్, డెడ్ లైన్స్, కాపీరైట్ నిబంధనలు, కంపెనీ పూర్వాపరాలు తదితరాలను స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అనంతరం స్నేహితులు, సీనియర్లతో చర్చించి అన్ని విధాలా సరైనదనిపిస్తే ప్రాజెక్టును అంగీకరించాలి.

గడువులోపు పూర్తి చేయాలి
ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు ముగిశాక, పని ప్రారంభించే ముందు ఏ విధంగా చేయాలి? ఎన్ని రోజుల్లో పూర్తిచేయాలి? రోజుకు ఎంత సమయం కేటాయించాలి? తదితర అంశాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలి. తర్వాత దానికి అనుగుణంగా ఉత్సాహంగా పనిచేసి, గడువులోపు పూర్తిచేయాలి. ఒక్కసారి అనుకున్న సమయానికి పని పూర్తిచేసి, అద్భుతమైన పనితీరును కనబరిచి క్లయింట్‌ను ఆకట్టుకుంటే ఫ్రీలాన్సింగ్ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది.

ప్రస్తుతం చాలా మంది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. కానీ, వారిలో కెరీర్ పరంగా సరైన ఎదుగుదల లేదు. సరైన ప్లానింగ్, అవగాహన లేకపోవడం; ఏదో పార్ట్‌టైం జాబ్ మాదిరి చేయడం వంటివి దీనికి కారణాలు. అలా కాకుండా ఫ్రీలాన్సింగ్‌ను కెరీర్‌గా ఎంపిక చేసుకున్నవారు ప్రతి ప్రాజెక్ట్‌ను సొంత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లా భావించి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా పనిచేయాలి. ఒక్కసారి మార్కెట్లో బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగితే ఫ్రీలాన్సింగ్‌ను మించిన కెరీర్ మరొకటి ఉండదు.
-మురళి బుక్కపట్నం, ట్రస్టీ, టై గ్లోబల్, హైదరాబాద్ చాప్టర్.
Published date : 23 Aug 2016 11:45AM

Photo Stories