సుస్థిర కెరీర్‌కు..రీ–స్కిల్లింగ్ !
ఫ్రెషర్..
మరికొద్ది రోజుల్లో సర్టిఫికెట్ చేతికందనుందనే ఆనందం! నాలుగేళ్ల కృషి ఫలితంగా బీటెక్ పూర్తవుతోందనే సంతోషం! మరోవైపు జాబ్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్స్, తాజా సర్వేలపై ఆందోళన! సర్టిఫికెట్లు సరే.. స్కిల్స్ మాటేంటి?’ అంటున్న కంపెనీల «ధోరణితో భవిష్యత్‌పై బెంగ!
ట్రైనీ..
రాత పరీక్ష, ఇంటర్వ్యూలను దాటి.. కొలువులో చేరి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. కానీ, కంపెనీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందేనంటూ యాజమాన్యం నుంచి హెచ్చరికలు! ప్రొబేషన్ పూర్తికాకుండానే ఉద్యోగ భద్రతపై ఆందోళన!
సీనియర్..
సంస్థలో పదేళ్ల అనుభవం.. అంచెలంచెలుగా ఎదుగుతూ టీమ్‌ను నడిపించే స్థాయి! ఎన్నో టాస్క్‌లను విజయవంతంగా పూర్తిచేసి కంపెనీ వృద్ధిలో కీలకంగా నిలిచిన ఘనత! అయినా ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోక తప్పదనే సంకేతం!
ఇలా.. ఫ్రెషర్స్, ట్రైనీ, మిడిల్ లెవల్, సీనియర్ లెవల్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఎదురవుతున్న సమస్య.. స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్. కాబట్టి కాలేజీలో చదువుతున్న విద్యార్థులతోపాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం తమ తమ రంగాలకు సంబంధించిన నూతన నైపుణ్యాలు, టెక్నాలజీల గురించి తెలుసుకోవాలి. వాటిని పరిశ్రమలో ఏ స్థాయిలో అమలుచేస్తున్నారనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి.
సేవా రంగం నుంచి సాఫ్ట్‌వేర్ వరకు..
జాబ్ మార్కెట్‌లో ప్రస్తుతం ‘రీ–స్కిల్లింగ్’ అనే మాట సర్వీస్ సెక్టార్ నుంచి సాఫ్ట్‌వేర్ రంగం వరకు వినిపిస్తోంది. కారణం.. ఆయా రంగాల్లోని సంస్థలు కొత్త నైపుణ్యాలతో ఉత్పత్తులు, సర్వీసులను అందిస్తుండటమే. దీంతో ఆయా విభాగాల్లో కొలువుదీరాలంటే సంబంధిత నైపుణ్యాలపై పట్టు సాధించక తప్పని పరిస్థితి. కాబట్టి ‘తరగతి గదిలో నేర్చుకున్నది సరిపోతుంది, ఇంటర్న్‌షిప్ అనుభవం కలిసొస్తుంది’ అనే ధోరణికి స్వస్తి పలకాలంటున్నారు నిపుణులు.
క్యాంపస్‌లో కొలువు దక్కినా!
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లోనే ఉద్యోగం పొందినా.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ‘ఆఫర్ లభించింది కదా..!’ అని రిలాక్స్ అవుదామనుకుంటే కంపెనీలు అంగీకరించే పరిస్థితి లేదు. ఫ్రెషర్స్‌కే కాదు సీనియర్ లెవల్‌లోనూ రీ–స్కిల్లింగ్ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా కంపెనీలు యంగ్ మిలీనియల్స్ (1980–96 మధ్య పుట్టిన వారు)పై ప్రత్యేకంగా దృష్టిసారించాయి. వారిలో రీ–స్కిల్లింగ్‌పై ఉన్న ఆసక్తి, ఆ దిశగా వారు చేస్తున్న కృషిని నిరంతరం గమనిస్తున్నాయి. దీన్ని గుర్తించే క్యాంపస్ డ్రైవ్స్‌లో రూ.లక్షల ప్యాకేజ్‌తో ఆఫర్లు అందుకున్న వారు సైతం రీ–స్కిల్లింగ్ బాట పడుతున్నారు.
రీ–స్కిల్లింగ్‌కు మార్గాలు..
కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎలా? ఈ విషయంలో ఆందోళన సహజం. అలాంటి వారి కోసం ప్రస్తుతం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆన్‌లైన్ టూల్స్ ముఖ్యమైనవి. వీటి ద్వారా వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు సైతం ఆన్‌లైన్ సర్టిఫికేషన్స్ అందిస్తున్నాయి. డిజైన్, డెవలప్‌మెంట్, మార్కెటింగ్‌లకు సంబంధించి కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. నిరంతర అన్వేషణ, నిత్య అధ్యయనాలతోæ కొత్త నైపుణ్యాలపై పట్టు సాధించడం ఏమంత కష్టం కాదు.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ).. వేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీ. దీని ఆధారంగా మెషీన్లు, కంప్యూటర్లను అనుసంధానించి స్వల్ప సమయంలో సంబంధిత టాస్క్‌లను పూర్తిచేయొచ్చు. వాస్తవానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిధి విస్తృతమైంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ ప్రాధాన్యం పెరుగుతోంది.
కృత్రిమ మేధ..
నూతన నైపుణ్యాలు, రీ–స్కిల్లింగ్ పరంగా ఇటీవల కాలంలో కృత్రిమ మేధ కీలకంగా మారుతోంది. మానవ ప్రమేయాన్ని తగ్గించి రోబోలు, వర్చువల్ టెక్నాలజీల సహకారంతో కార్యకలాపాలను నిర్వహించడం కృత్రిమ మేధ ప్రత్యేకత. దీనివల్ల కంపెనీలపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ కారణంగానే కృత్రిమ మేధ విస్తృతమవుతోంది.
మెషీన్ లెర్నింగ్
పనిలో మానవ ప్రమేయాన్ని తగ్గించే మరో విధానం మెషీన్ లెర్నింగ్. ఇందులో టాస్క్ నిర్వహణ కోణంలో సంబంధిత మెషీన్‌కు అవసరమైన ప్రోగ్రామ్‌ను రూపొందించి.. సొంతంగా డేటా సేకరణ, విశ్లేషణ వంటి కార్యకలాపాలు నిర్వహించేలా మెషీన్లను తీర్చిదిద్దుతారు. దీనికి తగిన ప్రోగ్రాములు, చిప్‌ల రూపకల్పన, సర్క్యూట్ల డిజైన్లు అవసరం. అందువల్లే ఇప్పుడు ఈ కోణంలో నిపుణుల అవసరం పెరుగుతోంది. కాబట్టి రీ–స్కిల్లింగ్ కోణంలో ఫ్రెషర్స్ నుంచి సీనియర్ లెవల్ ఉద్యోగుల వరకు మెషీన్ లెర్నింగ్‌పై అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి.
పై అంశాలతోపాటు రీ–స్కిల్లింగ్ కోణంలో డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, డేటా మేనేజ్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
సర్టిఫికేషన్స్ :
రీ–స్కిల్లింగ్‌లో భాగంగా కొన్ని సంస్థలు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ, ఫ్రెషర్స్‌కు ఈ సౌకర్యం ఉండదు. కాబట్టి వారంతా వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న ఆన్‌లైన్ సర్టిఫికేషన్స్‌ను అందిపుచ్చుకోవాలి. తద్వారా రీ–స్కిల్లింగ్ బాటలో ముందడుగు వేయొచ్చు. ప్రస్తుతం ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ, జావా, శాప్ తదితర సంస్థలు నూతన నైపుణ్యాలపై సర్టిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఫ్రెషర్స్ వీటిని వినియోగించు కోవాలి.
ఆన్‌లైన్ వనరులను సద్వినియోగం చేసుకోవాలి..
రీ–స్కిల్లింగ్ పరంగా ఆన్‌లైన్ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. వాస్తవానికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) అంచనాల ప్రకారం అనేక విభాగాల్లో నిపుణుల కొరత మిలియన్లలో ఉంది. ఐటీ, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో మాత్రం న్యూ స్కిల్స్, రీ–స్కిల్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీన్ని గమనించి అభ్యర్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలి.
– రమేశ్ లోగనాథన్, ప్రోగ్రెసివ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్.